Suryaa.co.in

Features

సిరివెన్నెల.. వేటూరి బ్రాండ్ మద్యం తాగండి!

యండమూరి.. మధుబాబు.. విశ్వనాథ.. చలం.. సిరివెన్నెల.. వేటూరి బ్రాండ్ మద్యం తాగండి!

తెలుగు “QUORA”లో ఓ అపరిచిత వ్యక్తి అడిగిన ప్రశ్న:
నేను (25) ఇప్పటి వరకూ మద్యం సేవించలేదు. మానసిక ఒత్తిడి తో ఆరోగ్యం చెడగొట్టుకునే కన్నా మద్యం సేవించి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నా. నేను దేనితో (మద్యం రకం) మొదలు పెడితే మంచిది?

రాజన్ పి.టి.ఎస్.కె సమాధానం:
మానసిక ఒత్తిడితో ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే మద్యం సేవించడమే ఉత్తమం. కానీ మీరు ఎంచుకునే బ్రాండ్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ముందుగా మీరు “యండమూరి”, “మధుబాబు” బ్రాండ్లతో మొదలు పెట్టండి. ఆ రెండు బ్రాండ్లూ ముప్పై, నలభై యేళ్ళుగా చాలా రిలయబుల్ బ్రాండ్లుగా పేరుమోసినవి. చాలామంది వాటితోనే మత్తులో జోగడం మొదలు పెట్టారు. ఆ మత్తు మహత్తు తెలిశాక, ఇంకా ఎక్కువ మత్తిచ్చే వాటికోసం వెతుక్కుని మరీ వెళ్ళేవారు. మీరు మొదట్లోనే “విశ్వనాథ”, “చలం” వంటి బ్రాండ్లను వాడడానికి ప్రయత్నించకండి. అవి చాలా కాస్ట్‌లీ బ్రాండ్లు. వాటిని ఒకసారి టేస్ట్ చూస్తే ఇక వదిలి పెట్టడం కష్టం. అవి రెండూ పూర్తిగా డిఫరెంట్ టేస్ట్‌లు కూడా.

ఇంకా నేను వాడిన వాటిలో “ముళ్ళపూడి”, “శ్రీపాద”, “గురజాడ”, “జాషువా” చాలా ఎక్కువ కిక్కిచ్చే బ్రాండ్లు. ఇప్పటికీ నేను ఈ బ్రాండ్లు వాడుతూనే ఉన్నాను. మీరు ఇంకొక టైప్ మద్యం కూడా పుచ్చుకోవచ్చు. అవి వీటికంటే త్వరగా అంటే ఇన్‌స్టంట్‌గా కిక్ ఇచ్చేవి. మీ సమస్య ప్రేమకు సంబంధించినదైతే “ఆత్రేయ” బ్రాండ్ వాడండి. ఒకవేళ జీవితంలో ఎదుగుదలకు సంబంధించినదైతే “సిరివెన్నెల” బ్రాండ్ వాడండి. మీ సమస్య ఏమిటో మీకే స్పష్టత లేకపోతే.. ఒన్ అండ్ ఓన్లీ “వేటూరి” బ్రాండ్ వాడండి. ఆ కాక్‌టైల్ బ్రాండ్‌ని మించిన బ్రాండ్‌ నాకింతవరకూ దొరకలేదు. అది సర్వరోగ నివారిణి టైపన్న మాట. అది తాగితే మీకు మత్తెక్కడం 100 శాతం గ్యారంటీ. అందుకు నాదీ పూచి.

ఇవి కాకుండా ఇంకొక టైపు బ్రాండ్లు కూడా ఉన్నాయి. మీకు టేస్టీగా ఉంటూ మాంచి మత్తెక్కాలంటే “ఓషో” బ్రాండ్ వాడండి. కానీ పొరపాటున కూడా “JK” బ్రాండ్‌కు మాత్రం వెళ్ళకండి. JK అంటే జిడ్డు కృష్ణమూర్తి. ఆ బ్రాండ్ తాగితే మీకెక్కిన మత్తు మొత్తం దిగిపోవడమే కాదు, అంతకుముందు తాగిన బ్రాండ్ల టేస్ట్‌లన్నీ కూడా మరచిపోతారు.

ఇక విషయంలోకి వద్దాం. మీ సమస్యేమిటో మాకు తెలియదు. ఒకవేళ మీరు చెప్పినా అది మాకెంత వరకూ అర్థమవుతుందో కూడా చెప్పలేం. మీ సమస్య విని దానికో అద్భుతమైన పరిష్కారం చెప్పెయ్యడానికి, అసలు ఈలోకంలో సమస్య లేనివాడెవ్వడు? వాడి సమస్యనే వాడు పరిష్కరించు కోలేనప్పుడు మీ సమస్యనేం పరిష్కరిస్తాడు. కనుక ఇతరుల మీద ఆధార పడటం అన్నది ఏదో కాసింత సాంత్వన చేకూర్చడానికే ఉపయోగ పడుతుంది తప్ప, పరిష్కారానికి కాదు. కాకపోతే సమస్యను చర్చించడం ద్వారా మీకు కొత్త ఆలోచనలు వచ్చి, సమస్యా పరిష్కారం వైపు అడుగులు పడే అవకాశం మాత్రం ఉంది. కానీ అందుకు వేదిక ఇది కాదు. మీ వ్యక్తిత్వం గురించి, ఆలోచనా సరళి గురించి ఏమాత్రం తెలియని ఇక్కడి వాళ్ళు, మీ సమస్యను ఏ కోణంలో చూస్తూ చర్చించగలరు? కనుక మీరు మీ సమస్య గురించి చర్చంటూ చేస్తే అది మీ ఆప్తమిత్రలతోనే అయ్యుండాలి.

పోనీ మీతో మీ సమస్య గురించి చర్చించే ఆత్మీయులెవరూ లేరనుకుంటే, అప్పుడు ఈ మద్యం దగ్గరకు రావొచ్చు. కాకపోతే, మద్యం తాగాక ఒక పూట వరకూ అయితే మత్తుంటుంది. కానీ అది దిగిపోయాక మళ్లీ మీకు మీ సమస్య గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళీ తాగాలి. అలా తాగుతూనే ఉండాలి. ఇవన్నీ కాస్ట్‌లీ వ్యవహారాలు. ఆరోగ్యం, ఆదాయం గుల్లైపోతాయ్. సమస్యకు పరిష్కారం ఎలానూ ఆ మద్యం ఇవ్వలేనప్పుడు, దానికోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అనవసరంగా ఆరోగ్యం పాడుచేసుకోవడం ఎందుకు? అందుకే మీకు పెద్దగా ఖర్చులేనివైన పై బ్రాండ్లను సజెస్ట్ చేశాను. పుస్తకాలను చదవడం వల్లా, ఉత్సాహాన్నిచ్చే పాటలను వినడం వల్లా రెండు రకాల లాభాలున్నాయి.

ఒకటి.. పుస్తకం చదువుతున్నంతసేపూ, పాటలు వింటున్నంతసేపూ తాత్కాలికంగా మన సమస్యను మరచిపోవచ్చు.రెండు.. పుస్తకాలు చదవడం వల్ల వచ్చే కొత్త జ్ఞానం, పాటలు వింటున్నప్పుడు కలిగే నూతన స్ఫూర్తి మీ ఆలోచనా విధానాన్ని మార్చడానికి ఉపయోగపడవచ్చు.

వేటూరి గారి “కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అనే పాట సురేంద్రబాబు అనే వ్యక్తి IPS ఆఫీసర్ అవడానికి ప్రేరణనిచ్చింది. సీతారామశాస్త్రి గారి “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి” అనే పాట రాజమౌళికి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారికి కష్టకాలంలో ఊరటనిచ్చింది.

Yandamoori Veerendranath గారి రచనలతో స్ఫూర్తి పొంది, నిరాశాపూరితంగా గడుస్తున్న తన జీవితాన్ని వ్యాపారవేత్త స్థాయికి మలచుకున్న ఓ వ్యక్తి కథ కూడా మనకు చెప్పలేనంత ధైర్యాన్నిస్తుంది. ఆయన తన లారీలన్నింటి వెనుక “జై యండమూరి” అని వ్రాయించుకున్నాడంటేనే ఆయనకు యండమూరి గారి రచనలు ఎంత ప్రేరణనిచ్చాయో తెలుస్తోంది.

మీ ప్రశ్నకు సమాధానంగా నేను జవాబు వ్రాసిన విధానంలో కాసింత సరదా ఉందేమో కానీ, సమస్యతో సతమత మవుతున్న మీ మీద మాత్రం నాకు సాటి మనిషిగా సానుభూతి, మీరు మీ సమస్యనుండి త్వరలోనే బయటపడాలనే ఆకాంక్ష ఉన్నాయి. స్వస్తి!ప్రపంచంలో సమస్యలున్న సుమారు 795 కోట్లమందిలో ఒకడైనవాడు, కానీ ఎన్నటికీ ధైర్యం కోల్పోనివాడూ, మీ శ్రేయస్సు కోరుకునేవాణ్ణి.
మనవి: మద్యం తాగడం మంచిదా కాదా? సరదాగా తాగడం తప్పా ఒప్పా? మొదలైన విషయాలు ఇక్కడ నేను చర్చించడం లేదు. సమస్యకు పరిష్కారంగా మద్యం, ఏమాత్రం ఉపయోగపడదని మాత్రమే నేను చెబుతున్నాను.

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE