Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ లాజిస్టిక్ పార్క్ ప్రతిపాదనల్లో పురోగతి

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ: విశాఖపట్నంలో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు ప్రతిపాదన పురోగతిలో ఉన్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ భారత్‌మాల పరియోజనలో భాగంగా దేశంలో 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినట్లు మంత్రి చెప్పారు.

అలా ఎంపిక చేసిన 35 ప్రాంతాల్లో విశాఖపట్నం ఒకటి. లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు ఆచరణ సాధ్యతపై ఇప్పటికే ప్రీ ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తయింది. దీని ఆధారంగా ఫీజిబిలిటీ అధ్యయనం, ట్రంక్‌ ఇన్‌ఫ్రా కనెక్టివిటీలపై డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు నివేదికను రూపొందించే కన్సల్టెంట్‌ ఎంపికకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు.

అయితే ఎంత కాలవ్యవధిలో ఈ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ ఏర్పాటు జరుగుతుందనేది అందుకు అవసరమైన భూమి లభ్యత, ఆర్థికంగా ప్రాజెక్ట్‌ ఆచరణ సాధ్యత అన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

LEAVE A RESPONSE