ప్రతిష్టాత్మక ఐ.ఆర్.ఐ.ఎస్.ఈ.టి కేంద్రంలో ” కవచ్” వ్యవస్థ పనితీరును సమీక్షించిన రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్
ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ( ఐ ఆర్ ఐ ఎస్ ఈ టి ) ప్రతిష్టాత్మక కేంద్రాన్ని రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ 04 ఫిబ్రవరి 2024 తేదీన సందర్శించారు . ఈ సందర్బంగా ” కవచ్” స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పనితీరును మంత్రి సమీక్షించారు.
సాంకేతికతను వేగంగా విస్తరించేందుకు దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వ్యూహాలను రూపొందించాలని సంబంధిత కార్యనిర్వాహకులను ఆయన ఆదేశించారు. ఇనిస్టిట్యూట్ లో ” కవచ్” పరికరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రయోగశాలను కూడా సందర్శించారు. రైల్వే స్టేషన్లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లతో ” కవచ్” అనుసంధానం వంటి అంశాలపై ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు .
ఈ కేంద్రంలో వివిధ విభాగాల్లో శిక్షణ పొందుతున్న 170 మందికి పైగా ఇంజనీర్లతో మంత్రి సంభాషించారు. రైలు సర్వీసుల ఉత్పాదకతలో అభివృద్ధి మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం వినూత్న రీతిలో ఆలోచిస్తూ భవిష్యత్తులో పురోగమించాలని రైల్వే మంత్రి ఉద్బోధించారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా పరిష్కారాలను కనుగొనడానికి ప్రపంచ స్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు. బహుళ సాంకేతికతలు మరియు మౌలిక సదుపాయాల కల్పన సవాళ్లపై శిక్షణార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ ( ఐ ఆర్ ఐ సి ఈ ఎన్) పూణేలో ఏర్పాటు చేసిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో కుడా మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దేశించిన ఉన్నత స్థాయి లక్ష్యాలను సాధించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు రావాలని జోనల్ రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ , ఇరిసెట్ డైరెక్టర్ జనరల్ సుధీర్ కుమార్ కుడా ఉన్నారు.