– అమిత్‌షా తనయుడి మద్దతు?
– ఇంకా వైసీపీలోనే పీవీపీ
– వ్యతిరేకిస్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన క్యాడర్
– పీవీపీకి బీజేపీ పెద్దల తెరచాటు మద్దతు?
– పీవీపీకి సీటు ఇస్తే పనిచేయమంటున్న బీజేపీ-టీడీపీ శ్రేణులు
– పొత్తులో వచ్చినా ఓటు బదిలీ కాదని స్పష్టీకరణ
-బీజేపీ-వైసీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ అనుమాలకు బలం చేకూరుతుందని ఆందోళన
( మార్తి సుబ్రహ్మణ్యం)
విజయవాడ బీజేపీ పార్లమెంటు అభ్యర్ధిగా వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ను తెరపైకి తీసుకువచ్చే వ్యవ హారంపై ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హోంమంత్రి అమిత్‌షా తనయుడు జైషా మద్దతుతో, పీవీపీ బీజేపీ పొత్తు అభ్యర్ధిగా తెరపైకి వస్తున్న తీరుపై బీజేపీ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా పొత్తులో కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతోంది.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిన పీవీపీ.. ఈసారి పొత్తులో బీజేపీ అభ్యర్ధిగా వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను, బీజేపీ-టీడీపీ-జనసేన వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.ప్రధానంగా పీవీపీ అభ్యరిధ అయితే తాము పనిచేసేది లేదని టీడీపీ నేతలు ఖరాఖండీగా చెబుతున్నారు. ఇప్పటికీ వైసీపీ నాయకుడిగా ఉన్న పీవీపీకి బీజేపీ సీటు ఎలా ఇస్తారరని బీజేపీ వర్గాలు ప్రశ్తిస్తున్నాయి. అమిత్‌షా తనయుడు జైషా మద్దతుతో, ఆయన టికెట్ తెచ్చుకుంటారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
అయితే ఇప్పటివరకూ పొత్తులో భాగంగా.. విజయవాడ బీజేపీ అభ్యర్ధిగా సుజనా చౌదరి బరిలోకి దిగుతారని బీజేపీ-టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. సుజనాకు విజయవాడ పార్లమెంటులోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతమైన పరిచయాలు ఉండటం, గతంలో టీడీపీ నేతగా పనిచేసిన అనుభవం ఉండటం, పార్లమెంటు పరిథిలో కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉండటంతో సుజనా అభ్యర్ధిత్వంపై సహజంగా సానుకూలత కనిపించింది. పైగా ఆయన తరచూ విజయవాడ పార్లమెంటు పరిథిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుండటంతో, సుజనాకు రెండు పార్టీల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. సుజనా అభ్యర్ధి అయితే ఓటు బదిలీ సులభంగా అవుతుందన్న వ్యాఖ్యలు వినిపినన్నాయి.
అదే పీవీపీ గత ఎన్నికల్లో ఓడిన తర్వాత, ఎప్పుడూ కనిపించిన దాఖలాలు లేవు. ట్వీట్లలో తప్ప కనిపించలేదు. కానీ సుజనా తన రాజ్యసభ ఎంపీ పదవి కోల్పోయిన తర్వాత కూడా, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా కరోనా సమయంలో తన ఫంక్షన్ హాల్‌ను క్వారంటైన్ సెంటర్‌కు ఇవ్వడంతోపాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్ సెంటర్లకు బెడ్లు సరఫరా చేశారు. దానితో ఆయన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మానసికంగా బాగా దగ్గరయ్యారు.
కాగా పీవీపీకి విజయవాడ సీటు ఇస్తే, తాను పోటీ చేసే ఎంపీ స్థానానికి అయ్యే ఖర్చంతా భరించే ఒప్పందంతో ఒక కీలక నేత భర్త, ఆయనతో మంతనాలు జరిపారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. జైషా కూడా సదరు కీలకనేత ద్వారా చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలాంటి లాబీయింగ్ చేయటంలో సదరు నేత భర్త సిద్ధహస్తుడని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
స్థానిక కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే పనిచేసేది లేదని, పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. పైగా ఇప్పటికీ వైసీపీ నేతగా ఉన్న పీవీపీ, ఆ పార్టీకి రాజీనామా చేయలేదని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే.. వైసీపీ-బీజేపీ మధ్య ఉన్న సంబంధం కూడా బట్టబయలయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పీవీపీకి బీజేపీ టికెట్ ఇస్తే.. బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న తెరచాటు బంధం ప్రజలకు తెలిసి, ఆ ప్రభావం బీజేపీ ఎంపీ అభ్యర్ధులపై పడే ప్రమాదం లేకపోలేదని బీజేపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.