– చిప్స్ రాశులు పోసి అమ్మే సిలికాన్ సీమగా!
రాయలసీమ అంటే ఒకప్పుడు కరువు, వలసల ప్రాంతం. కానీ నేడు హార్టికల్చర్ హబ్ గా తనను తాను మలుచుకొని దేశానికి ‘ఫ్రూట్ బౌల్’ గా మారింది. ఇప్పుడు అది “అగ్రి-సిలికాన్ కారిడార్” గా రూపాంతరం చెందుతోంది. రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన RRP ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టు కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, సీమ తలరాతను మార్చే ఒక సామాజిక-ఆర్థిక మలుపు.
ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ తన పారిశ్రామిక సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకుంది. ముంబైలో విజయవంతంగా నడుస్తున్న పైలట్ ఒసాట్ (OSAT – Outsourced Semiconductor Assembly and Testing) సౌకర్యం ద్వారా పొందిన అనుభవాన్ని ఇప్పుడు రాయలసీమకు తీసుకువస్తోంది. భారత అణుశక్తి విభాగానికి (Atomic Energy Department) సరఫరా చేసే అత్యంత కీలకమైన రక్షణ పరికరాలను కూడా ఇక్కడ తయారు చేయడం, ఈ ప్లాంట్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
తైవాన్‌కు చెందిన AMB మరియు DECA Technologies వంటి గ్లోబల్ దిగ్గజాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, రాయలసీమను ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0’ గ్లోబల్ మ్యాప్‌లో గర్వంగా నిలబెడతాయి.
ఈ RRP ఎలక్ట్రానిక్స్ భారీ పరిశ్రమ శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలం టేకోడు వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరనుంది. అక్కడే కార్లను పండిస్తున్న కియా తరహాలో, రూ. 10,239.78 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది. అనుమతులు పొందిన 25 నెలల్లో మొదటి దశ పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల వల్ల స్థానికంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది. “మేడ్ ఇన్ రాయలసీమ” అంటే కేవలం పండ్ల బుట్ట మాత్రమే కాదు, హై-ఎండ్ మైక్రోచిప్స్ ఉన్న బాక్సు కూడా అని ప్రపంచానికి చాటిచెప్పే సమయం వచ్చింది. దశాబ్దాలుగా రాయలసీమలోని మేధావులు ఉద్యోగాల కోసం బెంగళూరుకో, హైదరాబాద్‌కో వలస వెళ్లేవారు. ఆ “టాలెంట్ డ్రెయిన్”కు ఇప్పుడు అడ్డుకట్ట పడనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,017 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. సీమ రైతు బిడ్డ ఇకపై అక్కడే సెమీకండక్టర్ సేద్యం చేయనున్నాడు. VLSI డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు చిప్ ఫ్యాబ్రికేషన్‌లో స్థానిక ఇంజినీర్లకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు తలుపు తడుతున్నాయి.
భూమి కేటాయింపు, కేబినెట్ క్లియరెన్స్ పూర్తయ్యాయి. ఇక తదుపరి భారీ అడుగు — శంకుస్థాపన మహోత్సవం.
రాయలసీమ రైతులకు, యువతకు RRP ఎలక్ట్రానిక్స్ రాక ఒకటే సందేశాన్ని ఇస్తోంది: “కేవలం పొలం అనుకునే రోజులు పోయాయి — గ్లోబల్ టెక్-అగ్రి హబ్ రోజులు మొదలయ్యాయి”. ఒకనాటి వెనుకబడ్డ సీమ, కోస్తాలోని కొన్ని జిల్లాల జీడీపీని అధిగమిస్తూ అలనాడు రతనాలు రాశులు పోసిన గడ్డ మీద చిప్స్ రాశులు పోసి అమ్మే ‘సిలికాన్ సీమ’గా మారబోతోంది.