-అన్నదాతలకు అండగా నిలబడేందుకు టీడీపీ ఆధ్వర్యంలో “రైతు కోసం తెలుగుదేశం”
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు “రైతు కోసం తెలుగుదేశం” పేరుతో కమిటీ ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిటీ అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది.
జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఓ వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుండగా.. మరోవైపు వరుస ప్రకృతి విపత్తులతో అన్నదాతలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రోజూ ఇద్దరు, ముగ్గరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం నిలవడం వ్యవసాయరంగం పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో విపత్తుల్లో నష్టపోయిన రైతులకు అండగా నిలబడేందుకు, వారికి పరిహారం అందేలా పోరాడేందుకు టీడీపీ ఆధ్వర్యంలో “రైతు కోసం తెలుగుదేశం” పేరుతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని సభ్యులుగా నియమించడం జరిగింది.