డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. పాచిపెంటలో రూ.1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి, డోలి మోతలు నివారణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రెండు వేల రహదారుల నిర్మాణానికి రూ.2,500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
గిరిజన గ్రామాల్లో డోలి మోతలు నివారణకు గిరి వైద్య ఆరోగ్య కేంద్రాలు (కంటైనర్ ఆసుపత్రులు) ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అదనపు వసతి అవసరమైన ఆశ్రమ పాఠశాలల్లో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ముఖ్య మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో శీతాకాలంలో చలి తీవ్రత నుండి దూరంగా ఉండుటకు పక్కా భవనాలు దోహదం చేస్తాయని ఆమె అన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల ఆహార మెనూ లో మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి చెప్పారు. కొత్త పల్లేలు, గ్లాసులు, దుప్పట్లు, బెడ్ షీట్లు పంపిణీ చేస్తామని ఆమె అన్నారు. విద్యార్థులు బాగా చదవాలి, తినాలి, ఆడాలని తద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని ఆమె చెప్పారు. పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో బాలికలు ముందంజలో ఉన్నారని, మీరు అన్నింటా రాణించాలని అన్నారు.
పాచిపెంట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కుమారి అనే విద్యార్థి మంత్రి రాక పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ వసతి గృహంలో 370 మంది విద్యార్థులకు తగిన మరుగుదొడ్లు లేవని, అదనపు మరుగుదొడ్లు నిర్మించాలని కోరగా నిర్మాణానికి అంచనాలు తక్షణం తయారు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వహక ఇంజనీరుకు మంత్రి ఆదేశించారు. రహదారి ప్రక్కన ఆశ్రమ పాఠశాల ఉన్నందున ప్రహారి గోడకు పైభాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు థింసా, పిరమిడ్స్, ఆసనాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనను నిర్వహించి అలరించారు. విద్యార్థులతో కలసి మంత్రి థింసా నృత్యం చేసి కళల పట్ల ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారి ఏ మణి రాజ్, తహసీల్దార్ డి రవి, సహాయ గిరిజన సంక్షేమ అధికారి కె శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.