Suryaa.co.in

Telangana

రిజర్వేషన్‌లకు రాహుల్ వ్యతిరేకం

– అమెరికాలో బయటపడ్డ కాంగ్రెస్ నిజస్వరూపం
– రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపాటు

హైదరాబాద్: అమెరికాలో కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్కడి సమావేశాల్లో భారత వ్యతిరేక వ్యక్తులు, శక్తులతో సమావేశం కావడంపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. అణువణువునా భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ, విభేదిస్తూ, అవకాశం ఉన్నప్పుడల్లా భారతదేశంపై విషం చిమ్మే అమెరికా శాసన సభ్యురాలు, పాకిస్తాన్ సమర్థకురాలు ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ సమావేశమవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

భారతదేశంలో రిజర్వేషన్లను పరిస్థితులు అనుకూలిస్తే రద్దు చేస్తామని రాహుల్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ అసలురంగు, కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. విదేశీ పర్యటనల్లో భారతదేశం పట్ల, భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల, భారత ప్రజలను అవమానించేలా విమర్శలు చేయడం రాహుల్ గాంధీకి పరిపాటిగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజామోదంతో బీజేపీ గెలుపొందితే.. ఆఖరుకు ప్రజల తీర్పును సైతం అవమానించేలా రాహుల్ మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని కించపర్చడమేనని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

నెహ్రూ నుంచి మొదలు సామాజికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు వ్యతిరేకించారని, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ ను ఓడించిన దౌర్భాగ్య చరిత్ర కాంగ్రెస్ దేనని దుయ్యబట్టారు. రాహుల్‌… తాను ప్రధానమంత్రి కాలేకపోతున్నాననే అక్కసుతో దేశం మీద విషం చిమ్మడం, భారతదేశం పట్ల చులకనగా మాట్లాడటం దుర్మార్గమని, గత ఎన్నికలు సరిగ్గా జరగలేదని, బీజేపీ గెలుపును తప్పుబట్టడం అంటే ప్రజాస్వామ్యంలో ఓటర్లను అవమానపర్చడమేనని దుమ్మెత్తిపోశారు.

గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ మరణంపై భారత్-కెనడా మధ్య దౌత్య పరమైన వివాదం చెలరేగినప్పుడు ఇల్హాన్ ఒమర్‌ కెనిడియన్ దర్యాప్తునకు మద్దతివ్వాలని అమెరికాను కోరారు. ఆర్టికల్ 370 ను వ్యతిరేకించడమే కాకుండా, హిందువులపై ద్వేషాన్ని పెంచడంలో కుట్రదారుతో రాహుల్ సమావేశమయ్యారని విమర్శించారు. భారత్ ను వ్యతిరేకించే వ్యక్తులు, శక్తులతో రాహుల్ గాంధీ సమావేశం కావడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

LEAVE A RESPONSE