– సీఎం రేవంత్ చెప్పు చేతల్లో బీసీ కమిషన్ చైర్మన్
– సెన్సస్ చేసే భాద్యత ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
– ఏదైనా చేయాలంటే చట్టాన్ని సవరించాల్సిందే
– కాస్ట్ సెన్సస్ అని జీవో లో పేర్కొంటూ రేవంత్ ప్రభుత్వం బీసీ ల నోట్లో మట్టి కొట్టబోతోంది
– ఆర్టికల్ 340 ప్రకారం ప్రత్యేక కమిషన్ నియమిస్తేనే ఈ గణన చెల్లుతుంది
– సర్వే ఫారం పై సీఎం ,డిప్యూటీ సీఎం ల ఫోటోలు ఎందుకు ?
– బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: కులగణన లక్ష్యాన్ని దెబ్బతీసి, కోర్టు ద్వారా కులగణన ప్రక్రియను ఆపాలన్నదే సీఎం రేవంత్రెడ్డి అసలు కుట్ర అని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ సర్కారు అవలంబిస్తున్న కులగణన విధానం న్యాయానికి విరుద్ధమని, ఎవరైనా కోర్టుకెళితే దానిని నిలిపివేస్తారని తెలిసే, రేవంత్ ఈ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కులగణన చేస్తే రేవంత్ కొమ్ములు ఊడతాయా అన్న శ్రవణ్ ఇంకా ఏమన్నారంటే… రాష్ట్రం లో 95 శాతం ఉన్న బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీలను సీఎం రేవంత్ మోసం చేస్తున్నారు. కులగణన పై హై కోర్టు ఆదేశాలు అందలేదని బీసీ కమిషన్ చైర్మన్ చెప్పడం దుర్మార్గం. కమిషన్ సీఎం రేవంత్ చెప్పు చేతల్లో పని చేస్తుంది.
సుప్రీం కోర్టు తీర్పు కనుగుణంగా సీఎం రేవంత్ కుల గణన చేస్తే రేవంత్ కొమ్ములు ఊడతాయా ? ఈ నెల ఐదున రాహుల్ గాంధీ కులగణన సందర్భంగా కాంగ్రెస్ పెట్టే సభ కు వస్తున్నారని తెలిసింది. రాహుల్ గాంధీ ఓ చేతిలో రాజ్యాంగం పట్టుకుంటారు. అదే రాజ్యాంగాన్ని రేవంత్ గౌరవించారు.
అసెంబ్లీ తీర్మానం లో బీసీ కుల గణన అని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం రకరకాల సందర్భంలో కులగణన యే అని చెప్పింది. సెన్సస్ చేసే భాద్యత ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి లోనిది. ఏదైనా చేయాలంటే చట్టాన్ని సవరించాల్సిందే.
కాస్ట్ సెన్సస్ అని జీవో ల్లో పేర్కొంటూ రేవంత్ ప్రభుత్వం బీసీ ల నోట్లో మట్టి కొట్టబోతోంది. ప్లానింగ్ డిపార్ట్ మెంటో ,బీసీ కమిషన్ ల వల్లో ఈ గణన చేస్తే న్యాయం దృష్టిలో చెల్లదు. ఆర్టికల్ 340 ప్రకారం ప్రత్యేక కమిషన్ నియమిస్తేనే ఈ గణన చెల్లుతుంది. సుప్రీం కోర్టు కూడా కులగణన మీద డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది.
బీసీ యాక్ట్ లో ఎక్కడా రిజర్వేషన్ల గురించి బీసీ కమిషన్ కుల గణన చేయాలనీ లేదు. బీసీలకు సెన్సస్ పేరుతో మోసం చేయాలని రేవంత్ కుట్ర పన్నారు. బీసీ ల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 199 జీవో పై ఎవరు కోర్టు కు పోయినా కొట్టి వేయబడుతుంది.
రాజ్యాంగం ప్రామాణికత పై కోర్టు తీర్పులపై రేవంత్ ప్రభుత్వానికి గౌరవం లేదు. బీసీ ల కుల గణన కోసం ప్రత్యేక కమిషన్ వేస్తే తప్ప న్యాయం జరుగదు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని గతం లో రామచంద్ర రావు నేతృత్వం లోని హై కోర్టు సింగిల్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చారు.
ఇప్పుడంటే హై కోర్టు కాపీ అందలేదంటున్నారు. గతంలో రామచందర్ రావు ఇచ్చిన తీర్పు కూడా ప్రభుత్వం చదవ లేదా ? సీఎస్ శాంతి కుమారి వివాదాస్పద 199 జీవో ఎందుకిచ్చారో తెలియడం లేదు. మూర్ఖంగా ముందుకుపోతూ, రేవంత్ బీసీ ల నోళ్లు కొట్టాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ ని వాడుకుని రేవంత్ బీసీ ల గొంతు కోయాలని చూస్తున్నారు.
సర్వే ఫారం పై సీఎం ,డిప్యూటీ సీఎం ల ఫోటోలు ఎందుకు ? స్వతంత్రంగా సర్వే చేస్తున్నపుడు ఫొటో లు ఎందుకు? కేవలం తూతూ మంత్రంగా బీసీ కులగణన ను పూర్తి చేయాలనీ రేవంత్ కుట్ర పన్నారు. సర్వేలో ప్రశ్నలు శాస్త్రీయంగా లేవు. ఇపుడున్న పద్దతిలో రేవంత్ బీసీ కులగణన చేస్తే, అది చెత్తబుట్ట కే పరిమితమవుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ లోని బీసీ ఎమ్మెల్యేలు ఆలోచించి ..డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయించాలి.
తమిళ నాడు తరహాలో రిజర్వేషన్లు పెంచాలంటే, సుప్రీం కోర్టు తీర్పు కనుగుణంగా కుల గణన కమిషన్ కు చట్టబద్దత కల్పించాలి. తక్షణమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలి. రాహుల్ గాంధీ ఈ విషయం లో జోక్యం చేసుకుని న్యాయం చేయాలి ..బీసీ ల గొంతు కోయొద్దు. ప్రెస్ మీట్ లో ఆలకుంట హరి ,పుస్తె శ్రీకాంత్ ,ఖలీమ్ పాల్గొన్నారు.