– ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రెండున్నర ఏళ్ల పాటు పని చేశా
– సవాళ్ళను ఎదుర్కొంటూనే పని చేయాల్సి ఉంటుంది
– డీజీపీ గౌతమ్ సవాంగ్
విజయవాడ : మంగళగిరిలోని 6వ బెటాలియన్ గ్రౌండ్‌లో బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ పోలీసు కవాతు నిర్వహించింది. ఈసందర్భంగా బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్, నూతన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సవాంగ్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ‘నా 36 సంవత్సరాల పోలీసు సర్వీసు ఇవాళ్టితో ముగుస్తోంది. డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల కాలం పనిచేశా. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రెండున్నర ఏళ్ల పాటు పని చేశాను. చాలా సంస్కరణలు, పోలీసు వ్యవహార శైలిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేశాను. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశాను. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 ఏళ్ల 8 నెలల పాటు నన్ను డీజీపీగా కొనసాగించిన సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు.
దిశా, మొబైల్ యాప్ నుంచి కూడా కేసులు నమోదు అయ్యేలా చేశాం. బాధితులు పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నాం. 36 శాతం కేసులు డిజిటల్‌గా వచ్చిన ఫిర్యాదులే. 75 శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్ష వేశాయి. స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 40 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. స్పందన, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత కోసం పనిచేశాం. దిశా యాప్ డౌన్‌లోడ్ లక్ష్యాన్ని సీఎం జగన్ నిర్ధేశించారు. ప్రస్తుతం కోటి 10 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేశారు. అలాగే పోలీస్ సేవా వెబ్ సైట్ ద్వారా డిజిటల్‌గా ఎఫ్‌ఐఆర్‌లను డౌన్ లోడ్ చేసే అవకాశం కల్పించాం.
డీజీపీ కార్యాలయం నుంచి ఇన్ స్పెక్టర్ కార్యాలయం వరకు డిజిటల్‌గా అనుసంధానం చేశాం. ఏపీ పోలీసు వ్యవస్థలో డీజిటల్‌గా చాలా మార్పులు చేయగలిగాం. పోలీసులకు వీక్లి ఆఫ్‌లు కల్పించారు. 7,552 ఎకరాల్లో పండించిన గంజాయిని తొలిసారిగా ధ్వంసం చేశాం. పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో సవాళ్ళను ఎదుర్కొంటూనే పని చేయాల్సి ఉంటుంది. నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఉన్నత శిఖరాలపై నిలబెడతారని ఆశిస్తున్నా. సీఎం జగన్ మనపై ఉంచిన బాధ్యతలు పూర్తిగా నిర్వహించాలి’ అని గౌతమ్‌సవాంగ్ అన్నారు.