– బెంగాల్ ఆటవిక పాలన నుండి విముక్తి
– భారీ పోలింగ్ దానికే సంకేతం
పశ్చిమ బెంగాల్లో అనేక దశాబ్దాలుగా నెలకొన్న ఆటవిక పాలనకి మే 4వ తారీఖున తెరపడి అభివృద్ధికి నవోదయానికి తెర లేపటం తథ్యం. బెంగాలీ ప్రజలు బలంగా మార్పును కోరుకున్నారు కాబట్టే నిర్భయంగా బయటికి వచ్చి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లు.. ఉదయం నుంచే బారులు తీరి తమ ఓటు హక్కు ని వినియోగించుకున్నారు. మమత అనే గ్రహణాన్ని ఓటు అని కాగడాతో దహించి, ప్రజలు కమలాన్ని వికసింప చేస్తున్నారు అనటంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
దేశంలో ఉన్న మహానగరాలకి సహజంగా ప్రజలు తరలివెళ్లి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటారు. కానీ విచిత్రం ఏంటంటే కోల్కత్తా అన్నది ఒక మహానగరం అయినప్పటికీ ,ప్రజలు అక్కడి నుండి తరలివెళ్లి దేశంలో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలలో ఉద్యోగుల కోసం ఉపాధి కోసం వెతుక్కోవలసిన దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత కమ్యూనిస్టులు, ఇప్పుడు మమత.
విద్యకి విజ్ఞానానికి ప్రగతికి సాహిత్యానికి ఆలవాలమైన బెంగాల్ భూమిని ఈ మూడు పార్టీలు కలిసి, ఒకరి తర్వాత ఒకళ్ళు పోటీపడి మరు భూమిగా మార్చారు. గతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఏ రకంగా మాఫియా సామ్రాజ్యాలు నడిచేయో.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అచ్చం అటువంటి పరిస్థితిలే ఉన్నాయి. పరిశ్రమలు లేవు, వ్యాపారస్తులు ధైర్యంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. హిందువులు తమ పండుగల్ని చేసుకునే స్వేచ్ఛ లేదు. మహిళలు స్వేచ్ఛగా బయటికి వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి ప్రశ్నార్థకం. లంచగొండి పరిపాలన, గల్లి నుంచి పై స్థాయి వరకు టీఎంసీ గుండాల హవా, బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులకు పెద్దపీట, శాంతి భద్రతలు శూన్యం.. ఇది పశ్చిమబెంగాల్ నేటి పరిస్థితి!
ఎన్నికలు వచ్చాయి అంటే చనిపోయిన వ్యక్తులు కూడా సమాధి నుంచి లేచి వచ్చి, బెంగాల్ లో ఓట్లు వేయటం పరిపాటే. టీఎంసీ గుండాలు ఎన్నికలు ప్రారంభం అయిన కొన్ని గంటల్లోనే, చనిపోయిన వ్యక్తుల ఓట్లు వేసేస్తారు. అలాగే ఆ ప్రాంతం నుంచి ఎప్పుడో వలస వెళ్లిపోయిన వాళ్ళ ఓట్లు కూడా వేస్తారు. దీన్నే అక్కడ ప్రాంతీయ భాషలో “చాప” ఓట్లు అంటారు. ఈ చాప ఓట్లు పునాదుల మీద టీఎంసీ విజయ సౌధాలు కట్టుకోవడం పరిపాటగా మారిపోయింది.
రాజ్యాంగబద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర ముమ్మర ఓట్ల సవరణ (SIR) ప్రక్రియ ద్వారా ఇటువంటి ఓట్లన్నీ తొలగించడం ద్వారా, మమతా బెనర్జీకి చాప ఓట్లు వేసుకునే అవకాశం లేకుండా పోయింది. టీఎంసీ గుండాలు లోపల పోలీసులు- ప్రభుత్వ ఉద్యోగులు అందరితో ములాకత్ అయిపోయి.. టీఎంసీ వ్యతిరేక ఓట్లు పడనివ్వకుండా- వాళ్లని పోలింగ్ బూత్ వరకు రాకుండా నిలువరించి, ఆ తరువాత అందరూ కుమ్మక్కై రిగ్గింగ్ చేసుకోవడం వారికి పరిపాటి.
ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాల ద్వారా కట్టుదిట్టమైన రక్షణ కల్పించి ఓటర్లలో ధైర్యం నింపి, ఎక్కడికి అక్కడ టీఎంసీ గుండాలను అరెస్టు చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ అయ్యే విధంగా చూశారు. కాబట్టి 93% ఓట్లు నమోదు అవ్వటం అంటే ఆ రాష్ట్రంలో చిన్న విషయం కాదు. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎంత మెచ్చుకున్నా అది తక్కువే. వారు తీసుకున్న చర్యల ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ, మనం కొన్ని పోలింగ్ బూత్‌లలో EVM మెషిన్లలో బిజెపి గుర్తు ఉన్న బటన్ వద్ద సీలు వేసేసిన దృశ్యాలు కొన్ని చూశాం. అంటే అక్కడి అధికారులు టిఎంసితో కుమ్మక్కయి, బిజెపికి ఓటు పడకుండా చేసిన దుర్మార్గపు చర్య. అదే కేంద్ర ఎన్నికల సంఘం ఇంత కఠిన చర్యలు తీసుకోకుండా ఉంటే, ఇంకా ఎంత ఎత్తున ఇటువంటి దుర్మార్గాలు చేసి ఉండేవారు? ఒక్కసారి ఆలోచించగలరు. దేశంలోని కొందరు కుహనా మేధావులు, కొన్ని మీడియా చానెళ్లు, భాజపా పాలిత రాష్ట్రాలలో చిన్న తప్పు జరిగితే దేశం మొత్తం గోల గోల చేస్తారే కానీ, మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా కళ్ళున్న కబోదిలా ప్రవర్తించడం దురదృష్టకరం.
బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాటు దారులని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ..వారికి ఆధార్ కార్డులు- బ్యాంకు ఖాతాలు- ఓటర్ ఐడి కార్డులు ఇవ్వటం ద్వారా, దేశ భద్రతకి పెను సవాలుగా మారింది. బెంగాల్ లోకి ప్రవేశించిన ఈ అక్రమ వలసదారులు, దేశంలో వివిధ రాష్ట్రాలలోకి చేరిపోయి భారతీయుల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టడంతో పాటు .. అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటూ, దేశ భద్రతకి సవాలుగా మారుతున్నారు.
నేడు బెంగాలీ ప్రజలు మమతపై చేస్తున్న తిరుగుబాటు.. వారి ఉనికి సంస్కృతి పరిరక్షణ కోసమే కాదు. దేశ రక్షణ కోసం కూడా అని మనం గుర్తుపెట్టుకోవాలి. మే నాల్గవ తారీకు పశ్చిమ బెంగాల్ లో కమల వికాసంతో ఆ రాష్ట్ర భవిష్యత్తు కాదు దేశ భవిష్యత్తు కూడా మారనున్నది.
– పెద్దిరెడ్డి రవికిరణ్
( బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్)