– సెక్రటరీ పోస్టు నుంచి బదిలీ చేయాలని సవాంగ్ షరతు?
– దానితో ఇంటలిజన్స్ చీఫ్‌గా నియామకం?
– సరైన నిర్ణయమంటున్న అధికార-వైసీపీ వర్గాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ ఇంటలిజన్స్ బాసుగా సీనియర్ ఐపిఎస్, అందరికీ తెలిసిన పీఎస్‌ఆర్.. పెండ్యాల సీతారామాంజనేయులు నియమితులయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి ఖాళీ చేసిన ఇంటలిజన్స్ డీజీ పోస్టులో పీఎస్‌ఆర్‌ను నియమించాలని జగన్ సర్కారు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీఎస్సార్ ఆంజనేయులు ఏసీబీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
కాగా డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌ను ఏపీపీఎస్‌సీ చైర్మన్‌గా నియమించే ముందు, చాలా పెద్ద తతంగం జరిగిందన్న ప్రచారం పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీపీఎస్‌సీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పీఎస్‌ఆర్‌ను, అక్కడి నుంచి బదిలీ చేస్తేనే తాను చైర్మన్ పదవి తీసుకుంటానని సవాంగ్ షరతు విధించగా, ప్రభుత్వ పెద్దలు దానికి అంగీకరించారన్నది ఆ ప్రచార సారాంశం.
ఆ ప్రకారంగా పీఎస్‌ఆర్‌ను నిఘా దళానికి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నిజానికి జగన్‌తో సత్సంబంధాలున్న పీఎస్‌ఆర్‌కు గతంలోనే నిఘా బాధ్యతలు దక్కాల్సి ఉంది. అయితే అప్పుడు డీజీపీగా ఉన్న సవాంగ్ అడ్డుపడటం వల్ల, అది సాధ్యం కాలేదన్న ప్రచారం పోలీసు వర్గాల్లో జరిగింది. ఇప్పుడిక సవాంగే ఆప్షన్ ఎన్నుకున్నందున, ఆయనకు మునుపటి అవకాశం లేదని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ముక్కుసూటి అధికారి, నిర్మొహమాటంగా వ్యవహరించే అధికారిగా పేరున్న పీఎస్‌ఆర్ ఎవరిమాటా వినరన్న పేరు పోలీసువర్గాల్లో ఉంది. గుంటూరు, కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో.. ఆయన వ్యవహారశైలి నచ్చని నాటి అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనను మార్చాలని అప్పటి సీఎం చంద్రబాబునాయుడుకు మొర పెట్టుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీలో ఉన్న గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీకి- ఆయనకు మధ్య జరిగిన వివాదం కూడా, పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏసీబీలో ఉన్న పీఎస్సార్ హయాంలో ఉద్యోగుల అవినీతిపై కొరడా ఝళిపిస్తున్నారు.
కాగా ఇప్పటి రాజకీయ పరిస్థితిలో పీఎస్‌ఆర్ వంటి అధికారి, నిఘా బాసుగా ఉండటమే మంచిదన్న అభిప్రాయం అటు వైసీపీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై అవగాహన ఉన్న పీఎస్సార్ వంటి అధికారి నిఘా బాసుగా ఉంటే, పాలకులకు వాస్తవాలు తెలుస్తాయంటున్నారు.
‘కీలక శాఖలకు అధిపతులుగా ఉండే అధికారులు కేవలం నిజాయితీపరులయి ఉంటే సరిపోదు. సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న వారయి ఉండాలి. తమ దృష్టికి వచ్చిన వాస్తవాలను ప్రభుత్వ పెద్దల వరకూ తీసుకువెళ్లే చొరవ, ధైర్యం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. పీఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో ఎస్పీగా పనిచేశారు. ఎస్పీ స్థాయి అధికారులకు రాజకీయ నేతలతో సంబంధాలుంటాయి. అవి ఇప్పుడు ఆయనకు పనికివస్తాయి. ప్రధానంగా మా పార్టీలో కిందిస్థాయి నేతలు రెచ్చిపోయి, పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు హద్దులు దాటి చాలాకాలమయింది. మైనింగ్, శాండ్, సెటిల్‌మెంట్‌లో మా పార్టీ ఎమ్మెల్యేలు వేళ్లు కాదు, ఏకంగా కాళ్లే పెట్టేశారు. మరి ఇవన్నీ మా సీఎం గారికి తెలుసో తెలియదో మాకయితే తెలియదు. కానీ వాటిని సీఎం దృష్టికి తీసుకువెళ్లే అధికారి ఉండటమే ముఖ్యం. పీఎస్సార్ మా జిల్లాలో పనిచేశారు కాబట్టి ఆయన సత్తా ఏమిటో మాకు తెలుస’ని గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ వైసీపీ నేత వ్యాఖ్యానించారు.