Suryaa.co.in

National

ఈ పరిస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వమే

-నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల రాహుల్ గాంధీ స్పందన

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నుపుర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.

అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. దేశంలో ఆగ్రహావేశాలు, విద్వేషం ఇంతలా ప్రజ్వరిల్లడానికి ఏ ఒక్క వ్యక్తో (నుపుర్ శర్మ) కారణం కాదని, ఈ తరహా వాతావరణాన్ని సృష్టించింది కేంద్రమేనని ఆరోపించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇందుకు బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇది దేశ ప్రయోజనాలకు, ప్రజలకు వ్యతిరేకమైన పంథా అని విమర్శించారు.

“కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య వారధులు నిర్మించింది, వర్గాల మధ్య వారధులు నిర్మించింది. మేం ప్రజలను ఒక్కటిగా చేశాం. కానీ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నాయో చూశాం. ఇది మన తత్వానికి ఏమాత్రం సరిపడదు. విద్వేషం, కోపాగ్నితో సమస్యలు పరిష్కారమవుతాయని భావించడంలేదు” అని రాహుల్ స్పష్టం చేశారు. కేరళలోని వయనాడ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A RESPONSE