Suryaa.co.in

Telangana

మోదీని చూసి కేసీఆర్ గజగజ వణుకుతున్నరు

-పీఎం వస్తున్నారని తెలిసినా ముఖం చెల్లక పారిపోతున్నడు
-కేటీఆర్ భాషను చూసి టీఆర్ఎస్ పనైపోయిందని జనం నవ్వుకుంటున్నరు
-సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
-26న ప్రధాని రాక సందర్భంగా కనీవినీ ఎరగని రీతిలో వేలాది మందితో అపూర్వ స్వాగతం పలుకుదాం
-రాజధాని యావత్తు కాషాయమయం చేద్దాం
-ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు సంజయ్ పిలుపు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు వింటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ గజ గజ వణికిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిసినా… మొఖం చెల్లక కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు కేసీఆర్ ఆర్దిక సాయం చేయడంపై తీవ్రంగా స్పందించారు.

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వేలాది మంది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులుసహా చివరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయి వడ్ల కుప్పలపై పడి రైతులు గుండె పగిలి చనిపోయారన్నారు. ఆయా కుటుంబాలకు ఏనాడూ నయాపైసా సాయం చేయని కేసీఆర్ పబ్లిసిటీ కోసం ఇతర రాష్ర్టాల రైతులకు ఆర్దిక సాయం చేస్తుండటం సిగ్గు చేటన్నారు. సీఎం తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున ఘన స్వాగతం పలికేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక (ప్రిపరేటరీ) సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభ విజయవంతం కావడంతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల పనితీరుపై పార్టీ జాతీయ కార్యవర్గాల్లో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున కనీవినీ ఎరగని రీతిలో అపూర్వ స్వాగతం పలుకుదాం.

యావత్ ప్రపంచమంతా గర్వించదగ్గ నేత నరేంద్రమోదీ. అవినీతి మచ్చలేని ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గజగజ వణికిపోతున్నడు. ఆయనకు ముఖం చూపించే ధైర్యం లేక పారిపోతున్నడు. గతంలో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన సమయంలోనూ కేసీఆర్ ఇదే విధంగా వ్యవహరించారు.ఇక కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్న అసభ్య భాష, వ్యవహరిస్తున్న తీరును చూసి టీఆర్ఎస్ పనైపోయిందని జనం చర్చించుకుంటున్నరు. ఆయన సైకోలా మారిండని జనమే ఛీ కొడుతున్నరు.

ఇగ కేసీఆర్ పబ్లిసిటీ కోసం, ప్రజల చర్చను దారి మళ్లించేందుకు ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్దిక సాయం చేస్తున్నట్లు ఫోజులిస్తున్నరు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికిపైగా నిరుపేదలు చనిపోయారు. టీఆర్ఎస్ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. అకాల వర్షాలతో పంట నష్టపోయి వడ్ల కుప్పలపై రైతులు గుండె పగిలి చనిపోయారు. 317 జీవో వల్ల ఎంతో మంది ఉద్యోగులు చనిపోయారు. ఉద్యోగాల్లేక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నరు. చివరకు ఆయన కొడుకు నిర్వాకంవల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకున్నరు. వీరిలో ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్ ఆయా కుటుంబాలకు కనీసం పైసా సాయం కూడా చేయని మానవ మ్రుగం. అలాంటి వ్యక్తి పంజాబ్ రైతులకు ఆర్ధిక సాయం చేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు.

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమిత్ షా సభ సక్సెస్ కావడంతో కేసీఆర్, ఆయన కొడుకు డిప్రెషన్ లోకి వెళ్లి కాయిల్ తప్పి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ మొదటి నుండి భూస్వామి అని కొడుకు మాట్లాడుతున్నడు. నిజంగా కేసీఆర్ భూస్వామి అయితే పాస్ పోర్ట్ బ్రోకర్ పనులు ఎందుకు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి.

కేసీఆర్ నిత్యం తాగి ఫాంహౌజ్, ప్రగతి భవన్ లో పడుకోవడం తప్ప ఆయన పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులనుసహా ఏ ఒక్కరినీ కలవని ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ చరిత్ర భవిష్యత్ రాజకీయ నాయకులకు గుణ పాఠం కావాలి. అందుకే బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ నీచమైన చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేస్తాం.

ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ తోపాటు బీజేపీ సభలకు వస్తున్న జన స్పందనను చూసి టీఆర్ఎస్-కాంగ్రెస్ బీజేపీలోకి ఏ నాయకుడూ ఇమడలేరంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఏనాడూ ఎవరో వస్తారని ఎదురు చూడదు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలను చూసి వస్తే స్వాగతిస్తాం. తగిన గౌరవమిస్తాం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నందున ఎయిర్ పోర్టు నుండి గచ్చిబౌలి వరకు ఆయన వెళ్లే మార్గంలో కనీవినీ ఎరగని రీతిలో వేలాది మందితో అపూర్వ స్వాగతం పలుకుదాం. రాజధాని యావత్తు హోర్డింగులు, ఫ్లెక్సీలతో కాషాయ మయం చేద్దాం. అందుకోసం ప్రతి డివిజన్ లో సమావేశం నిర్వహించి కార్యకర్తలు, ప్రజలంతా మోదీకి స్వాగతం పలికేలా సమాయత్తం చేయాలి.

ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలంగౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, కోశాధికారి భండారు శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, పార్టీ రాష్ర కార్యదర్శులు కొల్లి మాధవి, జయశ్రీ, అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, పోరెడ్డి కిశోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు సమావేశానికి హాజరైన జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, కార్పొరేటర్లు మాట్లాడుతూ మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు తమ తమ జిల్లాలు, డివిజన్ల నుండి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలను సమీకరిస్తామన్నారు. ఎయిర్ పోర్టు నుండి గచ్చిబౌలి వరకు దారి పొడవునా వేలాది మందితో అపూర్వ స్వాగతం పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

LEAVE A RESPONSE