Suryaa.co.in

Telangana

కొడంగల్ ఫార్మాకు నీళ్లు పాలమూరుకు అన్యాయం చేయడమే

-ఇది పాలమూరు రైతుల నోట్లో మట్టికొట్టడమే
-కాళేశ్వరం లేకుంటే రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ , మిడ్ మానేరు, ఎల్ ఎం డీకి నీళ్లు ఎలా వచ్చాయి ?
-తుంగతుర్తి, సూర్యాపేట వరకు నీళ్లు ఎలా ఉన్నాయి?
-కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగా దక్షిణ తెలంగాణకు పెనుముప్పు
-కొడంగల్ ఫార్మాక్లస్టర్ కు భీమా నుండి ఏడు టీఎంసీల నీటిని తరలించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదన, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: కొడంగల్ ఫార్మాకు నీళ్లు పాలమూరు అన్యాయం చేయడమే. సర్కారు నిర్ణయం పాలమూరు రైతులకు గొడ్డలిపెట్టు. కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు చేపట్టకుండా కొడంగల్ లో తలపెట్టిన ఫార్మా క్లస్టర్ కు భీమా నుండి, ప్రభుత్వం ఏడు టీఎంసీల నీటి తరలింపునకు ప్రతిపాదనలు సిద్దం చేయడం ఇది పాలమూరు రైతుల నోట్లో మట్టికొట్టడమే.

దేవరకద్ర, వనపర్తి, మక్తల్ లో కొంతభాగం, కొల్లాపూర్ నియోజకవర్గాలలో భీమా నుండి సాగునీళ్లు అందే రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఇది వరకే గత ప్రభుత్వం ముచ్చర్ల వద్ద ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు 14 వేల ఎకరాలు ఉండగా దానిని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా కొడంగల్ లో పెడతామని హడావిడి చేస్తున్నది.

ప్రజలు, రైతులు వద్దంటున్నా పోలీసులతో బలప్రయోగం చేసి, కేసులు పెట్టి భూములు గుంజుకుని మేము ఇక్కడే పెడతాం అంటూ మొండికేస్తున్నారు. అక్కడ అవసరమైన నీళ్లను గోదావరి నుండి తెచ్చే ప్రతిపాదన చేయకుండా ఉన్న, కొద్దిపాటి క్రిష్ణా నది నుండి ఏడు టీఎంసీ నీళ్లు కొడంగల్ ఫార్మాక్లస్టర్ కు తీసుకువెళ్తామని చెప్పడం మూర్ఖపు చర్య. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్, కొత్తగా నీళ్లిచ్చేది వదిలేసి ఉన్న నీళ్లకు గండి పెట్టి రైతుల నోట్లో మట్టికొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా, ఒక్క టీఎంసీ అదనంగా నీళ్లిచ్చే పనులు చేయలేదు .. పాలమూరు రంగారెడ్డి పనులు చేసి ఉంటే ఈ ఏడాది కనీసం 60 శాతం నీళ్లను దాచుకునే అవకాశం ఉండేది. పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తకుండా కాలయాపన చేశారు. కాళేశ్వరం మీద బురదజల్లుతూ కాలయాపన చేస్తున్నారు.

కాళేశ్వరం లేకుంటే రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ , మిడ్ మానేరు, ఎల్ ఎం డీకి నీళ్లు ఎలా వచ్చాయి ? తుంగతుర్తి, సూర్యాపేట వరకు నీళ్లు ఎలా ఉన్నాయి పంటలు పండిస్తున్న రైతులకు ఈ విషయం తెలియదా ? కేసీఆర్ గా మీద ఉన్న గుడ్డి వ్యతిరేకతతో ముందుకు సాగుతున్నారు. 2014లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులెన్ని ? పంటల సాగు విస్తీర్ణమెంత ? నేడు తెలంగాణ సాగు విస్తీర్ణమెంత ? పంటల ఉత్పత్తి ఎంత ?

తెలంగాణలో ఉత్పత్తులు దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరాయి అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ మీడియా అంకెలతో సహా అనేక మార్లు వెల్లడించాయి. కేసీఆర్ ఒక ప్రణాళికాబద్దంగా గోదావరి, క్రిష్ణా నదుల మీద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులు చేపట్టి, వెయ్యికి పైగా చెక్ డ్యామ్ లను పూర్తి చేయడం మూలంగా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.

తెలంగాణలో భూగర్భ జలాలు పెంచడమే కాకుండా, ఉపరితల జలాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవడం మూలంగా రీఛార్జ్ అయ్యాయి. 1970 దశకంలో తెలంగాణలో మోటబావులు ఉండేవి. ఆ తర్వాత అవి మాయమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ప్రవాహంగా వచ్చే నీటిని కాపాడే ప్రయత్నం చేయలేదు. 1956 నుండి ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం చేయడం మూలంగా చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అయ్యాయి.

దీంతో రైతులు బావులు, బోర్ల మీద ఆధారపడ్డారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా 1990 దశకం వచ్చే సరికి బోర్లు కూడా అడుగంటాయి .. దీంతో వందలు, వేల మంది రైతులు పంటలు పండక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు.

కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల నిర్వాకం మూలంగా నీటిపారుదల వ్యవస్థను పట్టించుకోని కారణంగానే, ప్రాజెక్టులు కట్టి నీళ్లు నింపని కారణంగా, చెరువులు, కుంటల నిర్వహణను పట్టించుకోని కారణంగా, వాగులు, వంకలలో నీరు పారేలా చేయని కారణంగానే తెలంగాణలో బోరుబావుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ఎంతో ఆలోచించి మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలను పటిష్టం చేసి నీటితో నింపడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, వెయ్యికిపైగా చెక్ డ్యాంలతో వాగులు, వంకలు పారించడం మూలంగా గత పదేళ్లలో భూగర్భజలాలు పెరిగాయి.

అతి తక్కువ కాలంలో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేశాం. నీటి నిల్వ మూలంగా చేపల పెంపకంతో పాటు పశుపక్షాదులకు తాగు నీరు అందుబాటులో ఉంది. దేశంలో అత్యధిక పంటలు పండుతున్నాయి అని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముందుచూపు మూలంగానే ఇది సాధ్యం అయింది.

అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క పనిని ముందుకు తీసుకుపోలేదు. ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలేదు. కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగా దక్షిణ తెలంగాణకు పెనుముప్పు. వరంగల్ లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదు. రూ.36 వేల కోట్లకు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిన విషయం ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

కాళోజీ పేరెత్తే అర్హత కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు … జీవితకాలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ దాష్టీకాలకు వ్యతిరేకంగా కాళోజీ కలం, గళం ఎత్తారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది. అబద్దాలు చెబుతూ కాంగ్రెస్ కాలం వెల్లదీస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం మీది తిరుగుబాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుంది.

LEAVE A RESPONSE