* రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన
* అధికారంలోకి రాగానే చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం
* పాస్ బుక్ లపై రాజముద్రతో రైతులకు ఎంతో మేలు
* జగన్ ప్రచార యావతో రైతులు, భూ యజమానులు ఇబ్బందుల పాలు
* జగన్ అంటేనే కుంభకోణాలు
* రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలే లక్ష్యం : మంత్రి సవిత
* నాగినాయన చెరువులో నూతన పాస్ బుక్ లు పంపిణీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
సోమందేపల్లి/శ్రీసత్యసాయి : పట్టాదారు పాస్ బుక్ లపై రాజముద్ర వేసి రైతుల హక్కులు పరిరక్షించామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. ప్రచార యావతో పాస్ బుక్ లపైనా, సర్వే రాళ్లపైనా జగన్ రెడ్డి తన బొమ్మను వేసుకుని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. కుంభకోణాలంటేనే జగన్ అని తీవ్రంగా మండిపడ్డారు.
సోమందేపల్లి మండలం నాగినాయన చెరువు గ్రామంలో శుక్రవారం ఆంద్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు భూమి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికల్లో హామీల్లో భాగంగా పట్టాదారు పాస్ బుక్ లపై జగన్ ఫొటో తొలగించి, రైతుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రను ముద్రించి, నూతన పాస్ బుక్ లు అందజేస్తున్నామన్నారు. పాస్ బుక్ లపై జగన్ ఫొటో ఉండడంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇపుడా ఇబ్బందులన్నీ తొలగిపోయాయన్నారు. జిల్లాలో 31,368 మంది రైతులకు నూతన పాస్ బుక్ లు అందజేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
జగన్ అంటేనే కుంభకోణాలు
జగన్ అయిదేళ్ల అసమర్థ, ప్రచార యావ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని మంత్రి సవిత మండిపడ్డారు. పట్టాదారు పాస్ బుక్ లపైనా, సర్వే రాళ్లపైనా తన బొమ్మలు, ప్రభుత్వ కార్యాలయాలపైనా వైసీపీ రంగులు వేసుకుని ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసిన ఘనుడు జగన్ అని అన్నారు. జగన్, ఆయన పార్టీ నాయకులు యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్నారు. జగన్ అంటేనే కుంభకోణాలని విమర్శించారు.
ఇష్టారాజ్యంగా రీ సర్వేలు చేయడం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, ఆయన, వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, జగన్ బెదిరింపుకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు.
రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు
అంతకుముందు నూతన పాస్ బుక్ ల పంపిణీ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్నదే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన, రీ సర్వే తప్పుల తడకగా సాగడం వల్ల భూ సమస్యలపై అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ ల పేరుతో భూ సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నామన్నారు.
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి కావడం వల్ల జిల్లాకు ఎంతో మేలు కలుగుతోందన్నారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో కలెక్టర్, జేసీలు విశేష కృషి చేస్తున్నారని కొనియాడుతూ, వారితో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి సవిత తెలిపారు.
ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు అధికారులు కూడా సహకరించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, రెవెన్యూ అధికారులు, సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకట రమణ, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, భారీ సంఖ్యలో రైతులు, స్థానికులు పాల్గొన్నారు.