– మంత్రి కాకాణి కుట్రలో భాగంగానే ప్రాజెక్టులో వరుస ప్రమాదాలు
– నష్టాలు చూపి జెన్ కోను అదానీ పరం చేయడానికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారమంతా నడిపిస్తోంది
– నిష్పక్షపాత విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి…ప్రాజెక్టు పరిరక్షణ కోస మేం రాజీలేని పోరాటం చేస్తాం
– జెన్ కో పరిరక్షణకు పోరాడుతున్న అఖిలపక్ష నాయకులతో కలిసి నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎంతో ప్రతిష్టాత్మక శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంటులో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం నష్టాలు చూపి అదానీ చేతుల్లో పెట్టే సన్నాహాల్లో ఉన్నారు..అందులో భాగంగానే ఉత్పత్తి తగ్గించేశారు..ఆ తర్వాత వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.గత ఏడాది డిసెంబరు వరకు ఒక్కో యూనిట్ లో 600 యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతూ వచ్చింది..ఒక ప్లాన్ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఒక్కో యూనిట్ లో ఉత్పత్తిని 300 యూనిట్లకు తగ్గించేశారు.
మే 24న బాయిలర్లో ట్యూబ్ లీకై ఒక ప్రమాదం సంభవించింది. మిస్ మేనేజ్మెంట్, కాంట్రాక్టర్ తప్పుల వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.బూడిద తొట్లు నిండిపోయి మే 28న సంభవించిన మరో ప్రమాదం కారణంగా రెండో యూనిట్ లోనూ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి.
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు అయిన కాంట్రాక్టర్ తప్పిదం కారణంగానే ప్రస్తుతం జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.బూడిద తొట్లు నిండినప్పుడు వాటిని తక్షణం క్లీన్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పై ఉంది. కానీ బూడిద క్లీన్ చేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.ప్రాజెక్టు అధికారులు నెల రోజుల ముందు నుంచే జరగబోయే ప్రమాదాన్ని వివరిస్తూ కాంట్రాక్టర్కు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ప్రమాదం సంభవించే అరగంట ముందే అక్కడ నుంచి 40 మంది ఉద్యోగులు బయటకు వచ్చారు… లేనిపక్షంలో ఘోరమైన ప్రమాదాన్ని చూడాల్సి వచ్చేది.యూనిట్ రన్ చేసేందుకు స్థానిక కాంట్రాక్టర్ సహకరించకపోవడంతో బయటనుంచి వేరే వారిని తీసుకొచ్చి బూడిద తొట్లు క్లీన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే మంత్రి కాకాణి అడ్డుకోవటం దారుణం.
ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ తప్పక వేరే వాళ్ళు చేయకూడదు అంటూ వచ్చిన వాళ్లను స్థానిక సీఐ, ఎస్ ఐని బెదిరించి పంపేశారు.ప్రాజెక్టులో ఉత్పత్తి ఆగిపోయిన పర్వాలేదు..బూడిద మాత్రం తమ అనుచరులే తీయాలని మంత్రి ఆదేశింశారు.నా మాట వినక పోతే మీరు బదిలీ అయిపోతారంటూ జెన్కో అధికారులను బెదిరించారు.
మంత్రి కాకాణి కక్కుర్తి కారణంగా ఈ రోజు ప్రాజెక్టులో ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు ఊళ్లకు ఊళ్లు బూడిదమయమవుతున్నాయి. రెండు యూనిట్లూ పనిచేయకపోవడంతో రోజుకు 90 లక్షల యూనిట్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఫలితంగా బయట కొనగోలు చేయాల్సిరావడంతో ప్రభుత్వానికి రోజుకు 10 కోట్ల మేర నష్టం వస్తోంది.
రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ఏపీ జెన్కో.మనుషుల ప్రాణాలు పోయినా..ఉత్పత్తి ఆగిపోయిన పర్వాలేదు అంటూ… నేను చెప్పినట్టు చేయండి అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరింపులకు దిగడం దుర్మార్గం.
జెన్ కోను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని తెలిసి ఆనాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి కాకాణి వద్దకు ఉద్యోగులు వెళ్తే చులకనగా మాట్లాడుతున్నాడు.ఎవరి చేతిలో ఉంటే మీకేం మీ జీతాల మీకు వస్తే చాలవా అంటారా… అంటే మీ ఆస్తులు ఎవరికైనా ఇచ్చి వడ్డీ ఇస్తే సరిపోతుందా… కాకాణీ.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమవుతుందా?
స్థానిక మంత్రులు నాయకులు ప్రజల ఆస్తులతో చెలగాటం ఆడుతుంటే విద్యుత్ శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి చూస్తూ కూర్చుంటారా? తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్లాంట్ల నిర్మాణాలు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అసమర్థ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్లాంట్లను మూసేస్తున్నారు.
ప్రైవేటీకరణ చేయకపోతే ప్రాజెక్ట్లు మూత పడతాయని చెప్పడం అంటే మీరేమన్న దద్దమ్మలా…?జెన్కో తో పాటు వీటీపీఎస్, ఆర్టీపీపీ లను కూడా మూసేస్తారా…?ప్రపంచంలో అత్యంత మోడ్రన్ ఎక్విప్మెంట్ తో పాటు పొల్యూషన్ తక్కువగా ఉండే సూపర్ క్రిటికల్ ధర్మల్ స్టేషన్ ఏదైనా ఉందంటే అది ఒక్క ఏపీజెన్కో నే.
నెల్లూరు జిల్లా, నెల్లూరు మంత్రి కి సంబంధించినది కాదు ఏపీ జెన్కో… మంత్రి గారి తాత సొత్తు అంతకంటే కాదు. ఎవరికైతేనేం అని మంత్రి మాట్లాడేందుకు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాల కృషి ఫలితంగానే నెల్లూరు జిల్లాలో ఏపీ జెన్కో ఏర్పడింది.జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేయలేదు… ఇంకొక నాయకుడు చేయలా…అసలు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత ఇక్కడుండే మంత్రికి ఎక్కడుంది.
ప్రభుత్వ చేతుల్లో ఉన్న బంగారం లాంటి క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ను అదాని చేతిలో పెడితే మీకేంటి అని మాట్లాడతారా? ముఖ్యమంత్రి దగ్గర్నుంచి ఎమ్మెల్యే ల వరకు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక లో పవర్ స్టేషన్లు నిర్మిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఇక్కడ మాత్రం చేతకాక మూసేస్తారా… నాసిరకం బొగ్గు కొనుగోలు నుంచి వరుస ప్రమాదాలు జరిగి ప్రాజెక్టు ఆగిపోయేంత వరకు చోటుచేసుకున్న అన్ని పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
సమావేశంలో పాల్గొన్న కోస్టల్ కారిడార్ అండ్ దామోదరం సంజీవయ్య థర్మల్ స్టేషన్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం.మోహన్ రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, టీడీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, టీఎన్టీయూసీ నాయకుడు కళ్యాణ్, జెన్ కో కాంట్రాక్టు కార్మికుల యూనియన్ కన్వీనర్లు ఆదిశేషయ్య, రవి, ఏ.ఐ.టీ.ఎఫ్.యూ నాయకులు పి.యానాదయ్య, రామరాజు, టీడీపీ ముత్తుకూరు మండల అధ్యక్షులు పి.రామ్మోహన్ రెడ్డి, మావిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు, ఈపూరు మునిరెడ్డి, సీపీఐ(ఎంఎల్) నాయకులు లక్ష్మారెడ్డి తదితరులు.