(ఇంద్రాణి )
మేడే! శ్రామికులు తమ శ్రమకు గౌరవం తీసుకొచ్చిన రోజుగా భావించి చేసుకునే అంతర్జాతీయ పండుగ. ప్రపంచ కార్మికులంతా ఏకం కాకపోయినా, అందరూ తప్పనిసరిగా జరుపుకునే వేడుక. ప్రస్తుతం ప్రపంచంలో ‘కార్మికుడు’ అనే నిర్వచనంలోకి వచ్చేవారు ఎవరనే చర్చ రెండు దశాబ్దాలుగా జరుగుతున్నది, కానీ తేలడం లేదు. కారణం, నిర్ణయాధికారం లేని ఉద్యోగం చేసే ప్రతి ఉద్యోగీ కార్మికుడే అంటుంది చట్టం.
కానీ ఐటీ ఉద్యోగుల వంటి వారు తమను కార్మికులు అంటే ఇష్టపడరు. మొన్నమొన్నటి వరకు వారికి ఒక ఐక్యవేదిక కూడా లేదు. కానీ లేఆఫ్‌ల పరంపర మొదలైన తర్వాత, వారు కూడా నెమ్మదిగా యూనియన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వివాదం మాట అలా ఉంచితే, దేశంలో ఉన్న ఏకైక కమ్యూనిస్టు ప్రభుత్వం కుప్పకూలిపోతుందని సర్వేలు చెప్పే వేళ అంతర్జాతీయ కార్మికదినోత్సవం ‘మేడే’ వచ్చింది.
కార్మికులు అంటే ఎర్రజెండా గొడుగులో మాత్రమే ఉంటారని ఎవరూ అనరు. కానీ కార్మికులకు ఎర్రజెండాకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా నీడలో ఉండే కార్మికసంఘాలే కాకుండా, స్వతంత్ర కార్మికసంఘాలు అనేకం ఉంటాయి. ఎవరి లోగోతో వారు మేడే నాడు జెండా ఎగురవేసినా, ఎర్రజెండాల రెపరెపల మధ్య జరిగే మేడే ఉత్సవాల కథే వేరు. ఎవరు ఎన్ని చెప్పినా ‘కార్మికులు’ అనే పదానికి, కమ్యూనిస్టులకు ఒక విడదీయలేని బంధం ఉంటుంది.
దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గిపోయి ఉండొచ్చ. కానీ మేడే నాడు చాలా ఊళ్లల్లో కనిపించే ఎర్ర తోరణాలు ఇప్పటికీ ఉత్తేజాన్ని కలిగిస్తూనే ఉంటాయి. కార్మికులతో కమ్యూనిస్టుపార్టీల అనుబంధమే పశ్చిమబెంగాల్ నుండి కమ్యూనిస్టుల నిష్క్రమణకు దారి తీసింది అనే వారూ ఉన్నారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. కమ్యూనిస్టుల ఏలుబడిలో కార్మిక నియంతృత్వం కాకపోయినా, కొంతమేర కార్మిక హక్కుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
పెట్టుబడిదారుడు శ్రమ దోపిడీ లేకుండా నిలదొక్కుకోలేడు, అందుకే కార్మికహక్కుల కొరకు పోరాడే కమ్యూనిస్టులే ప్రభుత్వాలు నడిపే రాష్ట్రాల్లో పెట్టుబడులు రావు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే కమ్యూనిస్టు ప్రభుత్వాలు, పెట్టుబడిదారులకు వేరే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి రాయితీలు కూడా ఇవ్వవు. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడానికి కేంద్రప్రభుత్వమే కొన్ని పాలిసీలను మార్చుకోవలసి వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్లో రాయితీల నుండి అనేకం ఇచ్చారు. ఇటువంటి విధానాలను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. అందువలన వారి పాలనలో ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడిదారులు రావడానికి సుముఖంగా ఉండరు. ఫలితంగా ఉపాధి కల్పన జరగక యువత నిరాశకు గురై మార్పును కోరుకుంటారు.
పశ్చిమబెంగాల్లో అదే జరిగింది. జ్యోతిబసు కమ్యూనిస్టు భావజాలం నుండి బయటపడలేక పరిశ్రమల స్థాపన కోసం ప్రయత్నం చేయలేదు. ఢిల్లీ కంటే ముందు కొంతకాలం దేశ రాజధానిగా ఉండి, ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న బెంగాల్ రాష్ట్ర ప్రజలు, పరిశ్రమల ఆవశ్యకతను పట్టించుకోలేదు. వారు మేలుకునే సమయానికి జ్యోతిబసు కంటే విస్తృతంగా సమాజపు లోతులను చూసిన బుద్ధదేవ్ భట్టాచార్య, యువత ఆశలకు అనుగుణంగా నడవాలనుకున్నారు. టాటా వారికి భూములు ఇచ్చి పారిశ్రామికీకరణకు నడుం బిగించారు.
అప్పుడు రైతులను అడ్డం పెట్టుకుని మమతాబెనర్జీ పోరాటం సాగించారు. రైతులే కాకుండా అన్ని వర్గాల వారూ మమతాబెనర్జీని ఆదరించడానికి కారణం అప్పటికే కమ్యూనిస్టుల పరిపాలనలో అభివృద్ధి పథంలో వెనుకబడ్డామనే భావన ప్రజలందరిలో బలంగా ఉండటమే! సుత్తి-కొడవలిని పక్కన పెట్టి గడ్డి పరకను (తృణమూల్) వేళ్ళునుకునేలా చూసిన బెంగాలీలకు అక్కడ కూడా నిరాశ ఎదురై, ఈరోజు ‘జై శ్రీరామ్’ అంటూ తమకు తాము సాంత్వన కలిగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రపంచంతో పాటు కమ్యూనిస్టు ప్రభుత్వం పరుగులు పెట్టి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి మాత్రం తీరని లోటు జరిగింది. ఇదే పరిస్థితి ఎల్లకాలం ఉండదు, కానీ మార్పు కోసం మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. కార్మికహక్కులు అనే విషయంలో బాధ్యతను పట్టించుకోరు కమ్యూనిస్టులు అనే విమర్శ కూడా ఉన్నది. అందులో కూడా కొంత వాస్తవం లేకపోలేదు.
రాజ్యాంగం మాదిరిగా హక్కుల గురించి మాట్లాడినప్పుడు, బాధ్యతల విషయం కూడా అనుక్షణం గుర్తు చేయవలసిన అవసరం ఉన్నదనేది అర్థం చేసుకున్న జనచైనా, కమ్యూనిస్టు నియంతృత్వంలో కూడా అమెరికాకు దీటుగా పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నది. ప్రపంచంలో ఈరోజు కమ్యూనిస్టు దేశాలలో ఒక్కొక్క దేశంలో పరిపాలన ఒక్కో రకంగా ఉన్నది. ఒకనాడు అమెరికాకు పోటీగా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధించి, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అనుక్షణం అమెరికాను వణికించిన రష్యా, ఈరోజు వెనుకబడటం వెనుక కారణాలను అన్వేషిస్తుందో లేదో తెలియదు.
కానీ జనచైనా మాత్రం ‘మార్కెట్ సోషలిజాన్ని’ అమలులో పెట్టి, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండటమే కాక స్థిరమైన అభివృద్ధి గమనాన్ని కొనసాగిస్తున్నది. అయితే అక్కడ హక్కుల పోరాటాలు జరిగే అవకాశం ఉండదని కమ్యూనిస్టులు ఒప్పుకోవడానికి ఇష్టపడకపోయినా అది వాస్తవం. శ్రమశక్తి కారుచౌకగా దొరకని దేశంలో వస్తూత్పత్తి అంత చౌకగా జరగదు. ప్రతి ఇల్లు ఒక చిన్నపాటి కుటీర పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చెందడం వలన కొంత వెసులుబాటు వచ్చినప్పటికీ, హక్కుల పోరాటాన్ని నియంత్రించడం అనేది మాత్రం సత్యం.
ఒకటి మాత్రం వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు విస్తృతంగా తమ ప్రభావాన్ని చూపకుంటే, ఈరోజు ప్రపంచ ప్రజలు అనుభవిస్తున్న సామాజిక న్యాయం ప్రజలకు అందుబాటులోకి వచ్చేది కాదు. ముఖ్యంగా ప్రపంచంలో ఈరోజు కార్మికులహక్కుల కోసం చట్టాలు వచ్చాయంటే ప్రధాన కారణం కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలే అనేది ఎవరూ కాదనలేని సత్యం.
విచిత్రంగా చికాగో నగరంలో చిందిన కార్మికుల రక్తం నుండి ఎగసిన ఎర్రజెండా అంటే అమెరికా పాలకులకు ఇప్పటికీ భయమే. ట్రంప్కైతే పీడకలే!
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావడం కోసం కాక, ప్రజా ఉద్యమాలకే ప్రాధాన్యతను ఇచ్చాయి. వారు వేసిన ప్రజా ఉద్యమాల బాటను అధికారం కోసం ఉపయోగించుకుని అనేక పార్టీలు అధికార పీఠాన్ని అధిరోహించాయి. దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గిన దాని ప్రభావం ఇప్పటికే కనిపిస్తున్నది. పాలకులు చెప్పిందే వేదం అవ్వడానికి కారణం, నిరసన తెలిపే గొంతుకకు మద్దతుగా నిలవగలిగే బలం వామపక్షాలకు ప్రస్తుతం లేకపోవడం. సహజవనరుల దోపిడీ జరుగుతున్నా ప్రజలు అడ్డుకోలేని అశక్తతకు, అసంఘటిత శ్రామికవర్గం హక్కుల కోసం పోరాటం చేయలేకపోవడం వెనుక ఉన్న విషాదం కూడా అదే!
‘నిరాశావాది నిస్పృహతో ఉంటే, ఆశావాది అందలం ఎక్కుతాడు’ అంటారు. వామపక్ష అభిమానులు నిరాశ పడవలసిన అవసరం లేకుండా నిన్న నుండి పాఠాలు నేర్చుకుని, నేటి నుండి బలోపేతం అవ్వడానికి ఒక మార్గాన్ని ఎన్నుకుని, రేపు మరలా కార్మికులహక్కుల కోసం విస్తృతంగా ఉద్యమాలు చేయగలిగే స్థాయికి దేశంలో వామపక్షాలు బలోపేతం అవ్వాలని ఆశిస్తూ… ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో.!