– షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం లాంఛనమే
– తెలంగాణలో వద్దంటున్న రేవంత్ వర్గం
– ఆంధ్రా నేతలు తెలంగాణలో ఎందుకని వాదన
– షర్మిల రాకను స్వాగతిస్తున్న భట్టి విక్రమార్క
– ఏపీలో అయితే కాంగ్రెస్‌కు లాభమంటున్న కాంగ్రెస్ వర్గాలు
– తెలంగాణలో ప్రచారానికి ఆయుధమవుతుందని విశ్లేషణ
– ఏపీలో జగన్ సర్కారును దించేందుకు షర్మిల అస్త్రం
– క్రైస్తవ-దళిత క్రైస్తవులు కాంగ్రెస్ వైపు వస్తారన్న అంచనా
– గతంలో బ్రదర్ అనిల్ ప్రచారంతో వైసీపీకి ఓటేసిన క్రైస్తవ-దళిత క్రైస్తవులు
– వైసీపీలో టికెట్లు రాని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వస్తారన్న ఆశ
– రాయలసీమలో వైసీపీని దెబ్బతీయవచ్చన్న భావన
– ఇక జగన్‌పై కాంగ్రెస్ సంధించిన బాణమే అవుతుందా?
– షర్మిల రాకపై రెండుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘నా పేరు షర్మిల. జగనన్న సంధించిన బాణాన్ని’’.. ఇది వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జైలులో ఉండగా, పాదయాత్ర చేసిన ఆయన చెల్లి షర్మిల చేసిన తొలి వాఖ్య. ఇప్పుడు అదే షర్మిల.. తన అన్న జగన్‌పై కాంగ్రెస్ సంధించిన బాణం కాబోతోందా? ఏపీలో ఐసీయులో ఉన్న కాంగ్రెస్‌పార్టీకి ఊపిరిపోయనుందా?
మోదీకి మద్దతుదారుగా ఉన్న జగన్‌పై కాంగ్రెస్ గురిచూసి కొట్టబోతున్న అస్త్రం అవుతుందా?.. తాజాగా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే .. ఈ అనుమానాలకు నిజమేనన్న సమాధానం వస్తోంది.
దివంగత మహానేత వైఎస్ ముద్దుల బిడ్డ, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు, రంగం దాదాపు సిద్ధమవుతోంది. చర్చలు- మాటముచ్చట్లు కూడా ముగిసి, చేరిక తేదీ ఒక్కటే మిగిలి ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. చివరకు వైఎస్ ఆత్మ, ఆ కుటుంబంతో
విడదీయలేని బంధం ఉన్న కెవిపి రామచంద్రరావు కూడా.. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతుందన్న సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌తో షర్మిల భేటీ అయిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి షర్మిల అడుగులు ఎటు వైపన్నది సుస్పష్టం.
అయితే షర్మిల రాకపై తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలినట్లు కనిపిస్తోంది. షర్మిల రాకను పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది. ఆమెపై ఆంధ్రా ముద్ర ఉన్నందున, తెలంగాణలో పదవి ఇస్తే ప్రతికూల పరిణామాలు ఉంటాయన్నది రేవంత్ వర్గం వాదన. ఆమె వల్ల తెలంగాణలో కంటే.. ఆంధ్రా కాంగ్రెస్‌కే ఎక్కువ లాభమని రేవంత్ వర్గం స్పష్టం చేస్తోంది. వైఎస్ బిడ్డగా ఆమెకు ఆంధ్రాలొనే ఎక్కువ గుర్తింపు ఉందని చెబుతున్నారు. ఆమె చేరికతో జగన్ సర్కారును సులభంగా కూల్చవచ్చని, అక్కడి క్రైస్తవ-దళిత క్రైస్తవ వర్గాలను కాంగ్రెస్‌కు ఆకర్షించవచ్చని రేవంత్ వర్గం విశ్లేషిస్తోంది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం, షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. షర్మిల రాకతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అన్ని స్ధానాలూ గెలవవచ్చన్నది, ఆయన వాదనగా కనిపిస్తోంది. పైగా షర్మిలను తెలంగాణ
కాంగ్రెస్‌లో తీసుకుంటే.. క్రైస్తవ-దళిత క్రైస్తవులు కాంగ్రెస్‌ను ఆదరిస్తారన్నది ఆయన విశ్లేషణ. షర్మిల భర్త, క్రైస్తవ మత ప్రచారకుడైన బ్రదర్ అనిల్‌కు.. తెలంగాణ క్రైస్తవ సమాజంలో ఆదరణ ఉందని భట్టి వర్గం గుర్తు చేస్తోంది.
కాగా షర్మిల రాక వల్ల ఏపీ కాంగ్రెస్ తిరిగి ఊపిరిపోసుకుంటుందని, ఆంధ్రా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలు-కెవిపి కూడా దానిని ఖరారు చేయటంతో, ఏపీ కాంగ్రెస్‌లో అప్పుడే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం జగన్ సారధ్యంలోని వైసీపీలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు రావన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరు మాత్రం దాదాపు 40 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.
ఎన్నికల సమయంలో వీరంతా కాంగ్రెస్‌లో చేరితే, పార్టీకి లాభమని ఏపీ కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. పైగా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలతో, షర్మిల-బ్రదర్ అనిల్‌కు వ్యక్తిగత- కుటుంబ సత్సంధాలు ఉన్నందున, ఆమెతో వైసీపీని దెబ్బతీయవచ్చని కాంగ్రెస్ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు.
ప్రధానంగా.. రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నేతలతో షర్మిల-బ్రదర్ అనిల్‌కు సత్సంబంధాలున్నాయి. సొంత కడప జిల్లాలో జగన్‌కు సరిసమానమైన ఆదరణ ఆమెకు ఉండటం కూడా, పార్టీకి లాభిస్తుందంటున్నారు. ప్రధానంగా షర్మిల
రాకతో కడప జిల్లా రాజకీయాలు, సమీకరణలూ పూర్తిగా మారతాయని, కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే, అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్ధి అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. నిజానికి షర్మిలకు.. తెలంగాణ కంటే, ఏపీనే రాజకీయంగా సురక్షితమని ఏపీ కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నారు.
అయితే సంప్రదాయ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిలకు ఏపీలో బాధ్యతలు ఇచ్చినప్పటికీ, తెలంగాణలో కూడా ఆమె సేవలు వాడుకోవచ్చని సూచిస్తున్నారు. వైఎస్ బిడ్డగా ఆమెకున్న గుర్తింపును ఎవరూ కాదనరని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికలకు ఆమెతో ప్రచారం చేయిస్తే, పార్టీకి అదనపు లాభమేనంటున్నారు.
అయితే వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం లేదా షర్మిల కాంగ్రెస్‌లో చేరే అంశాలేవీ తమ
పార్టీలో చర్చ జరగలేదని, ఆ పార్టీ పీఏసీ సభ్యుడు గట్టు రాంచందర్‌రావు చెప్పారు. కాంగ్రెస్ వాళ్లే షర్మిల కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.
‘రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. షర్మిల తెలంగాణలోనే కొనసాగే వైఖరిపై గతంలోనే స్పష్టత ఇచ్చారు.దీనికోసమేనా తాను తెలంగాణలో పాదయాత్ర చేసిందని వ్యాఖ్యానించారు. అలాంటిది ఆమెను
కాంగ్రెస్‌కు పరిమితం చేస్తారని మేము అనుకోం. రాజన్న బిడ్డగా ఆంధ్రాలో ఆమెకు ఎంత ఆదరణ ఉందో, తెలంగాణలోనూ అంతే ఉంది. షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌కు వస్తే స్వాగతిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రేవంత్‌రెడ్డి వర్గం వారి వాదన మరోలా ఉంది. సో దీన్నిబట్టి కాంగ్రెస్‌లోనే చీలిక ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికైతే మాత్రం మా పార్టీలో దీనిగురించి ఎలాంటి చర్చ జరగలేదు’’ అని గట్టు స్పష్టం చేశారు.