– నేడు సీఎం, మంత్రులను ప్రజలు స్వయంగా కలుస్తున్నారు..
– గత అరాచక పాలన.. నేటి ప్రజా పాలనకు తేడా గమనించాలి
– ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం
– వచ్చిన అర్జీదారులు చిరునవ్వుతో తిరిగి వెళ్లేలా చూస్తున్నాం
– మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి కెఎస్ జవహర్
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా మాజీ మంత్రి కెఎస్ జవహర్, మహిళా నేత ఆచంట సునీతలతో కలిపి బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. భూ వివాదాలపై పెద్ద ఎత్తున అర్జీలు రాగ.. వెనువెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. మరికొన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాటితో పాటు పలు అర్జీలను ఆయా శాఖలకు పంపి విచారణ అనంతరం పరిష్కారం దొరికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
• కర్నూలు జిల్లా కర్నూలుకు చెందిన పలువురు బాధితులు తాము స్థలాన్ని లీజుకు తీసుకొని నిర్మాణాలు చేపడితే… నాటి వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రూ. 50 లక్షలు లంచం తీసుకొని తాము చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయించాడని.. వైసీపీ నేతల చర్యల వలన తాము తీవ్రంగా నష్టపోయామని పలువురు బాధితులు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. అక్రమ కూల్చివేతలపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు.
• అనంపురం జిల్లా సొమ అందెపల్లి మండలం పోలేపల్లికి చెందిన యలవ బుద్దప్పు విజ్ఞప్తి చేస్తూ.. తమ ఊరిలో పేదలకు చెందిన 450 ఎకరాలను వైసీపీ నేత నరసింహులు కబ్బాచేసి కంచె వేశారని.. పొలం దగ్గరకు వెళితే పోలీసులతో కొట్టిస్తున్నారని… వారి వలన 28 కుటుంబాలు బాధింప పడుతున్నాయని.. తమకు న్యాయం చేయాలని విన్నవించుకొన్నాడు.
• ఆమెది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరమని.. వాళ్లకు నరసాపురం మండలం లింగబోయన చర్ల గ్రామ పంచాయతీ రామకూరిపాలెం గ్రామంలో కొంత భూమి ఉంటే మాజీ ఎమ్మెల్యే ముదునూరి అనుచరులు దాన్ని కబ్జా చేసేందుకు కుట్రపన్నారని.. అన్ని ఆధారాలు ఉన్నా కాని.. సర్వేకి అప్లై చేస్తే నాడు రెవెన్యూ అధికారులు చాలా సార్లు రిజెక్ట్ చేశారని రెవెన్యూ అధికారుల తీరువలన తాము తీవ్రంగా నష్టపోయామని ఆమె ఆవేదన చెందారు. గత వైసీపీ ఎమ్మెల్యేకు తొత్తులుగా పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని బాధితురాలు చామకూరి కుసుమ కుమారి పద్మావతి కోరారు.
• ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలం తూర్పు మాధవరం గ్రామానికి చెందిన పూల పుష్పావతి విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే కారణంగా తమ భూమిని తక్కువ చేసి ఆన్ లైన్ లో ఎక్కించారని అసలు భూమి 1 ఎకరా 37 సెంట్లు ఉంటే ఎకరా 12 సెంట్లు ఎక్కించారని.. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. వారి భూమిని ఆన్ లైన్ లో ఎక్కించడానికి గ్రామ సర్వేయర్ రమేష్ లంచం తీసుకున్నారని, ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన ఆకు తోట లక్ష్మీనరసింహరావు కూడా విజ్ఞప్తి చేస్తూ… గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో తమ భూమిని కూడా తగ్గించి ఆన్ లైన్ చేశారని.. అధికారులకు మొరపెట్టున్నా వినడంలేదని.. దయ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
• ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన ఎండపు విజ్ఞేశ్వరి విజ్ఞప్తి చేస్తూ.. చంద్రగూడెంలో తన భర్త తాతగారు కొన్న భూమిలోకి వెళ్లకుండా.. తమను కొంతమంది గిరిజనులు అడ్డుకుంటున్నారని… దీనిపై అధికారులు చుట్టా తిరగినా పట్టించుకోవడంలేదని.. వైసీపీ నాయకులు దీని వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆ పొలమే ఆధారమని. తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.
• గత 21 ఏళ్ళుగా తమ సాగులో ఉన్న భూమికి దొంగ పట్టాలు సృష్టించి తమ భూమిని కొట్టేయడానికి గుదె సుబ్బారావు, మిట్టా తిరుపతయ్యలు యత్నిస్తున్నారని.. కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన వీరనారాయణమ్మ గ్రీవెన్స్ లో మంత్రికి ఫిర్యాదు చేశారు. సాగు చేసుకొంటున్న భూమిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు.
• తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తుపాకుల గూడెం గ్రామానికి చెందిన వుండవల్లి వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేస్తూ.. గత 50 ఏళ్ల నుండి నేటికి బయ్యవరం గ్రామంలో 2 ఎకరాల 50 సెంట్ల భూమి తన స్వాధీనంలో ఉందని.. వాస్తవానికి విరుద్దంగా తళ్లపూడి రెవెన్యూ అధికారి ఎన్‌వీఎన్‌కే ప్రసాద్ ఆ భూమి మరోకరిదిగా చెబుతున్నారని.. వాస్తవాలను పరిశీలించిన తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.
• పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెంకు చెందిన గుమ్మళ్ల బ్రహ్మయ్య విజ్ఞప్తి చేస్తూ.. వంశపారపర్యంగా తమకు వచ్చిన భూమిలోకి తమను వెళ్లకుండా బెదిరిస్తున్నారని.. భూమిని సాగు చేసుకోనివ్వడం లేదని… దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన వేడుకున్నారు.
• కోర్టు ఉత్తర్వులు ఉన్నా… బోగస్ పత్రాలు సృష్టించి తమ భూమి 3 ఎకరాల 4 సెంట్లను కబ్జాచేసి కట్టడాలు ప్రారంభించారని.. ఈ భూ కబ్జా అక్రమ కట్టడాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అనంతపురం జిల్లా కదిరికి చెందిన కె. సికిందర్ గ్రీవెన్స్ లో కోరారు.
• విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడలో పలువురు వైసీపీ నేతలు పభుత్వ భూములను ఆక్రమించుకొని రేకుల షేడ్ లు వేశారని.. అంతేకాకుండా శ్మశాన స్థలాన్ని కబ్జా చేసి రొయ్యల చెరువులు తవ్వారని.. ఈ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వాసుపల్లి దినేష్ నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 750 గ్రామాల ప్రజలకు మంచినీటిని అందించే సత్యసాయి ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని… ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేసి గ్రామాల్లో ప్రజలు నీటికి ఇబ్బందులు పడేలా చేశారని అంతే కాకుండా.. టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్ట్ నిర్వహణకు ఉన్న రూ. 2 కోట్ల 30 లక్షలను రూ. 1 కోటి 20 లక్షలకు తగ్గించిందని.. దాంతో ప్రాజెక్ట్ మెయింటెన్స్ సక్రమంగా లేదని గత ఆరు నెలలుగా కార్మికులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని తెలిపారు. గత ఏడు నెలల నుండి పీఎఫ్, ఈఎస్ఐసీలు కార్మికుల ఖాతాలకు చెల్లించడంలేదని… దీనిపై ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్సీ, డీఈలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తమ సమస్యను పట్టించుకొని తమకు న్యాయం చేయాలని సత్యసాయి కార్మికులు ఫిర్యాదు చేశారు.
• జి. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తనకు మాయ మాటలు చెప్పి తన నుండి రూ. 25 లక్షలు కాజేశాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తిరుపతికి చెందిన పి.గౌతమ్ ఫిర్యాదు చేశారు. అతని నుండి డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు.
• మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలానికి చెందిన పారపట్ల రమణప్ప విజ్ఞప్తి చేస్తూ.. మత్స్యకార సంఘ సభ్యులకు వలలు, బోట్ లు, ఐస్ బాక్స్ లు, చేప పిల్లలు, మోటార్ వాహనాలు సబ్సీడీ కింద ఇవ్వాలని గ్రీవెన్స్ లో మంత్రి, నేతలకు విజ్ఞప్తి చేశాడు.
నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వంలోని అరాచకాలను, అన్ని ఇబ్బందులను తొలగించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షించ తగిన విషయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. నేడు సీఎం నుండి మంత్రులు, నేతలందరూ ప్రజలందరికి అందుబాటులో ఉంటున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ఇది పేదల ప్రభుత్వమని నిరూపించారు.
గత ఐదేళ్లలో భూ దోపిడీలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఆన్ లైన్ లో పేర్లు మార్చి గత పాలకులు ప్రజలను ఇబ్బంది పెట్టారు. వాటి పరిష్కారానికి వచ్చే నెల నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. భూ సమస్యలతో పాటు పింఛన్, రేషన్ కార్డు సమస్యల్లాంటి అనేక ఇష్యూలు వచ్చాయి. వచ్చిన ప్రతి అర్జీదారునికి న్యాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే మా నాయకుడు లక్ష్యం.. దానికి తగినట్టు ప్రజలకోసం మేం పనిచేస్తున్నాం.