– బీసీ ధర్నాకు ముఖం చాటేసిన రాహుల్, ప్రియాంక, ఖర్గే, వేణుగోపాల్
– రాహుల్ రెండోసారి డుమ్మాతో పలచబడిన రేవంత్ పలుకుబడి
– రాహుల్ డుమ్మాతో కార్యకర్తలకు ఇచ్చిన సంకేతమేమిటి?
– బీసీ రిజర్వేషన్లతో సీఎం సహా మంత్రుల్లో బీసీలకు పెద్దపీట వేయాల్సిందే
– మరి రేవంత్ తన సీటు త్యాగం చేస్తారా?
– రాహుల్ ప్రధాని అయితేనే బీసీ రిజర్వేషన్లంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు బూమెరాంగ్
– అప్పటివరకూ ఇక రిజర్వేషన్లు లేనట్లేనా అంటూ విపక్షాల వ్యంగ్యాస్త్రాలు
– విపక్షాలకు రాహుల్ అస్త్రాలిచ్చారా?
– కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కోమటిరెడ్డి అసంతృప్తి కొలిమి
– విపక్షాల విమర్శలకు కోమటిరెడ్డి కోరస్ పలుకుతున్నారా?
– మీనాక్షి పాదయాత్రతో రేవంత్ ఇమేజీకి డామేజీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు.. మనకు శత్రువులెక్కడో ఉండరు. భార్యాపిల్లలరూపంలోనో, కొడుకుల రూపంలో, అన్నదమ్ముల రూపంలోనో ఉంటారు అంటాడు. కాంగ్రెస్ పార్టీకి ఆ సూత్రం వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి శత్రువులెవరూ అవసరం లేదు. ఆ పార్టీ నాయకులే చాలు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన బీసీ రిజర్వేషన్ల ధర్నా దానికి ఓ తిరుగులేని నిదర్శనం.
పాపం ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డేమో.. అసలు బీసీ రిజర్వేషన్లు అమలయి, దానివల్ల బీసీలంతా రాజకీయ ఫలాలు అనుభవిస్తున్నారన్న రేంజ్లో ధూమ్‌ధామ్ పబ్లిసిటీ ఇస్తున్నారు. అటు మంత్రులు, నాయకులు కూడా అది నభూతోనభవిష్యత్తుగా ప్రచారం చేసి, దావత్‌లు చేసుకుంటున్నారు. పటాకులు పేలుస్తున్నారు. మిఠాయిలు తినిపించుకుంటున్నారు. జిల్లాల్లో విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఈ పబ్లిసిటీ చూసి అటు బీసీలు కూడా.. కొంపదీసి రిజర్వేషన్లు అమలయ్యాయోమోనని, తమ చేతులు తామే గిల్లుకుంటున్న పరిస్థితి. రేవంత్ అండ్ కో పబ్లిసిటీ అంత పీక్కు వెళ్లిపోయింది మరి.
బాగానే ఉంది. బీసీల రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధిని తప్పుపట్టలేం. తన పార్టీ యువరాజు, యువరాణి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని రేవంత్ భయ్యా చాలా కష్టపడి నెరవేర్చారు. దానికంటే ముందు జనగణన కూడా మోగించి.. రాహులబ్బాయి, ప్రియాంకక్కయ్య ఎన్నికల్లో జమిలిగా చేసిన హామీలను నెరవేర్చినందుకు వారిద్దరూ ప్లస్ ఖర్గేసాబ్ మన రేవంత్‌ను ఆకాశానికెత్తాలి. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను వెంటేసుకుని ఢిల్లీ దాకా వచ్చి, జంతర్‌మంతర్‌లో ధర్నా చేసినప్పుడు వారు కూడా వచ్చి గళం కలిపితే కథ వేరేలా ఉండేది, రేవంత్ గౌరవమూ నిలబడేది.
కానీ అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినంత పనిచేసి.. రేవంత్ పలుకుబడి పలచన చేయడంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, చివరాఖరకు కెసి వేణుగోపాల్ కూడా పోటీలు పడి మరీ పరువుతీయడమే విషాదం. ఫలితంగా నలుగురూ కలసి ఎంచక్కా విపక్షాలకు అస్త్రాలిచ్చారు. కట్టుకున్న భార్యను మొగుడు ఏదో అంటే ముష్టికొచ్చినోడు కూడా అదే అన్నట్లుగా తయారయిన రేవంత్ దుస్థితికి జాలిపడితీరాల్సిందే.
అంతకుముందే రేవంత్.. కాంగ్రెస్ మహామహుల సమక్షంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి తన మేధస్సు చాటుకున్నారు. అది చూసిన తర్వాతయినా, కాంగ్రెస్ పెద్దతలలు జంతర్‌మంతర్‌కు వచ్చి ఉంటే, రేవంత్ పలుకుబడి ఆకాశమంత పెరిగేది. కానీ అంతా కూడబలుక్కున్నట్లు, ధర్నాకు ముఖం చాటేయడంతో పాపం రేవంత్ విపక్షాల విమర్శలకు చిక్కుకోవలసి రావడం విషాదం.
చింతచచ్చినా పులుపుచావనట్లు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అధికార వైధవ్యం అనుభవిస్తూ, కేవలం మూడు రాష్ట్రాల్లో ముక్కుతూ మూలుగుతున్న కాంగ్రెస్ నాయకత్వం బాసిజంలో, ఏమాత్రం ఏమాత్రం మార్పు రాలేదని జంతర్‌మంతర్ తేల్చేసింది. నిజానికి జంతర్‌మంతర్‌కు రాహుల్ నివాసం కూతవేటు దూరమే. పేరుకే కాంగ్రెస్ అధ్యక్షుడయిన ఖర్గే, రాష్ట్రాల వ్యవహారాలు చూసే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఇళ్లు అక్కడికి అరగంట ప్రయాణానికి మించి ఉండదు. అయినా వారిలో ఏ ఒక్కరూ రాలేదంటే రేవంత్‌కు ఢిల్లీలో పరపతి లేదని నాయకత్వమే సంకేతం ఇచ్చినట్లయింది.
పోనీ అదేమైనా అప్పటి ప్పుడు పెట్టుకున్న కార్యక్రమం కూడా కాదు. ఎప్పుడో ఖరారయినదే. మరి రాహుల్, ఖర్గే, ప్రియాంక, వేణుగోపాల్ ఎందుకు డుమ్మా కొట్టారన్నది ప్రశ్న. వారికి అంతకుమించిన ముఖ్యమైన రాచకార్యాలు కూడా ఏమీ లేవు. వారంతా మూకుమ్మడిగా ముఖం చాటేయడంతో.. రేవంత్‌కు రాహుల్ దగ్గర అంత సినిమా లేదని, రేవంత్‌ను చూడటం ఇష్టం లేకనే రాహుల్ ధర్నాకు రాలేదని, తెలంగాణ ప్రజలే కాదు.. రాహుల్ కూడా రేవంత్‌ను గుర్తించడం లేదని, కాంగ్రెస్‌కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదనడానికి ఇంతకంటే బలమైన నిదర్శనం ఏం కావాలంటూ.. విపక్షాలు కట్టకట్టుకుని, కాంగ్రెస్‌పై దాడి చేసేందుకు అవకాశం కలిగింది. కాదు.. అవకాశం ల్పించారు. అందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాసుల్కు కృతజ్ఞత చెప్పడం కనీస ధర్మం! లేకపోతే విశ్వాసఘాతకమే!!
ఒక్కోసారి తెలివి ఎక్కువ యినా కష్టమే. రేవంత్ విషయంలో జంతర్‌మంతర్‌లో అదే జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే, వచ్చే నాలుగేళ్ల తర్వాత రాహుల్ ప్రధాని హోదాలో ఇస్తారన్న ప్రకటన బూమెరాంగవుతోంది. అంటే రాహుల్ ప్రధాని అయ్యే వరకూ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పడమే కదా? మరి ఆ విషయం మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదంటూ.. విపక్షాలు చెడుగుడు ఆడుకుంటుంటే, ఎదురుదాడి చేయలేని నిస్సహాయ పరిస్థితి రేవంత్ అండ్ కోది! చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ!!
అసలే రేవంత్‌ను సీఎం అని కూడా చూడకుండా, ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటిపోరుతో సతమతమవుతున్న రేవంత్‌కు రాహుల్ చేసిన అవమానం తోడవడం మరో విషాదం. రేవంత్‌రెడ్డి మాటలు తగ్గించి చేతల్లో చూపించాలని, కమిషన్లు కాకుండా నిందితుల కథ తేల్చాలంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో మళ్లీ పురానా సంస్కృతికి మొగ్గతొడిగిందన్న ప్రమాద ఘంటికలే.
ఇప్పటికే రేవంత్‌ను ఖాతరు చేయకుండా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన అప్రతిష్ఠ చాలదన్నట్లు.. కోమటిరెడ్డి తిరుగుబాటు, మిగిలిన వారికి ఒక తోవ చూపించేదే.
నిజానికి సీఎంపై అలాంటి వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డికి క్రమశిక్షణా కమిటీనో, రాష్ట్ర ఇన్చార్జినో పిలిచి మందలించాలి. ఆ వ్యాఖ్యలపై వివరణ కోరాలి. గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై, సస్పెన్షన్ వేటు వేసిన నాయకత్వం.. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాత్రం, మౌనంగా ఉండటం కులచిచ్చు ర గిలించిందే. ఇదంతా బీసీలకు ఒక న్యాయం. రెడ్లకు మరో న్యాయమా? అని బీసీ నాయకులను పరోక్షంగా రెచ్చగొట్టడమే.
నిజానికి ఈ పంచాయతీలన్నీ రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తేల్చాలి. కానీ మీనాక్షి న టరాజన్ మాత్రం వాటితో పనిలేనట్లు.. సీఎం-పీసీసీ చీఫ్ సహా తెలంగాణ నేతలకు పాదయాత్ర రాదన్నట్లు, పాదయాత్రలో బిజీగా ఉండటమే ఆశ్చర్యం. ముందుగా చెప్పినట్లు.. కాంగ్రెస్‌కు శత్రువులంటూ ఎవరో ఉండరు. అధ్యక్షుడు, ఇన్చార్జిల రూపంలో ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతోందీ అదే.
అసలు దేశంలో ఏ పార్టీ ఇన్చార్జి అయినా పాదయాత్రలు చేయరు. విపక్షంలో ఉంటే అప్పటి ప్రభుత్వ వైఫలాలకు నిరసనగానో, అధికారంలో ఉంటే విజయయాత్రల పేరుతోనే పాదయాత్రలు చేయిస్తుంటారు. అది కూడా సీఎం, పీసీసీ చీఫ్, సీఎల్పీ నేతలే చేస్తారు. గత ఎన్నికల ముందు భట్టి, రేవంత్ కూడా అదే తరహాలో పాద యాత్ర చేసినవారే.
అంతెందుకు? ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌తో కాంగ్రెస్ నాయకత్వం పాదయాత్ర చేయించే తప్ప, నాటి ఇన్చార్జిలు పాదయాత్ర చేయలేదు. ఇన్చార్జిలు పాదయాత్రలో పాల్గొన్నారంతే! కానీ మీనాక్షి మేడమ్ మాత్రం, దానికి భిన్నంగా తానే పాదయాత్రకు గజ్జె కట్టడం తెలంగాణ నాయకుల సత్తాను వె క్కిరించడమే. ఒక్కముక్కలో చెప్పాలంటే.. తెలంగాణలో పాదయాత్ర చేసే మొనగాళ్లు ఎవరూ లేరని మేడమ్ గారు ముఖానే చెప్పినట్లే లెక్క!
ఫలితంగా రేవంత్‌ను.. మేడమ్ మరోసారి విపక్షాల విమర్శల బోనులోకి నెట్టినట్టయింది. రేవంత్‌పై నమ్మకం లేనందువల్లే మేడమ్ మీనాక్షి సొంత యాత్రలు చేస్తున్నారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించినట్లేనని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ జమిలిగా కొండంతరాగం తీసేందుకు కారణమయింది. ఇది ఒకరకంగా రేవంత్ ఇమేజీని డామేజీ చేయడమే! కాంగ్రెస్ రాజకీయాలే అంత మరి!!