– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో టెక్స్ టైల్స్ పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో టెక్స్ టైల్స్ పరిశ్రమ యజమానులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇన్సింటెవ్ లు, విద్యుత్ సరఫరాలో రాయితీలు, నూతన టెక్స్ టైల్స్ విధానంలో మార్పుల గురించి వివరించారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమల నిర్వహణ భారంగా మారిందన్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం నెలకొందన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేస్తోందన్నారు. ముఖ్యంగా టెక్స్ టైల్స్ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకోసం నూతన టెక్స్ టైల్స్ విధానం తీసుకొచ్చామన్నారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై ఫైనాన్స్, ఇండస్ట్రీస్, చేనేత, జౌళి శాఖ కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామన్నారు. టెక్స్ టైల్స్ ఇండస్ట్రీస్ యజమానుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖా రాణి తదితరులు పాల్గొన్నారు.