Suryaa.co.in

Andhra Pradesh

మహిళా పోలీసులకు పదోన్నతులు ?

అమరావతి: క్షేత్రస్థాయిలో మహిళల రక్షణ కోసం కీలకంగా వ్యవహరించే మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందుకోసం ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలో గ్రామ/వార్డు మహిళా పోలీసుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించనున్న నేపథ్యంలో ఈ బిల్లు పరిధిలోకి వీరు వచ్చే అవకాశం ఉంది.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. పోలీసు శాఖలో ప్రత్యేక మహిళా పోలీసు వ్యవస్థగా ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మహిళా పోలీసులకు కానిస్టేబుల్‌ హౌదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ప్రస్తుతం మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు.
మహిళా పోలీసులకు కానిస్టేబుల్‌ హౌదా ఇవ్వడంతో ఇప్పటికే వారు హౌం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ వారి హాజరు, సెలవుల మంజూరు, జీతాల చెల్లింపు అంశాలు సంబంధిత మున్సిపాలిటీలు/ పంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. దాంతో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దాంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా మహిళా పోలీసుల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకోసం సాధారణ పోలీసులుగా కాకుండా మహిళా పోలీసులను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయనుంది. సాధారణ పోలీసులకు సమాంతరంగా మహిళా పోలీసు వ్యవస్థ ఉండనుంది.

LEAVE A RESPONSE