– పాత్రికేయం పరువు తీసిన ప్రెస్‌క్లబ్ ఎన్నికలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రజాస్వామ్యంలో నాలుగోస్తంభం అని భావించే.. భ్రమించే.. మీడియా పరువు హైదరాబాద్ సోమాజీగూడ చౌరస్తాలో అడ్డంగా పోయింది. జర్నలిస్టుల అరుపులు, నినాదాలు, నిరసనలతో పాత్రికేయం సిగ్గుతో చితికిపోయింది. ఆరకంగా జర్నలిస్టులు ‘జనరలిస్టులు’గా మారిపోయారు. సాధారణ పంచాయితీ ఎన్నికల్లో కూడా కనిపించని కనీస హుందాతనం.. తీస్‌మార్ఖాన్, పచ్చీ స్ మార్ఖాన్లమని చెప్పబడే జర్నలిస్టు మహాశయులు మెంబర్లుగా ఉన్న ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. ఇక్కడా కులాలు, మతాలు, ప్రాంతాల ముసుగులు. పేరుకు మాత్రం సమాజాన్ని ఉద్ధరించే జర్నలిస్టులు. తెరపైన కులమతాలకు అతీతులైన పత్రికాప్రతినిధులు. తెరవెనుక మాత్రం కులప్రతినిధుల పాత్రలు. ఈ పాత్రలే అంతా కలసి ప్రెస్‌క్లబ్ పరువును పక్కనే ఉన్న ట్యాంక్‌బండ్‌లో కలిపాయి. ప్రతిష్టాత్మక ప్రెస్‌క్లబ్ ఎన్నికలను పంచాయితీ.. అంతకుమించిన కింది స్థాయికి దిగజార్చాయి. బయట ఉప్పు-నిప్పులా ఉండే సాక్షి-ఈనాడు పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులంతా ఒకే ప్యానెల్‌లో దర్శనమివ్వడం, వాటిలో పెద్దతలకాయలు కూడా ఓటింగ్ పర్యవేక్షణకు రావడం వంటి వింతలూ దర్శనమిచ్చాయి. అది వేరే కథ.
అసలేం జరిగిందంటే…
ఆరోజు ఆదివారం..
ఉదయం నుంచే ఎన్నికల కోలాహలం షురువయింది. అభ్యర్ధులు లోపల, వారి మద్దతుదారులు బయట ఎవరి ప్రచారంలో వారున్నారు. ఇక గేటు బయట వారి అనుచరుల హడావిడి. మధ్యలో ‘జర్నలిస్టు కమ్
రాజకీయ నాయకుల’ రంగప్రవేశం, ఉభయకుశలోపరి పలకరింపులూ. మధ్యాహ్నం చికెన్‌తో భోజనం. అలా సాయంత్రం పోలింగ్ ముగిసే వర కూ పోలింగ్ వ్యవహారం బాగానే సాగింది. అసలు గత్తర ఆ తర్వాతే ఆరంభమయింది.
రాత్రి పదకొండు ప్రాంతంలో ప్రెస్‌క్లబ్ ఎదురుగా ఉన్న మా ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళుతున్న నేను, ప్రెస్‌క్లబ్‌లో సందడి చూసి ఒక ఓటరుగా లోపల ఏం జరుగుతుందోనన్న ఉత్సాహంతో లోపలికి వెళ్లా. అప్పటికే అధ్యక్ష పదవి మినహా, అన్ని పదవులకూ జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటి ంచేశారు. కొందరు ఆ ఉత్సాహంతో మెడలో పూలదండలతో బయటకొస్తున్నారు. మేము కౌంటింగ్ హాలు బయట నుంచి
లోపల దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ అధ్యక్షుడిగా పోటీ చేసిన సూరజ్ భరద్వాజ్- వేణుగోపాల్ నాయుడు, వారి మద్దతుదారులు, అభ్యర్ధులు కనిపించారు. ఎన్నికల అధికారులిద్దరితో భరద్వాజ్ ఏదో వాదిస్తున్నాడు. అదే సమయంలో వేణుగోపాల్‌నాయుడు కూడా వాదనకు దిగినా కొంత సౌమ్యంగానే కనిపించారు. ఎందుకంటే అప్పటికే ఆయనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి.
అయితే ఆయన మద్దతుదారులు మాత్రం సూరజ్ మద్దతుదారులతో కాస్త బిగ్గరగానే వాదులాటకు దిగడం కనిపించింది. ఈలోగా బయట ఉన్న వారంతా ఆసక్తిగా కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లారు. వారితో పాటూ నేనూ వెళ్లా.నేను అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఉన్న రంగాచార్యులు గారిని విషయమేమిటని ఆరా
తీశా. నేను 95లో ఆంధ్రభూమిలో చేరినప్పుడు ఆయన మాకు సిటీ డెస్క్ ఇన్చార్జిగా పనిచేశారు. అలా కొన్నేళ్లు ఆయనతో కలసి పనిచేసిన చనువు ఉంది. ఆయన కూడా నన్ను ‘ఏం మార్తి?’ అని సరదాగా అంటుంటారు.
ఆయన ఏదో చెప్పేలోగా, సూరజ్ లా పాయింట్లు తీయడం ప్రారంభించాడు. ఓటింగుకు స్వస్తిక్, ఇంటూ ముద్రలు ఎలా అనుమతించారు? ఒక బ్యాలెట్ ఎలా కనిపించకుండా పోయింది? మీరు రెండు గుర్తులతో ముద్రలు అనుమతిస్తున్నట్లు మీరు అభ్యర్ధులకు గానీ, ఓటర్లకు గానీ ముందస్తు సమాచారం ఇచ్చారా?
స్వస్థిక్ గుర్తు ఉన్నవి మాత్రమే తీసుకుని, ఇంటూ ఉన్నవి తొలగించండి. ఓటేసిన తర్వాత వేలిపై ఇంకు బదులు స్కెచ్ ఎలా పెట్టారు? మీరు మొదటి నుంచి పక్షపాతంతో వ్యవహరస్తున్నారు. బైలాస్‌కు విరుద్ధంగా నామినేషన్లు ఎందుకు తీసుకున్నారు? .. ఇలాంటి ప్రశ్నలతో సూరజ్ రిటర్ని,గ్ ఆఫీసర్ హేమసుందర్ గారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
అంటే మీకు ఓట్లు తక్కువ వచ్చాయి కాబట్టి ఇవన్నీ అడుగుతున్నారు? ఎక్కువ వస్తే అడగరు కదా? అన్నది హేమసుందర్ ఎదురుప్రశ్న. ఈ సీన్ చూస్తూ, వారి వాదనలు వింటున్న నాకు మైండు పోయినంత పనయింది. ఓట్లు వేసిన మేధావులనబడే జర్నలిస్టు నాయకులకు రాని ఈ సందేహం అధ్యక్షపదవికి పోటీ
చేసిన సూరజ్‌కు రావడం నిజంగా ఆశ్చర్యమనిపించింది. సూరజ్ సందేహంతో కూడిన ప్రశ్నల్లో సమంజసం ఉందనిపించింది. ఏ ఎన్నికల్లో అయినా స్వస్థిక్ గుర్తు ఉన్న ముద్రలే అనుమతిస్తారు. కానీ మేధావుల గుంపు చేరే ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో, దానితోపాటు ఇంటూ గుర్తు కూడా చొరబడటం నాకు ఆశ్చర్యం వేసింది. అలాగయితే వేలిగుర్తు కూడా అనుమతించాలి కదా?
అసలు వివాదానికి కారణం అదేనని గ్రహించి, నేను ఎన్నికల అధికారులిద్దరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేశా. ఎందుకు మీరు ఆ విధంగా రెండు ముద్రలు అనుమతించారని అడిగా. ఎలా వచ్చిందో, ఎవరు అనుమతించారో తమకు తెలియదన్నది తొలుత రంగాచార్యుల గారి నుంచి వచ్చిన సమాధానం. మరి అలాంటప్పుడు ఫలితాలు ప్రకటిస్తే, వ్యవహారం మరింత ముదురుతుంది కాబట్టి ఇప్పటివరకూ ప్రకటించిన ఫలితాలు నిలిపివేస్తే ఉద్రిక్తత చల్లారుతుందని సూచించా. అప్పటికే వయసులో పెద్దలయిన ఇద్దరు ఎన్నికల అధికారులు తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య ఉన్నారు. అది వారి ఆరోగ్యంపై ప్రభావం పడకూడదనే నేను ఆవిధంగా సూచించా. దానికి హేమసుందర్ గారు అంగీకరించలేదు. తర్వాత రెండు ముద్రలపై ఆయన స్పందిస్తూ ‘రెండు ముద్రలు ఎలా వచ్చాయో నాకూ తెలియద’న్నారు.
ఈ క్రమంలో మళ్లీ వాగ్వాదం మొదలయింది. మాకు తెలియకుండా రెండు ముద్రలు వచ్చాయన్న విషయం లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూరజ్, ఆయన ప్యానల్ అభ్యర్ధులు ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. అందుకు స్పందించిన రంగాచార్యులు గారు తమకు ముద్రల విషయం తెలియదని నిజాయితీగా చెప్పడం, దానిని అక్కడున్న వారు వీడియోల్లో బంధించడం కనిపించింది.
ఈలోగా హాల్‌లోకి ఎవరో వచ్చారు. వారిని ఎప్పుడూ చూసిన గుర్తు కూడా లేదు. పెద్దగా జై తెలంగాణ నినాదాలు. రాష్ట్రం విడిపోయి, స్వపరిపాలన వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ నినాదాలు మళ్లీ వినిపించడం కొంచెం ఆశ్చర్యపరిచింది. అది వేరే విషయం. బహుశా ఓటర్లు కావచ్చుకున్నాం అందరం. వచ్చిన సాగర్ కూడా జర్నలిస్టు లీడరు కావడంతో, వ్యవహారం శాంతింపచేయడానికి వచ్చారనుకున్నాం. ఆయనా ఆ ప్రయత్నమే చేశారు. నేనూ ఆయనను తొలిసారి చూశా. నినాదాలు చేస్తున్న వారిని సాగర్ వారించారు. ఆయన కూడా వివాదానికి కారణమయిన రెండు ముద్రల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేసి, ఎన్నికలు రద్దు చేసి, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మీరు తమకు తండ్రిలాంటి వాళ్లు, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోమని అధికారులను కోరారు.
కొద్దిసేపటి తర్వాత కొందరు వ్యక్తులు వచ్చి బ్యాలెట్ బాక్సును కొంచెం ముందుకు ఎత్తుకువెళ్లారు. దానిని అక్కడున్న వాళ్లంతా ప్రతిఘటించారు. ఈలోగా ఎవరో ఒక వ్యక్తి పరుగున వెళ్లి, ఆ బాక్సును తిరిగి తెచ్చి, మేం ఉన్న ఎన్నికల అధికారుల స్థలంలోనే తీసుకువచ్చి పెట్టారు. నేను ఈలోగా ఇద్దరు ఎన్నికల అధికారులకు పరిస్థితి తీవ్రత గుర్తు చేస్తూ, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మరిన్ని సమస్యలు వస్తాయని సూచించా. అప్పటికే సమయం 3 గంటలవుతోంది. మరో గంటయితే తెల్లవారుతుంది. అందరికీ ఇళ్ల నుంచి ఆందోళనలతో కూడిన ఫోన్లు. పైగా ఇద్దరూ వయసులో పెద్దవాళ్లు. ఇద్దరికీ అనారోగ్య సమస్యలు. అది తెలిసే నేను వారికి తుది నిర్ణయం తీసుకోమని సూచించా.
రంగాచార్యులు గారు సానుకూలంగా స్పందించి, హేమసుందర్‌గారితో చర్చించారు. దానితో హేమసుందర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చి, ఎన్నికల ప్రక్రియలో వాడిన రెండు ముద్రల విషయంలో న్యాయసలహా తీసుకుని, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ లిఖిత పూర్వక నోటీసు అంటించారు. దానితో వ్యవహారం సర్దుమణిగింది. అప్పటికే తెల్లవారింది.
దీనికి ముందు.. కొందరు వ్యక్తులు బ్యాలెట్‌లో నీళ్లు పోయడం కలకలం సృష్టించింది. వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత, నా సూచనతో ఎన్నికల అధికారి రంగాచార్యులు గారు వాటికి తాళం వేయించారు. ముద్రల వివాదానికి తోడు బ్యాలెట్ బాక్సులో నీళ్ల వివాదం తలనొప్పితో పాపం అధికారులు నీరసించిపోయారు. సరే. లోపల బ్యాలెట్ పేపర్ల సంగతేమిటో చూద్దామన్న నా సూచన మేరకు తెరిచే ప్రయత్నం చేస్తే, వాటి తాళం చేతులు ఆ గొడవలో ఎక్కడో కిందపడిపోయాయి. తర్వాత అందరూ తాళం చెవి వెతికి, బ్యాలెట్ బాక్సు తెరిచారు. లోపల కొన్ని పేపర్లు తడిసినట్లు కనిపించాయి. వెంటనే తాళం వేయించాం. ఇదీ ప్రెస్‌క్లబ్‌లో అర్ధరాత్రి జరిగిన హైడ్రామా. తర్వాత కథ ఖాకీల వద్దకు చేరింది. ఇప్పుడు ఆ బాలెట్ బాక్సులో పోలయిన బ్యాలెట్ పత్రాలు అన్నీ ఉన్నాయా? లేవా? ఎన్ని నీళ్లలో తడిసిపోయాయి? మరి ఆ ప్రకారంగా ఎన్నికలు రద్దయినట్లా? కాదా? అన్నవి ప్రశ్నలు.
ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజం. కానీ ఇలాంటి ఎన్నికల అక్రమాలను ప్రశ్నించే పాత్రికేయ లోకంలోనే ఇన్ని అవకతవకలు జరగడం విషాదం. ఎన్నికల ముందు.. ఇంకా మూడేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో, ఎంతమంది మీడియాలో పనిచేస్తున్నారో డిక్లరేషన్ తీసుకోవడం అదో విచిత్రం. డిక్లరేషన్ ఇవ్వని వారిని, పక్క రాష్ట్రంలో సర్కారు కొలువు చేస్తున్న వారిని ఓటింగుకు అనుమతించడం బహు విచిత్రం అనిపించింది. అసలు ఈ విధానం అమలుచేసేందుకు ఉన్న అధికారమేంటన్నది సమాధానం లేని మరో ప్రశ్న.
( కౌంటింగ్‌లో ఈ వివాదానికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలో నేను కనిపించిన నేపథ్యంలో.. అందరూ నాకు ఫోన్లు చేసి ఏం జరిగిందని ఆరాతీస్తున్నారు. ఆవు వ్యాసం మాదిరిగా.. అంతమందికి సమాధానం చెప్పే ఓపిక లేక, జరిగిన కథను మీకు అందిస్తున్నా)