– రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న బిఆరెస్ పెద్దలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
– రైతు బంధు పేరిట అర్హత లేని వారికి రూ. 25,672 కోట్లు దోచి పెట్టింది మీరు కాదా?
– రాళ్లు, రప్పలకు, రోడ్ల నిర్మాణం కోసం సేకరించిన భూములకు, రియల్ ఎస్టేట్ లే అవుట్లకు రైతు బంధు ఇచ్చిందెవరు?
– ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని, మీరు చేసిన తప్పులను సరిదిద్దిన తర్వాత రైతు భరోసా ఇస్తామంటే మాపై విమర్శలా?
– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ పదేళ్ల పాలనలో ఓటు బ్యాంకు రాజకీయాలతో రైతులను మోసగించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు బంధు పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ‘రైతు భరోసా’ పథకం కోసం సరిదిద్ది రైతులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా అభినందించాల్సింది పోయి అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టడం ఎంత వరకు సమంజసమని మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
పదేళ్ల లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి సేకరించిన భూములకు, సాగులో లేని రాళ్ల గుట్టలకు ‘రైతు బంధు’ పేరిట దోచి పెట్టిన ఘనత మీకే దక్కిందంటూ ఎద్దేవా చేశారు. 2018-19 నుంచి 2022 2023 వరకు రూ.25,672 కోట్ల నిధులను సాగులో లేని భూములకు చెల్లించారు. ఒక్కసారి వెనక్కి తిరిగి, మీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసుకోవాలని శ్రీధర్ బాబు హితవు పలికారు.
ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని వివరించారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల ఉసురు తగిలే, మీరు అధికారం కోల్పోయారని గుర్తుంచుకోవాలన్నారు. 2014-2022 వరకు తెలంగాణాలో 6,121 మంది అన్నదాతలు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని మర్చి పోతే ఎలా ఆయన ప్రశ్నించారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ బలవన్మరణాల అంకెలను 2022 లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు గా నిలిచి మీరు చేసిన పాపాలను కడుక్కో వాలని శ్రీధర్ బాబు సూచించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు అప్పుల కుప్పగా మార్చి దిగిపోయినా రైతులకు ఇచ్చిన మాట మేరకు ఏక కాలంలో రూ. 21 వేల కోట్లు మాఫీ చేశామని గుర్తు చేశారు. మీడియాలో కనిపించడం మానుకుని ప్రజల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారమయ్యేందుకు ప్రయత్నించాలని శ్రీధర్ బాబు హితవు పలికారు.