Suryaa.co.in

Editorial

రాహుల్ ముందస్తు ‘మైండ్’ గేమ్

– ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్న వ్యూహం
– కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పకనే చెబుతున్న రాహుల్
– ప్రమాణస్వీకారోత్సవ తేదీ కూడా ప్రకటించిన రేవంత్‌రెడ్డి
– ప్రగతి భవన్‌ను ప్రజాపాలనాభవన్‌గా మారుస్తామని రాహుల్ వెల్లడి
– ప్రజాపాలనాభవన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని హామీ
– సీఎం, మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం
– సీఎం సహా మంత్రులంతా ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రకటన
– సీఎం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పనిలేదన్న కేటీఆర్
– సీఎం కలిస్తే పాలన వైఫల్యమయినట్లేనని కేటీఆర్ స్పష్టీకరణ
– ఇప్పటికే సీఎం ఎవరినీ కలవరన్న విస్తృత భావన
– ప్రజలను కలవని సీఎంపై జనంలో ఇప్పటికే అసంతృప్తి
– దానిని గురిచూసి కొట్టిన రాహుల్‌గాంధీ
– అందుకే తమ సీఎం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న హామీ
– గతంలో ప్రజాదర్బార్ నిర్వహించిన వైఎస్
– మళ్లీ దానిని గుర్తు చేసిన రాహుల్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇంకా ఎన్నికలే కాలేదు. అప్పుడే తెలంగాణ కాంగ్రెస్ దళపతి రేవంత్‌రెడ్డి తాను ఎప్పుడు, ఎక్కడ ప్రమాణస్వీకారం చేస్తానో చెప్పేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా డిసెంబర్ 9న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముందస్తు ప్రకటన చేశారు. ఇటు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మరో అడుగుముందుకేసి.. తమ సీఎం ప్రజలకు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. సీఎం, మంత్రులు ప్రజాదర్బార్లు నిర్వహిస్తారని చెప్పారు. ప్రగతిభవన్‌ను ప్రజాపాలనాభవన్‌గా మార్చేసి, 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటుందని ముందస్తు ముచ్చట్లు చేశారు.

ఇదంతా ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. సుపరిపాలనపై మేం దృష్టి సారిస్తున్నామని సంకేతాలివ్వడమే. రాహుల్-రేవంత్ జమిలిగా ఆడుతున్న ముందస్తు మైండ్ గేమ్ అని మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. సూటిగా చెప్పాలంటే.. ప్రజలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు మళ్లించే ముందస్తు మానసిక భావన వ్యూహమన్నమాట.

యుద్ధానికి వెళ్లే వారికి ముందు తమపై తమకు ధీమా-భరోసా ఉండాలి. అది సైనికుల్లో నమ్మకం కలిగిస్తుంది. వారి వీరోచిత పోరాటం-ఆత్మస్థైర్యం చూసి ప్రజలు కూడా వారినే ప్రేమిస్తారు. అభిమానిస్తారు. అంతకుమించి.. పూర్తిగా నమ్ముతారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమరంలో, కాంగ్రెస్ అచ్చంగా చేస్తున్నది అదే. రాహుల్-రేవంత్ ఆత్మవిశ్వాసంతో చేస్తున్న ప్రకటనలు అవే చెబుతున్నాయి.

తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు వచ్చేసినట్లే భావన, బలంగా క్షేత్రస్థాయికి తీసుకువెళుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుంది కాబట్టి.. ‘ఇక ఇతర పార్టీలకు ఓటు వేయడం వృధా’ అన్న సంకేతాలు, తమ మాటల ద్వారా జనక్షేత్రంలోకి పంపిస్తున్నారు. అత్యంత ఆత్మవిశ్వాసంతో రాహుల్-రేవంత్ చేస్తున్న గంభీర ప్రకటనలు సైతం ప్రజల్లో ఆసక్తి పెంచుతున్నాయి.

ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఎలా వినియోగిస్తాం? దాని పేరు మార్చి ఆ స్థానంలో ఏ పేరు పెడతాం? ముఖ్యమంత్రి-మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉన్నారనే ఫలితాల తర్వాత చెప్పే ముచ్చట్లు కూడా.. ఇప్పుడే చెప్పేస్తున్నారు. అంటే అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనన్న విస్పష్ట సంకేతాలిస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో స్పష్టత తీసుకువచ్చే ప్రయత్నాలే.

నిజానికి కొద్దినెలల క్రితం వరకూ కాంగ్రెస్ పరిస్థితి అయోమయం-గందరగోళం. బండిసంజయ్ ఒంటికాలిపై లేచి.. కేసీఆర్ సర్కారును దునుమాడుతున్న కాలంలో, కాంగ్రెస్ పరిస్థితి దయనీయం. కేసీఆర్-సంజయ్ యుద్ధంలో కాంగ్రెస్‌ది మూడవ స్థానం. దానికితోడు కుమ్ములాటలు-అంతర్గత కలహాలు. ఫలితంగా ఇక ఇది పరిగెత్తే గుర్రం కాదన్న భావన.

కుంటి గుర్రంతో పార్టీ ఎంతదూరం పరిగెడుతుందన్న అనుమానాలు. అలాంటి విషాద పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ కాపాడింది.బండి సంజయ్‌ను తొలగించి కిషన్‌రెడ్డిని సారథిగా నియమించింది. ఆవిధంగా కాంగ్రెస్‌ను ఐసియు నుంచి జనరల్ వార్డుకు, అటుంచి అటే డిశ్చార్జి చేసి నేరుగా జనక్షేత్రంలోకి పంపింది.

అప్పుడు మొదలయింది కాంగ్రెస్ అనుకూల వాతావ‘రణం’. వయసు చిన్నదయినా, వ్యవహారంలో మహా ముదురైన కాంగ్రెస్ దళపతి రేవంత్, ఆ వాతావరణాన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా మలచడంలో విజయం సాధించారు. అధిష్ఠానాన్ని ఒప్పించి-మెప్పించి, దాదాపు తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చే పరిస్థితి సృష్టించుకున్నారు. తగ్గాల్సిన చోట తగ్గి, నెగ్గాల్సిన చోట నెగ్గారు. ఈ విషయంలో ఆయన కొంచెం అటు ఇటుగా వైఎస్ బాటలో నడిచినట్లే కనిపించింది.

అరాచకానికి-అడ్డగోలుతనానికి కేరాఫ్ అడ్రస్సయిన కాంగ్రెస్‌ను క్రమశిక్షణలో పెట్టారు. ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అని తరచూ వేదికలు, మీడియా పేరంటాల్లో గొప్పగా చెప్పుకుని గుండెలుబాదుకునే వృద్ధసింహాలకు, దాదాపు విశ్రాంతినిచ్చారు. వీహెచ్ నుంచి చిన్నారెడ్డి వరకూ అందరినీ ‘గౌరవప్రదంగా తప్పించటం’ రేవంతుకే చెల్లింది. ఇది ఒకరకంగా కాంగ్రెస్ కొత్త తరానికి బోలెడు ఊరట. వృద్ధసింహాలను పక్కనపెట్టే ధైర్యం వైఎస్ సహా, ఇప్పటివరకూ ఎవరూ చేయలేరు. అది రేవంత్‌కు సాధ్యమవడమే ఆశ్చర్యం.

ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడకుండా, నిఖార్సైన ఫుట్‌బాల్ గేమ్ ఆడటంతో, దాదాపు 30 మంది కొత్త ముఖాలు తెరపైకి రాగలిగారు. కుటుంబానికి ఇన్నే ఇవ్వాలన్న పాతచింతకాయ లెక్కలు పక్కనపెట్టి.. గెలుపు గుర్రాలైతే చాలన్న పాలిసీకి తెరలేపారు. మైనంపల్లి హన్మంతరావు అండ్ సన్ ఆ కోవకు చెందినవారే. అయితే వారికి సీనియర్లు ఎంతవరకూ సహకరిస్తారన్నది ప్రశ్న. అది వేరే ముచ్చట.

నామినేషన్లకు పదిరోజుల క్రితమే అసలు కథ మొదలయింది. బీజేపీలోని వివేకులూ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల నుంచి నేటి విజయశాంతి-మందా జగన్నాధం వరకూ కాంగ్రెస్‌లోకి బిలబిలా వెల్లువలా రావడం, కిందిస్థాయి సర్పంచుల నుంచి కార్పొరేటర్ల వరకూ కదిలించింది. మధ్యలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ, చివరాఖరకు బీఆర్‌ఎస్ సిట్టింగు ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలు కూడా కట్టకట్టుకుని కాంగ్రెస్ వైపు తోసుకురావడం, ప్రజాభిప్రాయం మార్చేందుకు కారణమయింది.

మళ్లీ అధికారం రాదన్న అనుమానం, ఆమేరకు స్థానిక సంకేతాలు ఉంటే తప్ప… సహజంగా అధికారంలో ఉన్న పార్టీని, విడిచి వచ్చేందుకు ఎవరూ సిద్ధపడరు. పైగా కేంద్రం-రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల నుంచి అసలు బయటకు రారు. అలా వచ్చారంటే దానర్ధం తాము ఉన్న పార్టీలకు భవిష్యత్తు లేదని గ్రహించడమే. బహుశా అలాంటి అభిప్రాయం విస్తృతమయి.. క్షేత్రస్థాయికి చేరి, అది కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న భావన స్థిరపడేందుకు కారణమయి ఉండవచ్చు.

ఈ క్రమంలో వెలువడిన అనేక సర్వేల్లో.. ఒకటి-రెండు మినహా, మిగిలిన అన్ని సర్వేలూ కాంగ్రెస్‌నే గెలుపుగుర్రంగా ప్రకటించాయి. తాజాగా వెలువడిన లోక్‌పోల్ కూడా 74 స్థానాలతో, కాంగ్రెస్ పంచకల్యాణి గుర్రంలా దూసుకుపోతోందని సర్వే ఫలితం వెల్లడించడటం ప్రస్తావనార్హం.

వీటితోపాటు.. దేశంలో మోదీ వ్యతిరేక కోణంలో ముస్లింలు-చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టారన్న ఆగ్రహంతో ఆంధ్రానుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు కూడా, కొత్తగా కాంగ్రెస్ ఖాతాలో కలుస్తుండటం కాంగ్రెస్ కదనోత్సాహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నామినేషన్ల ముందు వరకూ కాంగ్రెస్‌కు అభ్యర్ధులే లేరని బీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌కు ఓటేసేవారే లేరని బీజేపీ జమిలిగా విరుచుపడ్డాయి.

నామినేషన్ల తర్వాత ఆ పార్టీలే.. మళ్లీ జమిలిగా కాంగ్రెస్‌పై కత్తులు దూయటం చూస్తే.. బలమైన పార్టీ కాబట్టే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నాయన్న భావన, మెడపై తల ఉన్న ఎవరికైనా వస్తుంది. బలహీనంగా ఉంటే కాంగ్రెస్‌ను పట్టించుకోవడం ఎందుకు? అభ్యర్ధులే లేని పార్టీపై విమర్శలు చేయడం ఎందుకు? బలహీనమైన కాంగ్రెస్ అభ్యర్ధుల ఇళ్ళపై అర్ధరాత్రి పోలీసుల దాడి ఎందుకు? కేవలం కాంగ్రెస్ నేతలనే లక్ష్యం చేసుకుని ఐటి దాడులు చేయడం ఎందుకు? అన్న ప్రశ్నలు ఎవరికయినా తలెత్తడం సహజం.

అంటే కాంగ్రెస్ సింహభాగంలో ఉన్నందుకే, బీజేపీ-బీఆర్‌ఎస్ జమిలి జంగ్ చేస్తున్నాయని ఎవరికయినా అర్ధమవుతుంది. బహుశా ఈ ధీమానే రాహుల్-రేవంత్ ద్వయంలో ముందస్తు ధీమా పుట్టించి, భవిష్య వాణి పలికిస్తుందేమో?!

1 COMMENTS

LEAVE A RESPONSE