Suryaa.co.in

Editorial

రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు?

– బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, సాన సతీష్ పేర్లు ఖరారు?
– బీజేపీతో ఒప్పందం మేరకు కృష్ణయ్య పేరు ఫైనల్
– మోపిదేవితో ముందస్తు ఒప్పందం ప్రకారం సాన సతీష్‌కు?
– బీదకు మళ్లీ సీటు ఇస్తానన్న టీడీపీ నాయకత్వం హమీ
– సాన అభ్యర్ధిత్వంపై టీడీపీలో అసంతృప్తి
– సాన పేరుపై సీనియర్ల అలక
– ఎమ్మెల్సీల రాజీనామాలూ ‘ముందస్తు ఒప్పందాలే’నట
– జయమంగళ వెంకటరమణ సీటు బాలినేనికి?
– పోతుల సునీత సీటు బీటెక్ రవికి?
– రాజకీయాల్లో కొత్త తరహా ముందస్తు ఒప్పందాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ నుంచి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికలకు అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. తెలుగుదేశం నుంచి బీద మస్తాన్‌రావు, సాన సతీష్ బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య పేర్లు ఖరారయినట్లు తెలుస్తోంది. కాగా సాన సతీష్, ఆర్.కృష్ణయ్య అభ్యర్ధిత్వాలపై తెర వెనుక ఆసక్తికరమైన కథ నడిచినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఎంపీలయిన బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ .కృష్ణయ్యలు తమ పదవులకు , పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. వీరి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. అయితే తాను రాజీనామా చేస్తే తిరిగి తనకు సీటు ఇవ్వాలని.. బీజేపీకి విధించిన షరతును ఆమోదించిన తర్వాతనే, ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అంటే ఈసారి ఆర్.కృష్ణయ్య బీజేపీ ఎంపీగా అవతరించనున్నారన్నమాట.

మరో ఎంపీ బీద మస్తాన్‌రావు కూడా.. తాను రాజీనామా చేసిన తర్వాత, తిరిగి తన సీటు తనకే ఇవ్వాలన్న ఒప్పందం మేరకే తన పదవికి రాజీనామా చేశారంటున్నారు. ఆ మేరకు తిరిగి ఆయన ఎంపీ సీటు ఆయనకే దక్కనుంది.

ఇక మోపిదేవి వెంకట రమణతో ఎంపీ పదవికి రాజీనామా చేయించడం వెనుక, కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త సాన సతీష్ కృషి ఉందంటున్నారు. ఆయనతో ‘అన్నీ మాట్లాడుకున్న’ తర్వాత .. మోపిదేవి రాజీనామా చేసిన సీటును, తనకు ఇవ్వాలన్న ఒప్పందంతో సాన సతీష్ తెరవెనుక కథ నడిపారంటున్నారు.

అంటే మోపిదేవి ‘మంచిచెడ్డలన్నీ’ సాన సతీష్ చూసుకునేలా, ఒప్పందం జరిగిందన్నమాట. ఇక మోపిదేవి తనకు నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా, రేపల్లె స్థానం ఇవ్వాలన్న అభ్యర్ధనను టీడీపీ నాయకత్వం అంగీకరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక ఎమ్మెల్సీ రాజీనామాల వ్యవహారంలో కూడా ముందస్తు ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన జయమంగళ వెంకట రమణ సీటును.. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు గుడివాడ షాడో ఎమ్మెల్యే ఒకరు మధ్యవర్తిత్వం చేశారంటున్నారు. ఎమ్మెల్సీ తర్వాత బాలినేనికి మంత్రి పదవి ఇస్తానని, జనసేనాధిపతి పవన్ హామీ ఇచ్చారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీతతో, కడప నేత బీటెక్ రవి మాట్లాడుకున్న త ర్వాతనే ఆమెతో రాజీనామా చేయించారంటున్నారు. అంటే ఆమె రాజీనామాతో ఖాళీ అయిన సీటును, బీటె క్ రవితో భర్తీ చేస్తారన్నమాట.

ఈవిధంగా ఎవరికి వారు వైసీపీ ఎంపీ-ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించుకుని, వారి స్థానాల్లో తాము పోటీ చేసే సరికొత్త రాజకీయ సంస్కృతికి ఏపీ వేదికగా మారింది. గతంలో ఈ బాధ్యత పార్టీలే తీసుకునేవి. ఇప్పుడు వ్యక్తులే ఈ బాధ్యతలు తలెత్తుకుని, పార్టీలకు రిస్క్ లేకుండా చూస్తుండటమే విశేషం.

సాన సతీష్ అభ్యర్ధిత్వంపై వ్యతిరేకత
కాగా సాన సతీష్‌కు రాజ్యసభ దక్కుతుందన్న ప్రచారంపై టీడీపీ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ కోసం తొలినుంచీ పనిచేసిన వారిని కాదని, అసలు పార్టీలో ప్రత్యక్షంగా పనిచేయని వ్యాపారి, పొలిటికల్ లాబీయిస్ట్‌గా పేరున్న సానా సతీష్ కు రాజ్యసభ ఇస్తే, ఎలాంటి సంకేతాలు వెళతాయని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. దానికితోడు తనకు రాజ్యసభ వస్తుందని సతీష్, గత కొంతకాలం నుంచి తన సన్నిహితుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పైగా ఆయనకు పార్టీలో కీలక వ్యక్తుల దన్ను ఉందన్న ప్రచారం చాలాకాలం నుంచీ జరుగుతోంది. వైసీపీ ఎంపీగా పనిచేసిన మోపిదేవిని ‘సంతృప్తి పరిచి’, ఆ మేరకు అయ్యే వనరులను తానే భరించినప్పటికీ.. ఆ అవకాశం పార్టీకి తొలి నుంచీ పనిచేసిన వారికి ఇవ్వాలన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

‘అసలు సానా సతీష్ ఎవరు? ఆయన పార్టీలో ఎప్పుడు పనిచేశారు? అంతకుముందు ఆయన ఎవరితో ఉన్నారు? ఆయన చేసే వ్యాపారాలేమిటి? ఆయనపై ఉన్న ఫిర్యాదులు, కేసుల సంగతేమిటి? గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో తెరవెనక పనిచేసినంత మాత్రాన ఎంపి ఇస్తారా? పార్టీకి వ్యాపారులే తప్ప పనిచేసిన వారు అవసరం లేదా? దానివల్ల వెళ్లే సంకేతాలు పరిగణనలోకి తీసుకోరా?’ అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా.. సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, చంద్రబాబునాయుడు రాజకీయ కార్యదర్శి, పార్టీ ఆఫీసు సమన్వయకర్త టీడీ జనార్దన్, గత ఎన్నికల్లో అవకాశం దక్కని దేవినేని ఉమా వంటి నేతలలో ఒకరికి, రాజ్యసభ అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు భావించాయి. వీరిలో యనమలకు రాజ్యసభకు వెళ్లాలన్న కోరిక కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నదే. అయితే ఆయనకు, ఆయన కుటుంబానికి ప్రతిసారీ అవకాశాలు ఇస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా లేకపోలేదు. అది వేరే విషయం.

ఇక అశోక్‌గజపతి రాజుకు అవకాశం ఇస్తే, పార్టీ స్థాయి పెరుగుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవలి నామినేటెడ్ పదవుల పంపిణీలో, దేవినేని ఉమాకు అవకాశం వస్తుందని చాలామంది ఆశించారు. కానీ అది కూడా నిరాశ అయింది. ఆయన పట్ల పార్టీ వర్గాల్లో సానుభూతి లేకపోలేదు.

పార్టీలో సుదీర్ఘకాలం నుంచీ పనిచేస్తూ, పార్టీ ఆఫీసు ఇన్చార్జి, చంద్రబాబు రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్న పార్టీ ఆఫీసు సమన్వయకర్త టిడి జనార్దన్‌కు రాజ్యసభ సీటు ఇస్తే.. పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు వివిధ కులాలు, మతాలు, వర్గాల నాయకులతో చర్చలు జరిపి.. వారిని బుజ్జగించి చంద్రబాబుతో భేటీలు వేయించి, తగిన హామీలు ఇప్పించడం ద్వారా వారిని పార్టీకి పనిచేయటంలో టీడీది కీలకపాత్ర.

మైనారిటీ నేత షుబ్లీని టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయించడం వెనుక టీడీనే ప్రముఖ పాత్ర పోషించారు. చంద్రబాబు అరెస్టయిన సమయంలో, హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులను కూడగట్టి.. వారితో భారీ సభ నిర్వహించడం ద్వారా, వారి మద్దతు కూడగట్టిన వ్యవహారంలో టీడీ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

అదీగాక.. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఆఫీసు ఇన్చార్జిగా పనిచేసిన సోలిపేట రామచంద్రారెడ్డి ఒక్కరికే రాజ్యసభ అవకాశం దక్కింది. ఆ తర్వాత ఇప్పటివరకూ ఎవరికీ ఆ అవకాశం దక్కలేదు. సుదీర్ఘకాలం పార్టీ ఆఫీసు ఇన్చార్జి-సమన్వయకర్తగా పనిచేస్తున్న టీడీ జనార్దన్‌కు ఎంపి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కార్తకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ శ్రేణులు-బాబుకు అనుసంధాన కర్తగా పనిచేస్తున్న టీడీకి, రాజ్యసభకు అవకాశం ఇస్తే.. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారన్న సంకేతాలు వెళతాయంటున్నారు.

వైసీపీకి అనుబంధంగా ఉండే ఒక ప్రముఖ పత్రికలో.. ‘జగన్‌కు ఒక జనార్దన్ కావాలి’ అంటూ ఒక వార్తా కథనం రాశారంటే, ఆయన పనితీరు ఎలాంటిదో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE