ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన మాట మేరకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 01-01-2020 నుండి సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా పెద్దగా ఆదాయం లేనప్పటికీ కూడా ప్రభుత్వం జీతాల చెల్లింపు విషయం సక్రమంగా జరిపింది. అయితే కొన్ని సర్వీస్ కండిషన్లకి సంబంధించిన అంశాలలో కొంతమందిలో ఒకింత అసంతృప్తి చోటు చేసుకుంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి ఉద్యోగులకు అవసరమైన సర్వీస్ కండిషన్లు మెరుగుపరచడం, హెల్త్ కార్డులు జారీ చేయడం వంటి విషయాలలో ఒక్కొక్కటి పరిష్కరిస్తూ వస్తున్నది.
ఇప్పటికే ప్రతి రీజియన్ (జిల్లా) స్థాయిలో అర్హులైన వారందరికీ ఆయా రీజినల్ మేనేజర్ల ఉత్తర్వుల ద్వారా పదోన్నతులు కల్పించే చర్యలు చేపట్టి ఆ ప్రక్రియ పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సుమారు 1600 ప్రమోషన్లు కల్పించడం జరిగింది. వీటి వలన ఉద్యోగులకు చెప్పుకోదగిన స్థాయిలో మేలు చేకూరింది.
అలాగే ఈ రోజున సంస్థ చైర్మన్ఏ . మల్లికార్జున రెడ్డి అద్యక్షతన డిపార్టమెంటల్ ప్రమోషన్ కమిటీ (DPC) రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు , ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు లతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నది.
2013 సంవత్సరం నుండి ఆర్టీసీ నందు ప్రమోషన్లు ఇవ్వబడి ఇంకా సర్వీసులు క్రమబద్దీకరించకుండా ఉన్న 121 ఉద్యోగుల విషయంలో వారి సర్వీసులు క్రమబద్దీకరిస్తూ కమిటీ ఈ రోజున నిర్ణయం తీసుకుంది.