– కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తాం
– సచివాలయంలో సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు..రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుంది. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు.
అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతాం. సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లు. ఇందులో రూ.4034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించాం. రూ. l2360 కోట్లు నికర లాభాలు వచ్చాయి.
అందులో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించాం. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు గత ఏడాది రూ.5000 బోనస్ అందించాం.. ఈసారి కాంట్రాక్టు కార్మికులకు రూ.5500 బోనస్ అందిస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారు.
ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్ లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. భవిష్యత్ లో కార్మికులకు అండగా ఉంటాం.. సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తాం.
కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తాం.. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గింది. తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నాం.