-రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్‌గాంధీ
-ఏప్రిల్‌లో వరంగల్‌లో రైతుగర్జన.. రాహుల్ హాజరు
-తెలంగాణలో అధికారమే లక్ష్యం కావాలి
-రాష్ట్ర పార్టీ నేతలకు రాహుల్ సూచన
-ఆంతరంగిక సమావేశంలో దిశానిర్దేశం
న్యూఢిల్లీ : తెలంగాణలో అధికారమే లక్ష్యం కావాలని, అధికార టీఆర్‌ఎ్‌సతో అమీ తుమీ తేల్చుకునే దిశగా ముందుకు సాగాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయుంచింది. ఇందుకోసం రైతాంగ ఉద్యమంతో మొదలుపెట్టి.. ప్రజాందోళనలు తీవ్రతరం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. ఈ నెలాఖరులో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కాగానే నీళ్లు, నిధులు, నియామకాలపై ఉధృతంగా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఇతర నేతలతో జరిగిన అంతరంగిక సమావేశంలో రాహుల్‌గాంధీ ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిసింది.
రైతులను ధాన్యం పేరుతో మోసం చేసి, వారి కడుపు కొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, రైతు ఉద్యమంతో ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టాలని, ఏప్రిల్ నెలాఖరులో లక్షలాది మంది రైతులతో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరై ప్రసంగించనున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని ఢీకొంటున్నట్లు రైతులను కేసీఆర్ మభ్యపెడుతూ, వారిని మిల్లర్ల కబంధ హస్తాల్లో చిక్కుకునేలా చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్‌కు చెప్పినట్లు తెలిసింది. రైతులను ఇతర పంటల నుంచి వరికి మళ్లించి భారీ ఎత్తున పండించేలా చేసిన కేసీఆర్.. చివరకు వారిని నట్టేట ముంచారని చెప్పారు. పసుపు, చెరకు రైతుల విషయంలో కూడా కేసీఆర్ ఇలాంటి అన్యాయాలకు పాల్పడ్డారని వివరించారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నేతృత్వంలోకమిటీ వేసేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
యువగర్జన సభకు ప్రియాంక హాజరు : రైతుల సమస్యలపై వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత నిరుద్యోగ సమస్యపై యువగర్జనను నిర్వహించాలని, ఈ సభలో ప్రియాంకాగాంధీ పాల్గొనాలని రాహుల్‌తో సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ‘‘మీరు ఉద్యమాలు నిర్వహించండి.. తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. మీరు నిర్వహించే సభలకు మా కుటుంబం తరఫున ఎవరో ఒకరు హాజరవుతారు’’ అని రాహుల్ చెప్పినట్లు సమాచారం.
బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను నమ్మవద్దని కూడా పార్టీ నేతలతో రాహుల్ అన్నట్లు తెలిసింది. ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్‌కు కేసీఆర్ స్నేహహస్తం చాచే అవకాశాల గురించి ఒక నేత ప్రస్తావించగా రాహుల్ తీవ్రంగా ప్రతిస్పందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘కేసీఆర్ ఎప్పుడు ఎటువైపు మారతాడన్న విషయంపై మీకంటే ముందు మాకు ఎక్కువ అవగాహన ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ఉచ్చులో కాంగ్రెస్ ఇరుక్కునే ప్రసక్తే లేదు. మనం గట్టిగా పోరాడేందుకు సన్నద్ధమవుదాం’’ అని రాహుల్ చెప్పినట్లు ఈ వర్గాలు పేర్కొన్నాయి.