– మూడున్నర గంటలకుపైగా అల్లు అర్జున్ విచారణ
– సంధ్య థియేటర్ అంశంలో వీడియో పుటేజ్ ఆధారంగా ప్రశ్నలు
– కొన్నింటికి సమాధానాలు దాటవేసిన అల్లు అర్జున్
– మళ్లీ పిలుస్తామన్న ఏసీపీ
– తప్పకుండా వస్తానన్న బన్నీ
– బౌన్సర్ అంటోనీని అరెస్ట్ చేసిన పోలీసులు
– అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పని చేస్తున్న అంటోనీ
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటలకు పైగా విచారణ సాగింది. విచారణ అనంతరం ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సోమవారం నోటీసులివ్వగా, లీగల్ టీంతో చర్చించిన అనంతరం విచారణ కోసం మంగళవారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బన్నీ వాసు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారించారు. ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో విచారణ జరిగింది. అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో జరిగిన రోజు పరిణామాల ఆధారంగా పోలీసులు ప్రశ్నించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద ఉన్న సాక్ష్యుల నుంచి వివరాలు సేకరించారు. దీని ఆధారంగా అల్లు అర్జున్ను ప్రశ్నించారు.
వీడియో పుటేజ్ ఆధారంగా విచారణ
సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు ఇప్పటికే ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్ను ప్రశ్నంచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలపైనా ఆరా తీశారు. సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును ఇప్పటికే రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు. పుష్ప-2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు సంబంధించిన అనుమతిని పోలీసులు తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు.
అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా ? లేదా అనే విషయంపైనా అల్లు అర్జున్ను నుంచి స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ యజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా? అందినప్పటికీ మీరు ప్రిమియర్షోకు వచ్చారా? అనే విషయంపైనా ప్రశ్నలు అడిగారు. ఘటన జరిగిన పరిణామాలపై అన్ని కోణాల్లో విచారణ నిర్వహించిన పోలీసులు.. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ బౌన్సర్లు వ్యవహిరించిన తీరును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వ్యక్తిగత సిబ్బంది అభిమానులు తోసివేయడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఏమైనా తెలిసిందా?
తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను తమదైన శైలిలో పోలీసులు కీలక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. మూడున్నర గంటల పాటు వివిద అంశాలపై ప్రశ్నించారు. పుష్ప ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి ఏం జరిగిందన్న విషయంపైనే పోలీసులు అల్లు అర్జున్ ను సమాధానాలు రాబట్టారు. అల్లు అర్జున్ చెప్పే ప్రతి మాటలను రికార్డు చేశారు. అల్లు అర్జున్ కు ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధించారు.. వాటికి అనుబంధంగా ఇతర విషయాలను కూడా తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని తెలియదా ?
పోలీసులు సంధ్య ధియేటర్ కు హీరో, హీరోయిన్ రాకూడదని పక్కాగా సమాచారం ఇచ్చినప్పుడు, థియేటర్ నిర్వాహకులు అదే సమాచారాన్ని చిత్రబృందానికి అందించినప్పుడు, పర్మిషన్ లేదనే విషయం తెలిసి కూడా ఎందుకు థియేటర్ కు వచ్చారు అంటూ బన్నీకి పోలీసులు ప్రశ్నలు సంధించారు. పైగా రోడ్ షో ఎందుకు చేశారనే ప్రశ్న ఎదురైంది. దీనికి అల్లు అర్జున్ తనకు అనుమతి లేదన్న విషయం తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
పోలీసులే రూట్ క్లియర్ చేయడంతో అనుమతి ఉందనుకున్నానని ఆయన చెప్పినట్లుగా లీకు అయింది. రేవతి చనిపోయిందన్న విషయం పై రెండో ప్రశ్నను పోలీసులు అడిగినట్లుగా తెలుస్తోంది. రేవతి తొక్కిసలాటలో మృతి చెందిందన్న విషయం తెలుసా అని అడిగితే అల్లు అర్జున్ తెలుసు.. కానీ తర్వాతి రోజు తనకు తెలిసింది అని చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించారు.
థియేటర్ లో పోలీసులు కలవలేదు
రేవతి చనిపోయిందని, ఆమె బాబు చావు బతుకుల్లో ఉన్నాడని, వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ, డీసీపీ మీ వద్దకు చెప్పారా అనే ప్రశ్న అల్లు అర్జున్ ను పోలీసులు విచారణలో అడిగారు. దీనికి సమాధానంగా తన వద్దకు ఏ పోలీసులు రాలేదని, తనకేం చెప్పలేదని, మీడియాకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారని తాను ప్రెస్ మీట్ లో చెప్పిన విషయానికే అర్జున్ కట్టుబడి ఉన్నట్లుగా చెబుతున్నారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పైన పోలీసులు చెబుతున్న దానికి అల్లు అర్జున్ చెబుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉండడంతో మళ్లీ విచారణ చేయాల్సి వచ్చిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు చూపించి పోలీసుల ఇంటరాగేషన్ చేయగా కాస్త గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది.
కొన్ని ప్రశ్నలకు మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పిన అల్లు అర్జున్.. పలు కీలక ప్రశ్నలకు మాత్రం నోరు మెదపలేదని పోలీసులు తెలిపారు. ఏసీపీ, డీసీపీ మీకు ఆడిటోరియంలో కలిసారా? అనే ప్రశ్నకు.. వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదంటూ సమాధానం ఇచ్చినట్లు తేలింది. కాగా, అర్జున్ తరపు లాయర్ల బృందం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
అయితే ఒక్క లాయర్ ను మాత్రం అర్జున్ ను ప్రశ్నిస్తున్న రూంకు దూరంగా ఉండి చూసేందుకు అనుమతి ఇచ్చారు. కేవలం అబ్జర్వేషన్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు..దానికి అర్జున్ ఇచ్చిన సమాధానాలపై ఆయన లీగల్ టీం రివ్యూ చేసి పోలీసులు ఏమైనా కొత్త అభియోగాలు మోపేందుకు అవకాశం ఇచ్చమా అన్న అంశంపై పరిశీలన చేసి తదుపరి వ్యూహం ఖరారు చేసుకునే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగువ కోర్టులో బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంది.
ఎప్పుడు పిలిచినా వస్తా
ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో జరిగిన విచారణ సందర్భంగా అల్లు అర్జున్ నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు అల్లు అర్జున్ ను ఆదేశించగా, తప్పకుండా వస్తానని, పోలీసు విచారణకు సహకరిస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.
అయితే, విచారణకు ముందు లీగల్ టీమ్ తో సంప్రదింపులు చేశారు. సోమవారం నోటీసులు అందగానే.. పోలీసుల నోటీసులపైన అల్లు అర్జున్ తన లీగల్ టీం తో చర్చలు జరిపారు.
కాగా, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు దాదాపు మూడున్నర గంటల విచారణ తర్వాత అల్లు అర్జున్ తిరిగి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు.
బౌన్సర్ అంటోనీ అరెస్ట్
అర్జున్ ను ఓ వైపు ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన బౌన్సర్ల టీం లీడర్ అయిన ఆంటోనిని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య ధియేటర్ లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. నిబంధనల మేరకు బౌన్సర్లను నియమించుకున్నారా? లేదా అనే అంశంపైనా అల్లు అర్జున్ నుంచి వివరాలు రాబట్టారు. ఈ కేసులో మరికొంత మందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించాలని భావిస్తున్నారు.
విచారణ జరుగుతుండగానే.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ ఆంటోని అని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బౌన్సర్లకు ఆంటోని ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తుండగా ఆ రోజు వారి అత్యుత్సాహం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నగరంలో ఎక్కడా ఈవెంట్ జరిగినా ఆంటోని బౌన్సర్లను ఆర్గనైజ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంలోనూ ఆంటోనీనే బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా థియోటర్ దగ్గర సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి.. సంధ్య థియేటర్ కు తీసుకువచ్చి ఆ రోజు ఏం జరిగింది? అన్న వివరాలను రాబట్టారని తెలుస్తోంది. -ఆంటోనీతో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయించిన పోలీసులు.. తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో కూడా అంటోనీ దురుసుగా ప్రవర్తించినట్లు తేలింది.
దాదాపు 50 మందికి పైగా బౌన్సర్లతో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బౌన్సర్లు చాలా సేపటి వరకు అల్లు అర్జున్ వద్దకు పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా పోలీసులనే కొందరు బౌన్సర్లు నెట్టేశారు.