Suryaa.co.in

Telangana

పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

– రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి మద్దతుదర, బోనస్ ఇప్పించాలి
– గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
– పత్తి రైతుల సమస్యలపై రిప్రజెంటేషన్ అందజేసిన జగదీష్ రెడ్డి

సూర్యాపేట: పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పత్తి రైతుల సమస్యలపై రిప్రజెంటేషన్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇట్టి సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ ఆయన కోరినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. వరదల్లో పత్తి రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. ఎక్కడ కూడా వారికి ఒక రూపాయి సాయం చేసినట్లు గానీ.. వారి నష్టాన్ని కూడా అంచనా వేసే ప్రయత్నం కూడా చేయలేదన్నారు.

అదే సమయంలో పత్తి కి సంబంధించి మన రాష్ట్రం పట్ల కేంద్రం కూడా వివక్ష చూపిస్తుందన్నారు. వాస్తవానికి గుజరాత్ రాష్ట్రం పండించే పత్తి కంటే తెలంగాణ రాష్ట్రం రైతాంగం పండించే పత్తి మంచిదని, నాణ్యమైందని అనేక సందర్భాల్లో (సిసిఐ) కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రశంసించిందిన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రైతాంగానికి 8257 మద్దతు ధరను ఇప్పించాలని కోరారు. అలాగే తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 475 రూపాయలు బోనస్ ను కూడా ఇప్పించాలన్నారు. వరుసగా అకాల వర్షాలతో పత్తి తడిసిపోయి దెబ్బతిన్నదని.. రావలసిన దిగుబడి కూడా అందలేదని.. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఎకరానికి10 నుంచి 12 క్వింటాలు వరకు రావాల్సిన పత్తి ఈ ఏడాది అకాల వర్షాలతో నాలుగు క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.

LEAVE A RESPONSE