-రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలు చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి నిరసనల సెగ తగులుతూనే ఉంది… పలుచోట్ల జనం సమస్యలపై నేతలను నిలదీస్తున్నారు
-శ్రీకాకుళం జిల్లా విజయరాంపురంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత చవిచూడాల్సి వచ్చింది
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హాజరయ్యే నాయకులకు.. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం విజయరాంపురంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు చుక్కెదురైంది.ఎమ్మెల్యే నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైకాపా నాయకులు, కార్యకర్తలే బహిష్కరించారు.కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కారుని అడ్డగించి నిలదీశారు. ఎన్నికల ముందు ఇళ్లు, తాగునీరు, రోడ్డు మరమ్మతులు, అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఏ ఒక్కటీ అమలు చేయలేదని గ్రామస్థులు ప్రశ్నించారు.
ప్రశ్నించిన వైకాపా కార్యకర్తలను పోలీసులు ఊరి బయట నిలువరించారు.వేరే వర్గంతో ఊర్లోకి వెళ్లగా.. పింఛన్లు, తాగునీరు, రోడ్డు మరమ్మతులు ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేని స్థానికులు ప్రశ్నించారు.తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే వెనుదిరిగారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరు గ్రామంలో.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నేతలకు… ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది.నియోజకవర్గ వైకాపా కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తుంటే.. జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వితంతు పింఛన్ ఏడాదిగా రావట్లేదంటూ ఓ మహిళ వాపోయింది. పంచాయతీ అధికారులు మంచినీటి కనెక్షన్ కావాలంటే 25 వేల రూపాయలు అడుగుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. తాగేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని.. నాయకులు మారినా తమ పరిస్థితి మారలేదంటూ గ్రామస్థులు వాపోయారు.
“నాకు పింఛన్ తీసేశారు. మా నాన్న సచ్చిపోతే మా కార్డు తీసేశారు. సింగిల్‌గా ఇవ్వనన్నారు. మా యమ్మ కూడా సచ్చిపోయింది.. మరి నాకివ్వాలి కదా. పాతిక వేల రూపాయలు కట్టమంటే ఎవరు కడతారు..?. పాతిక వేలు కట్టకుంటే ఈ జన్మకు నీళ్లు రావు అంటున్నారు. మీ దగ్గరికొచ్చాం.. మీ పక్కనోళ్లు మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. మేం మనుషులం కాదా ఆండీ.. మేం మనుషులం కాదా చెప్పండి.” అని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.