Suryaa.co.in

Editorial

కాపు మంత్రులకు ‘సొంత’ సెగ

– పార్టీకి మేమే ‘కాపు’ కాయాలా?
– పవన్‌పై దాడికి కాపులే దొరికారా?
– పవన్‌ను మీరెందుకు విమర్శిస్తున్నారు?
– రెడ్డి-బీసీ మంత్రులను ఎందుకు ప్రయోగించరు?
– సమన్వయకర్తలు, సలహాదారులు మాట్లాడరేం?
– మన వేలితో మన కన్ను పొడిపిస్తున్నారు
– మీకు రాజకీయ భవిష్యత్తు అవసరం లేదా?
– కాపు జాతికి దూరమవుతారు జాగ్రత్త
– కాపు మంత్రులపై కాపు సంఘాల ఒత్తిళ్లు
– పార్టీ ఆదేశాలు పాటించక తప్పదని కాపు మంత్రుల నిస్సహాయత
– రోజూ కాపుసంఘాలు తిడుతున్నాయని ఆవేదన
– తాము నిమిత్తమాత్రులమేనన్న నిస్సహాయత
– జగన్‌కు పాలేర్లుగా మారారని కాపు-బలిజ నేతల ఫైర్‌
– ‘పవన్‌పై మాటలదాడి’ ఎపిసోడ్‌లో కాపు మంత్రుల ఉక్కిరిబిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న కాపు మంత్రులకు సొంత కులంలోనే సెగ మొదలయింది. కాపు మంత్రులంతా శరపరంపరగా పవన్‌పై చేస్తున్న మాటలదాడి అనంతర పరిణామాలు, మంత్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వైసీపీలో పెత్తనం చేస్తున్న రెడ్లతో కాకుండా.. కాపులతో తిట్టించడం వల్ల మీ రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడతుందన్న కాపు సంఘాల హెచ్చరికలు.. సోల్‌మీడియాలో తమపై సొంత కులం యువకుల తిట్లపర్వాలతో, కాపు మంత్రులు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిణామాలన్నీ తమ రాజకీయ భవిష్యత్తు కింద ఎక్కడ నీళ్లు తెస్తాయన్న భయాందోళన కాపు మంత్రులను వెన్నాడుతోంది.

ఎంకిపెళ్లిసుబ్బిచావుకొచ్చినట్లు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ెపై ప్రతిరోజూ తిట్ల దండకం అందుకుంటున్న కాపు మంత్రులకు, సొంత సామాజికవర్గం నుంచి ప్రతిఘటన పెరుగుతోంది. సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ మాటల దాడి చేసిన ప్రతిసారీ.. కాపు మంత్రులను రంగంలోకి దింపి, వారితో పవన్‌పై ఎదురుదాడి చేయిస్తున్న తీరును కాపుజాతి జీర్ణించుకోలేకపోతోంది. ప్రధానంగా పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని కాపు యువకుల భరించలేకపోతున్నారు.

గత కొద్ది నెలలుగా కాపు మంత్రులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్‌, మాజీ మంత్రి పేర్ని నాని, కన్నబాబు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు వంటి కాపు ప్రముఖులంతా పవన్‌ కల్యాణ్‌పై మూకుమ్మడి దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా వైసీపీ నాయకత్వం, బీసీ మంత్రి జోగి రమేష్‌ను తెరపైకి తెచ్చింది. జోగి రమేష్‌ తప్ప, పవన్‌పై ఎదురుదాడి చేస్తున్న వారంతా కాపులే కావడం గమనార్హం. రెడ్లను కాకుండా కాపులపై కాపులనే ప్రయోగిస్తున్న వైనం, అటు వైసీపీలోని కాపు నేతలకూ రుచించడం లేదు.

అయితే.. తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను కాపు మంత్రులే, దారుణమైన భాషలో విమర్శించడాన్ని కాపుయువత జీర్ణించుకోలేకపోతోంది. కోస్తాలో కాపు యువత దీనిపై కాపు సంఘాల వద్ద పంచాయితీ పెట్టి, కాపు మంత్రుల సంగతి తేల్చాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. దానికి స్పందించిన కాపు సంఘాల నేతలు, పవన్‌ను విమర్శిస్తున్న కాపు మంత్రులను ఫోన్‌ ద్వారా సంప్రదిస్తున్నారు. పవన్‌ను విమర్శించడం వల్ల మీ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, మంత్రులకు కాపు నేతలు సుతిమెత్తగా హితవు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సొం కులం వారి మనోభావాలు దెబ్బతీసి, మీ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టవద్దని సుతిమెత్తగా మందలిస్తున్నారు.

మంత్రివర్గంలో ఎంతోమంది రెడ్ల మంత్రులు-ఎమ్మెల్యేలు- కార్పొరేషన్‌ చైర్మన్లతోపాటు, నాలుగుప్రాంతాలకు సమన్వయకర్తలు, సలహాదారులు ఉన్నారు. మీరు మాత్రమే ఎందుకు రిస్కు తీసుకుంటున్నారని, వారంతా కాపు మంత్రులకు క్లాసు పీకుతున్నారు. వైసీపీ నాయకత్వం మన వేలితో మన కన్ను పొడిచే రాజకీయాలకు పాల్పడుతోందని కాపు జాతి భావిస్తోందని, నేతలు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారంలో ఉన్న రెడ్లను కాకుండా, పవన్‌పై కాపు మంత్రులనే ఎందుకు ప్రయోగిస్తున్నారన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలని, కాపు నేతలు మంత్రులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరో వైపు కాపు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో, పరిస్థితి మరింత భిన్నంగా కనిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ను విమర్శించిన ప్రతిసారీ, కాపు మంత్రుల నియోజకవర్గంలోని కాపు యువకులు- సంఘాలు, సోషల్‌మీడియా ద్వారా కాపు మంత్రులపై బూతు పురాణం అందుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లోని కాపు యువకులయితే, ‘అసలు ఈ మంత్రి కాపులకే పుట్టారా’అనే స్థాయి వరకూ వారి ఆగ్రహం కనిపిస్తోంది. మరికొందరు కాపు నాయకులు స్వయంగా కాపు మంత్రుల వద్దకు కాపుజాతి మనోభావాలు వారి దృష్టికి తీసుకువెళుతున్న పరిస్థితి. తాజా పరిణామాల నేపథ్యంలో కాపు జాతి ఆగ్రహం-అసంతృప్తి పరిశీలిస్తే, వచ్చే ఎన్నికల్లో పవన్‌ను విమర్శిస్తున్న కాపు మంత్రులెవరికీ, ఓటు వేసే సమస్య లేదని తెగేసి చెబుతున్న పరిస్థితి కాపు మంత్రుల నియోజకవర్గాల్లో కనిపిస్తోంది.

అటు కాపు మంత్రుల గోడు మరోలా ఉంది. కాపు సంఘాల నేతల వద్ద తమ పరిస్థితిని వెళ్లబోసుకుంటున్న వైచిత్రి. పవన్‌ను విమర్శించాలని తమకేమీ లేదని, కానీ పార్టీ ఆఫీసు నుంచి వచ్చే నోట్‌ను చదివి, ఆ ప్రకారం మాట్లాడాల్సిన బాధ్యత తమపై ఉందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవులు ఇచ్చినప్పుడు పార్టీ ఆదేశాలను పాటించాల్సిందే కదా? లేకపోతే వ్యక్తిగతంగా మేము నష్టపోతాం. కాపుల మనోభావాలను మేం పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించడం లేదు. మీరు కూడా మా పరిస్థితి అర్ధం చేసుకోండి అని కాపునేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్లు సమాచారం.

ఒకరిద్దరు కాపు మంత్రులు మాత్రం.. తమకు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసని, కాపు నేతల వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘పవన్‌ను తిట్టిన తర్వాత కాపులు ఎలా ఫీలవుతారో, వాళ్ల ఆగ్రహం ఎలా ఉంటుందో మాకు తెలుసు. మాకు ఇప్పటికే రోజూ వందలమంది కాపు కుర్రాళ్లు ఫోన్‌ చేసి బూతులు తిడుతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో మామీద ఎంత దారుణంగా పోస్టులు పెడుతున్నారో కూడా చూస్తున్నాం. చివరకు మా ఫ్రెండ్సు కూడా మాకు ముఖం చూపించడం మానేశారు. కానీ మేమేమీ చేయలేం. జగన్‌ను కాదని మేమేం చేయగలం’ అని కాపునేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

అయితే తాము అన్నింటికీ సిద్ధపడే పవన్‌ను తిడుతున్నామని, మరికొందరు కాపు మంత్రులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ‘జగన్‌ను చూసి మాకు ఓట్లేశారు తప్ప మమ్మల్ని చూసి ఎవరూ ఓటేయలేదు. కాబట్టి రేపు భారమంతా ఆయన మీదే వేశాం. జగన్‌ గాలి ఉంటే మేమూ గెలుస్తాం. లేకపోతే ఓడిపోతాం. అన్నిటికీ సిద్ధపడే మేం పవన్‌పై మాటలదాడి చేస్తున్నామ’ని కాపు మంత్రులు, కాపునేతల వద్ద అసలు విషయం వె ల్లడించారు.

కాగా పవన్‌ను విమర్శిస్తున్న కాపు మంత్రులకు సొంత నియోజకవర్గాల్లో ఠికాణా లేదని కాపు సంఘాలు విరుచుకుపడుతున్నారు. పవన్‌ను విమర్శిస్తున్న ఈ మంత్రలకు ఇళ్లలో భార్యలు కూడా ఓట్లేయరు. ఓ మంత్రి వేరొక కులం అమ్మాయిని కోడలిగా చేసుకున్నారు. ఆ అమ్మాయితో రేపు ఓటు వేయించుకోమనండి చూద్దాం’ అని కాపునాడు అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. పవన్‌ను తిట్టే కాపు మంత్రులంతా, జగన్‌ పాలెగాళ్లేనని ఆయన స్పష్టం చేశారు. ‘ఇప్పుడు పవన్‌ను తిట్టిపోస్తున్న ఈ కాపు మంత్రులంతా జగన్‌ ఇంట్లో పాలెగాళ్లు. వీళ్లకు రేపు ఏ ఒక్క కాపు కూడా ఓటేయరు. చివరకు వాళ్ల కుటుబ సభ్యులు కూడా ఓట్లేయరు. పేర్ని నాని రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడు. ముందు ఆయన రేపు బందరులో గెలుస్తాడో లేదో చూసుకోమనండి’ అని సవాల్‌ చేశారు.

పవన్‌ను విమర్శించే కాపుమంత్రులంతా రేపు రాజకీయంగా అడ్రసు లేకుండా పోతారని గాళ్ల సుబ్రమణ్యం హెచ్చరించారు. పవన్‌ మీద క్యాబినెట్‌లోని రెడ్లతో మాట్లాడించవచ్చు కదా? రెడ్డి ఎమ్మెల్యేలు, సలహాదారులతో మాట్లాడించవచ్చు కదా? కాపు మంత్రులతోనే తిట్టిస్తున్నారంటే, మా వేలితో మా కన్ను పొడుస్తున్నారన్నది కాపు జాతి గ్రహించింది. కాపు మంత్రులకు తమ నియోజకవర్గాల్లో కాపులతో సమావేశం నిర్వహించే ధైర్యం లేదని గాళ్ల విశ్లేషించారు. కాపులను చీల్చాలన్న పాత ఎత్తుగడకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు.

కాపు మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. కాపు-బలిజ జాతిలో పౌరుషం పెరిగేందుకు కారణమవుతున్నాయని, బలిజనాడు కన్వీనర్‌ ఓ.వి.రమణ వ్యాఖ్యానించారు. కమ్మ వర్గానికి చెందిన కొడాలిని ముందుపెట్టి చంద్రబాబును తిట్టించినట్లే, కాపు మంత్రులను ముందుపెట్టి పవన్‌ను తిట్టిస్తున్న వైసీపీ రాజకీయాలకు, ఇక కాలం చెల్లాయని అన్నారు. ‘నిజానికి కాపు మంత్రులకు పవన్‌ను తిట్టాలని మనసులో లేదు. కానీ రెడ్లు వారి మెడపై కత్తి పెట్టి చెప్పిస్తున్నారు. రెడ్డి కులానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులను కాకుండా, కాపును కాపుతోనే తిట్టిస్తున్నారు. దీనిని కాపు మంత్రులు ప్రతిఘటించకపోతే, వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. రెడ్లతో మాట్లాడించమని కాపు మంత్రులు ప్రశ్నించడం లేదంటే.. వారంతా జగన్‌కు ఎంత ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతోంది. కాపు మంత్రులతో పవన్‌ను తిట్టిస్తే లాభమనుకుంటే అది పిచ్చితనం. దానివల్ల కాపు-బలజ జాతి ఏకమవుతుందన్న విషయం జగన్‌కు తెలియడం లేద’ని రమణ విశ్లేషించారు.

LEAVE A RESPONSE