- సంగం మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజ్ ప్రారంభోత్సవంలో సీఎం వైయస్ జగన్
- సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతమ్‌రెడ్డిగా నామకరణం చేశాం
- గౌతమ్‌రెడ్డి మన మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు
- మూడేళ్లలోనే సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను పూర్తి చేశాం
- ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి రెండు ప్రాజెక్టులను పూర్తి చేశాం
- సంగం బ్యారేజితో 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
- ప్రాధాన్యతా క్రమంలో మరో 26 ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం
నెల్లూరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించడం ఆయన కుమారుడిగా గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్ సీఎం అయ్యాక నెల్లూరు జిల్లాకు మోక్షం వచ్చిందన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు రేట్లు పెంచి కమీషన్లు దండుకున్నారని, సాగునీరు ,తాగునీరు ఇవ్వాలనే ఆలోచన చేయలేదన్నారు. ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలో 26 ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తామని సీఎం వైయస్ జగన్ హామీ ఇచ్చారు. సంగం బ్యారేజీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే..
నిండు మనసుతో ముఖం నిండా చిరునవ్వులతో ఆప్యాయతలు, అనురాగాలు పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా..మన ప్రభుత్వం వచ్చిన తరువాత దాదాపుగా రూ. 320 కోట్లు ఖర్చు చేసి రెండు ప్రాజెక్టులుసంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజి..ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే కాకుండా దాదాపుగా 5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ఇచ్చి స్థిరీకరించడమే కాకుండా ఆత్మకూరు, కొవ్వూరు, సర్వేపల్లి, నెల్లూరు , కావలి నియోజకవర్గాలకు మంచినీరు ఇచ్చే మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. దేవుడి దయ వల్ల వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మన రైతుల మీద , రాష్ట్ర ప్రజల మీద నాలుగేళ్లుగా ఏ ఒక్క కరువు మండలంగా ప్రకటించే అవకాశం రాకుండా మంచి వాతావరణం దేవుడిదయతో కనిపిస్తోంది.
ఈ రోజు మేకపాటి గౌతం రెడ్డి సంగం బ్యారేజిని ప్రారంభించాం. మరికొద్దిసేపట్లో నెల్లూరు బ్యారేజిని జాతికి అంకితం చేయబోతున్నాం. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపుగా 3.80 లక్షల ఎకరాలకు వరప్రదాయిని అయిన సంగం బ్యారేజీని ప్రాధాన్యతగా పూర్తి చేశాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 9 నెలలకే కోవిడ్ వచ్చింది. మరోవైపు వరుసగా పెన్నా నదిలో రెండేళ్ల పాటు వరదలు వచ్చినా కూడా అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఎదురొడ్డి కేవలం 3 ఏళ్లలోనే అక్షరాల రూ.380 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రోజు రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం.
ఈ బ్యారేజి పూర్వపు వివరాల్లోకి వెళ్తే ..దాదాపుగా 140 ఏళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో కట్టిన ఈ ఆనకట్టు కాలక్రమేణ శిథిలావస్థకు చేరింది. ఈ ప్రాజెక్టును కట్టాలని ఏ ఒక్కరూ ఆలోచన చేయలేదు. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పని చేసినా కూడా పట్టించుకోలేదు. నాన్నగారు వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ జిల్లాకు మోక్ష్యం వచ్చింది. యుద్ధ ప్రాతిపాదికన అడుగులు ముందుకు పడ్డాయి. ఈ రోజు ఆయన కుమారుడిగా, ఆ మహానేతకు కొడుకుగా ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును కొడుకుగా పూర్తి చేసి ప్రారంభిస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.
నాన్నగారి హాయంలో పనులు మొదలు అయితే 2009లో మహానేత మన దగ్గర నుంచి దూరం అయ్యారు. ఈ రెండు ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడు లేడు. 2014లో ఉమ్మడి రాష్ట్రంగా మహానేత వేసిన అడుగులు మాత్రమే నిలిచాయి. రాష్ట్ర విభజన తరువాత వచ్చిన ప్రభుత్వం కేవలం రూ.30.80 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. సంగం బ్యారేజీని 2017 నాటికి పూర్తి చేస్తామని, 2018 నాటికి పూర్తి చేస్తామని మరోసారి చెప్పారు. 2019లో పూర్తి చేస్తామని ముహుర్తం పెట్టారు. కానీ ఏ రోజు కూడా ప్రాజెక్టును పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అంచనాలు పెంచడం, రేట్లు పెంచడం తప్ప పూర్తి చేసింది లేదు. కమీషన్లు దండుకోవడమే గత ప్రభుత్వం చేసింది. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదు.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్షరాల రూ. 200 కోట్లు ఖర్చు చేసి సంగం బ్యారేజిని కోవిడ్, వరదలు ఉన్నా కూడా మూడేళ్లలోనే పూర్తి చేశాం. ఇలా ప్రాజెక్టును పూర్తి చేసి స్నేహితుడు మేకపాటి గౌతంరెడ్డి పేరును పెట్టాం. మిత్రుడు,ఆత్మీయుడు, మంచివారు అయిన మేకపాటి గౌతంరెడ్డి
నిజానికి మనందరి మధ్య ఈ ప్రాజెక్టును ప్రారంభించే కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సి ఉంది. హఠాణ్మరణంతో మనందరికీ కూడా గౌతం దూరం అయ్యాడు. గౌతం జ్ఞాపకార్థం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజిగా పేరు పెడుతున్నాం. చిరస్థాయిగా గౌతం ఎప్పుడు మన మనసులోనే ఉంటాడు అని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను.
ఆ రోజు గౌతం రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో చెప్పిన మాటను నిలుపుకుంటూ ఈ రోజు గౌతం పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసేందుకు దేవుడునాకు ఇచ్చిన అవకాశానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ బ్యారేజి వల్ల పెన్నా డెల్టా, కనిగిరి కాల్వ కింద 2.47 లక్షల ఎకరాలు, కడుబూరు కాల్వ కింద మరో 63 వేల ఎకరాలు, కావలి కాల్వ కింద మరో 70 వేల ఎకరాలు వెరసి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుస్థిరీకరణ జరుగుతోంది.
ఈ కార్యక్రమం అయిపోయిన తరువాత ఇక్కడి నుంచి నెల్లూరు బ్యారేజికి శ్రీకారం చుట్టేందుకు వెళ్తున్నాం. దాదాపుగా ఆ ప్రాజెక్టు కూడా ఇంతే..140 ఏళ్ల క్రితం నిర్మించిన నెల్లూరు బ్యారేజి కూడా శిథిలావస్థకు చేరింది. పట్టించుకునే నాథుడు లేక నీరు అందించలేకపోయారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో చొరవ చూపడంతో ప్రాజెక్టునిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. ఆనాడు రూ. 147 కోట్లతో అంచనాలు వేస్తే.. అప్పటికే రూ.86 కోట్లు ఖర్చు చేసి మహానేత పరుగులు తీయించారు. తరువాత మళ్లీ అదే కథ. మహానేత చనిపోయిన తరువాత ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. అలాంటి ప్రాజెక్టును మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి చేసి ఈ రోజు జాతికి అంకితం చేస్తున్నాం.
ఈ ప్రాజెక్టు మాత్రమే కాదు..దేవుడి దయతో ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నాం. అక్షరాల 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతక్రమంలో తీసుకున్నాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా 26 ప్రాజెక్టులను ఉరుకులు పరుగులు పెట్టిస్తామని మాటిస్తున్నాను. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం నాకు ఇవ్వాలని, తద్వారా రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ..ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి చెరగని చిరునవ్వులు చూపుతున్న ప్రతి ఒక్కరికీ మరొక్కమారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.
ఆత్మకూరుకి సీఎం వైయస్ జగన్ వరాల జల్లు
వివిధ పనులకు సంబంధించి ఎమ్మెల్యే విక్రం రెడ్డి అడిగిన నిధుల్ని వైయస్ జగన్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.నియోజకవర్గంలో సమస్యలు ప్రస్తావించారు ఎమ్మెల్యే విక్రం రెడ్డి. బ్యారేజీకి జాతీయ రహదారి కి మధ్య రోడ్డు కోసం 16 కోట్లు, రోడ్లు లేని గ్రామాలకు 14 కోట్లు శాంక్షన్ కూడా ఇస్తామన్నారు వైయస్ జగన్. ఆత్మకూరుకి స్పెషల్ గ్రాంట్ కింద డబ్బులు ఇస్తాం. అన్నీ రకాల పనులకు పచ్చజెండా ఊపారు జగన్.ఆత్మకూరు అభివృద్ధి కి రూ.85 కోట్లు మంజూరు చేశారు జగన్. ఆత్మకూరు మునిసిపాలిటీ కి రూ. 12 కోట్లు స్పెషల్ గ్రాంట్ గా కేటాయిస్తున్నాం. సంగం పంచాయితీ కి రూ. 4 కోట్లు ఇస్తున్నాం అన్నారు వైయస్ జగన్.