– తెలంగాణలో అదానీ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు?
– మణిపూర్ అంశం పై స్పందించే రాహుల్ గాంధీకి…లగచర్ల బాధితుల అంశం కనిపించటం లేదా?
– ఫార్మా విలేజ్ ను ఆపేది లేదని చెప్పేందుకు వాడెవడు?
– మీ అల్లుడి కోసం పెట్టే ఫార్మా కంపెనీ కోసం మా గిరిజనులు భూములు కోల్పోవాలా?
– గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించటం లేదా?
– పోలీసులు రేవంత్ రెడ్డి కి ప్రైవేట్ సైన్యం
– రాహుల్.. గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు?
– రేవంత్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాడని భావిస్తున్నాం. ఉండాలని కోరుకుంటున్నాం
– ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో లగచర్ల బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఢిల్లీ: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలిసేలా చేసేందుకే ఇక్కడికి వచ్చాం. రైతులు, బీసీ, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తారు. ఇవ్వాళ కూడా ఆయన ఇదే అంశంపై మాట్లాడారు. కానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో గిరిజన మహిళలు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారో వాళ్ల మాటల్లోనే విను.
50, 60 ఏళ్లుగా ఇదే భూమిపై ఆధారపడి బతుకున్నాం. మేము ప్రాణం పోయినా భూములు ఇవ్వమని వాళ్లు చెబుతున్నారు. అర్థరాత్రి వచ్చి పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేస్తూ లైంగిక దాడులు, శారీరకంగా ఎలా హింసించారన్నది వాళ్లు వివరంగా చెబుతున్నారు. కొడంగల్ లో ఓటు వేసి నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు, మమ్మల్ని అర్థరాత్రి కరెంట్ తీసేసి అరెస్ట్ చేస్తావా అని ప్రశ్నిస్తున్నారు.
మా ఇంట్లో మగవాళ్లను, పిల్లలను అరెస్ట్ చేశారని బాధపడుతున్నారు. అదే విధంగా కొంతమంది మా పిల్లలు 8 రోజులుగా ఎక్కడున్నారో తెలియటం లేదని చెబుతున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తాగి వచ్చి తమను ఇష్టానుసారంగా తిట్టారని చెబుతున్నారు. 9 నెలల గర్బిణీ అయిన జ్యోతి అనే మహిళ భర్తను దారుణంగా కొట్టి అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అఘాయిత్యాలను మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ ను కలిసి న్యాయం చేయాలని వారంతా విజ్ఞప్తి చేశారు.
భూములు ఇవ్వకుంటే మీరు ఏ విధంగా భూములు ఇవ్వారో చూస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మీ అల్లుడి కోసం పెట్టే ఫార్మా కంపెనీ కోసం మా గిరిజనులు భూములు కోల్పోవాలా అని అమాయక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తాగి వచ్చి ఆడ పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించారు. ఆడపిల్లలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని అడుగుతున్నారు.
రైతులను కొట్టిన, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆవేదనతో కోరుతున్నారు. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం…కానీ భూములు ఇవ్వమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడో కూడా వివరంగా చెబుతున్నారు.
తెలంగాణలో గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించటం లేదా? పేద, గిరిజన రైతుల భూములను రేవంత్ రెడ్డి అక్రమంగా గుంజుకుంటున్నాడు. మణిపూర్ లో హింస, యూపీ హాస్పిటల్ లో చిన్న పిల్లల మృతి, ముంబైలో ధారావి ప్రజల బాధను మీడియా ప్రజలకు చూపిస్తోంది. కానీ తెలంగాణలో గిరిజనులపై అంతకంటే ఏమాత్రం తక్కువ కాకుండా అరాచకాలు జరుగుతున్నాయి.
కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతో పురోగతి సాధించిన తెలంగాణలో ఇవ్వాళ అరాచకం నడుస్తోంది. ముఖ్యమంత్రి సోదరుడు రైతులను బెదిరిస్తూ, చేస్తున్న అరాచకాలపై ఇప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టలేదు. రేవంత్ రెడ్డి సోదరుడు వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి కలెక్టర్ వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతాడు.
పోలీసులు రేవంత్ రెడ్డి కి ప్రైవేట్ సైన్యం గా వ్యవహరిస్తున్నారు. మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ని అడుగుతున్నాం. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు. తెలంగాణలో చిన్న పిల్లలు పిలిచినా వస్తా అని చెప్పిన రాహుల్ గాంధీ కి, ఎందుకు ఇవ్వాళ గిరిజన మహిళ అక్రందనాలు వినిపించటం లేదు?
మీరు బిజీగా ఉంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడి వచ్చి కలుస్తామని బాధితులు చెబుతున్నారు. వారికి సమయం ఇవ్వండి. గిరిజన మహిళలపై పోలీసుల అఘాయిత్యాలు, రైతులపై దమనకాండ, భూముల లాక్కోవడం గురించి మాట్లాడటం రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు? గిరిజనులపై పోలీసుల దమనకాండ సంఘటనపై రాహుల్ గాంధీ, మోడీ ఎందుకు స్పందించటం లేదు?
దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం ఉంది. ఇక్కడ జరిగే ఆకృత్యాలపై స్పందించాలనే విషయాన్ని ప్రధాని మరిచిపోయారా? ఎందుకు ఇప్పటి వరకు స్పందించటం లేదు. అంటే లగచర్ల లో రైతులు చనిపోయే వరకు స్పందించరా? మణిపూర్ లో జరిగిన సంఘటనల కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదు. జాతీయ మీడియా కూడా తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, దమన కాండను చూపించాలి.
రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మాటలు చేపట్టం కాదు.మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపు. రాహుల్ గాంధీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఆయనలో మరొక మనిషి ఉన్నట్టున్నాడు. చెప్పేదొకటి…చేసేదొకటి. రాహుల్ గాంధీ మాటలు చాలా చెబుతాడు. కానీ చేసేదేమీటో మొత్తం దేశం చూస్తోంది. భూమి ఇచ్చే రైతులకు అన్యాయం జరగవద్దని మీరే భూ సేకరణ చట్టం తెచ్చారు. కానీ తెలంగాణలో గిరిజనుల భూముల విలువ రూ. 60 లక్షలు. రూ. 8 లక్షలు కూడా ఇవ్వటం లేదు.
మీరు అదానీ చాలా మాట్లాడతారు. కానీ తెలంగాణలో అదానీ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? మణిపూర్ అంశం పై స్పందించే రాహుల్ గాంధీకి…లగచర్ల బాధితుల అంశం కనిపించటం లేదా? ఈ అంశంపై కచ్చితంగా ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, ఖర్గే కూడా స్పందించాలే. ఈ అంశంపై పార్లమెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడాలి.
రాజ్యసభలో కచ్చితంగా మేము ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. రాహుల్ గాంధీ పేదల తలరాత మారుస్తామంటూ పెద్ద పెద్ద నినాదాలు ఇస్తారు. కానీ అదానీ, రేవంత్ రెడ్డి, మీ పార్టీ తలరాత మార్చుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బీసీలు, గిరిజనులు, దళితులు పోరాటం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇన్నాళ్లు జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉన్నారు అర్థం చేసుకుంటాం. కానీ ఇప్పుడైనా మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపాలని పిలిచి హెచ్చరించండి.
భూములు ఇవ్వమని రైతులు చెబితే ఇంత జులుం చేస్తారా? దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించటం లేదు? తెలంగాణలో బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీ అంటారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? తెలంగాణలో గరీబులు, పేదల పక్షాన బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?
గిరిజనులపై పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? కాంగ్రెస్ ఆకృత్యాల పై ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడాల్సి ఉంది. కానీ బీజేపీ అసలు ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది.
ఫార్మా విలేజ్ కోసం భూములు ఇవ్వాలంటూ రైతులకు గతంలోనే నోటీసులు ఇచ్చారు. రైతులు మాత్రం మేము భూములు ఇవ్వమని చెప్పారు. ఎవరైతే భూములు ఇవ్వమంటారో వారిని అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు పెడతారా? లైంగిక వేధింపులకు పాల్పడుతారా ప్రజాస్వామ్యం లో ఇదే విధంగా వ్యవహరిస్తారా? ఇదేనా రాహుల్ గాంధీ చెప్పే ప్రజాస్వామ్యం? 9 నెలలుగా మేము భూములు ఇవ్వమని రైతులు పోరాటం చేస్తుంటే, ముఖ్యమంత్రి సహా ఎవరూ వారికి సమయం ఇవ్వలేదు.
9 నెలల తర్వాత కలెక్టర్ వస్తే ఆయనకు భూములు ఇవ్వమని నిరసన తెలిపితే వారిని అరెస్ట్ చేశారు. దాదాపు 30 మంది రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. సంగారెడ్డి జైల్లో మేము వెళ్లి వారిని చూశాం. నడవలేకపోతున్నారు. కొట్టామని జడ్జి ముందు చెబితే మళ్లీ కొట్టి కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని వాళ్లను బెదిరించారంట. అందుకే ఈ అఘాయిత్యాలను మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మకముంది. దేశంలోని అతి పెద్ద సంస్థలకు ఫిర్యాదు చేశాం. అఘాయిత్యాలకు పాల్పడిన పోలీసులకు నోటీసులు ఇస్తారని నమ్మకం ఉంది. కేంద్రానికి కూడా మనసుంటే ఈ విషయంలో వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయమని చెబుతారని ఆశిస్తున్నా. చిన్న పిల్లలు పిలిచినా వస్తా అన్నారు రాహుల్ గాంధీ . ఇప్పుడు గిరిజన మహిళలు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరు కొడంగల్ కు రాలేకపోతే…ఢిల్లీలో మీరు సమయం ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం చేస్తున్న భూదందాపై రాహుల్ గాంధీ విచారణ జరిపించండి. రాహుల్ గాంధీ పేదల విషయంలో మీ మాటల్లో నిజాయితీ ఉంటే మీ రేవంత్ రెడ్డిని పిలిచి ప్రశ్నించండి. మణిపూర్, ధారావి, యూపీ లోని ఝాన్సీ ఘటనపై మేము విచారణ వ్యక్తం చేస్తున్నాం. కానీ మా ప్రాంతంలో జరుగుతున్న అట్రాసిటీలను కూడా కూడా అర్థం చేసుకోండి.
తెలంగాణలో ముఖ్యమంత్రి సోదరుడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఫార్మా విలేజ్ ను ఆపేది లేదని చెప్పేందుకు వాడెవడు? తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ చట్టాన్ని గౌరవిస్తూ ప్రశ్నిస్తే ఆయనను అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ పోస్ట్ లు పెడితే భయమెందుకు? మెయిన్ స్ట్రీమ్ మీడియాను మీరు గుప్పిట్లో పెట్టుకున్నారు. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే కూడా అరెస్ట్ లు చేస్తున్నారు.
గిరిజనుల పోరాటం వెనుక ఎవరూ లేరు. వాళ్లే 9 నెలలుగా పోరాటం చేస్తున్నారు. వాళ్లు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరితే మా పార్టీ వాళ్లకు అండగా నిలిచింది.
60, 70 లక్షల రూపాయల భూమికి రూ. 10 లక్షలు ఇస్తామంటే ఎలా? మేము కూడా ఫార్మాసిటీ కోసం దాదాపు 14 వేల ఎకరాల భూమి సేకరించాం. మేము భూసేకరణ చేసినప్పుడు కూడా సమస్యలు వచ్చాయి. కానీ మేము రైతులను ఒప్పించి, మెప్పించి వారికి సరైన పరిహారం ఇచ్చాం.
గతంలో మేము ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే అది విషం అంటూ ఇదే రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మీరు గతంలో చెప్పిన కాలుష్యం గురించే జ్యోతి అనే మహిళ ప్రశ్నిస్తోంది. సమాధానం చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ పేరుతో కాలుష్యాన్ని డీ సెంట్రలైజ్ చేస్తున్నారు. భూములు ఇవ్వమని సంగారెడ్డి లో కూడా రైతులు ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ల ఫ్యామిలీ ప్యాకేజ్ గా మార్చేస్తున్నాడు.
కేసీఆర్ రైట్ అంటే రేవంత్ రెడ్డి లెప్ట్ అనాలనే ఒకే ఒక పాలసీ పెట్టుకున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఫార్మా అంటే విషం అని ప్రజల మనసులో నింపారు. రాష్ట్రంలో దాదాపు 20 చోట్ల ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కానీ ఒక్క ఉచిత బస్సు తప్ప ఒక్క హామీ అమలు చేయలేదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం మహిళలకు రూ. 3000 ఇస్తాం ఏం చేస్తారని మహారాష్ట్రలో వాళ్లను ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క మహిళకు మహాలక్ష్మి అమలు చేయలేదని ప్రశ్నిస్తే ఆయన నుంచి సమాధానం లేదు. కేసీఆర్ మూఢ నమ్మకాలు నమ్ముతారని గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాస్తు పేరుతో సచివాలయం గేట్ మార్చుతున్నాడు.
అధికారంలోకి వచ్చాక ఆయనకు ఏమైందో? తెలంగాణ, కర్ణాటకలో ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. అందుకే జార్ఘండ్, మహారాష్ట్ర ప్రజలను నేను కోరెదొక్కటే. కాంగ్రెస్, బీజేపీ రెండు మోసపూరిత పార్టీలే. ఆ రెండు పార్టీలను ఓడించండి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపర్చాల్సిన అవసరం మాకు లేదు. ఢిల్లీ కావాల్సిన మూటలు అందించగల సత్తా ఉన్నది రాష్ట్రంలో ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే. అందుకే ఆయనే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాడని భావిస్తున్నాం. ఉండాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ తర్వాత బీఆర్ఎస్ 15 ఏళ్లు అధికారంలో ఉంటుంది.