– విశాఖలో ఓ వైసీపీ ఎంపి కంపెనీ అడ్డగోలు చర్యలు
– ఏ ప్రభుత్వం ఉన్నా వారిదే పెత్తనం
– వైసీపీ హయాంలో ఆ ఎంపీ కంపెనీ చెప్పిందే శాసనం
– ఆ ఐదేళ్లూ ఆ కంపెనీకి ‘రెడ్డి’కార్పెట్
– తనిఖీలకు వెళ్లాలంటే వణికిపోయిన పీసీబీ
– ఇప్పటిదాకా కొరడా ఝళిపించని పీసీబీ అధికారులు
– పై స్ధాయిలో మంతనాలు, రాయబేరాలు
– కారణం ‘మూమూలే’నట
– కంపెనీకి కేటాయించిన భూమిలో ఎన్ని టన్నుల వినియోగం అవుతుందన్నదానిపై పీసీబీ నిఘా ఏదీ?
– ఎన్ని టన్నుల కెపాసిటీ, వినియోగం లెక్కలున్నాయా?
– తాజాగా కెమికల్ వేస్ట్‌ను భూమిలో పాతిపెడుతున్న ధిక్కారం
– ఇన్సెనరేషన్పద్ధతిలో తగలబెట్టాల్సి ఉన్నా నిబంధనలు ‘పాతి’పెడుతున్న వైనం
– పీసీపీ ఉన్నతాధికారి వస్తున్నారని హడావిడిగా నిబంధనలకు ‘పాతర’
– పదిరోజుల నుంచి నిరంతర పూడ్చి‘వెతలు’
– తగలబెట్టకుండా భూమిలో పాతేస్తున్న ఘరానా కంపెనీ
– దానితో వర్షం వస్తే నీరు కలుషితమయ్యే ప్రమాదం
-కంపెనీ పక్కనే పచ్చటి పొంటపొలాలు
– ఫార్మా ‘పొల్యూషన్’ నిబంధనలకు రెడ్డిగారి కంపెనీ రామ్ ‘రామ్’
– పవన్ కల్యాణ్ ఉన్నా పట్టించుకోని వైసీపీ ఎంపీ కంపెనీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది వైసీపీకి చెందిన ఓ ఎంపీగారి కంపెనీ. అక్కడ ఏ కంపెనీ తమ వ్యర్థాలను పారబోయాలన్నా దానిని సారు కంపెనీకి ఇవ్వాల్సిందే. మామూలుగా అయితే, వాటిని సారు కంపెనీ శాస్త్రీయ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయాలి. అందుకు ఉన్న ల్యాండ్ ఫిల్లింగ్, ఇన్సెనరేషన్ పద్దతులు పాటి ంచాలి. కానీ అందుకు భిన్నంగా భూమిలో పాతిపెడుతున్న ధిక్కారం విమర్శలకు గురవుతోంది.
ఫలితంగా సదరు సారు కంపెనీ పక్కనే ఆనుకుని ఉన్న వందలాది ఎకరాల పచ్చటి భూములను, అది ప్రమాదంలో పడేస్తోంది. అయినా వాటిని స్వయంగా పర్యవేక్షించాల్సిన పీసీబీ అధికారులకు ఇవి నిపించవు. ఫిర్యాదులు వినిపించవు. కారణం ‘మామూలే’! ఎందుకంటే సదరు సారు కంపెనీ అంటే ఏ పాలకులకయినా హడల్.
చివరకు ఆ శాఖకు ఎవరికీ భయపడరు.. తలవంచరన్న పేరున్న పవన్ కల్యాణ్ మంత్రి అయినా, విశాఖ విషాదంలో మౌనరాగం ఆలపించాల్సిందే. మరి సారుకు ఉన్న పలుకుబడి అటువంటిది! కాబట్టి ఈ కంపెనీ విషయంలో, పవన్ అయినా చేయగలిగిందేమీ లేదన్నది కార్మిక సంఘాల ఉవాచ.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆ పార్టీకి చెందిన ఓ ఎంపిగారి ఫార్మాకంపెనీకి విశాఖలో ఎదురులేదు. టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వైసీపీ ఉన్నా పరవాడలో పరులకు ప్రవేశం లేదు. ఆయన కంపెనీదే పెత్తనం. ఆయా కంపెనీల వ్యర్ధాలన్నీ ఎంపి గారి కంపెనీకి మాత్రమే ఇవ్వాలి. అందుకు కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక శాఖ అధికారులు కూడా యధాశక్తిన శ్రమదానం చేస్తుంటారు.
ఇక జగన్ సీఎంగా ఉన్న ఆ ఐదేళ్లలో అటు వైపు కన్నేసేందుకు అధికారులు వణికిపోయిన పరిస్థితి. మరిప్పుడు రాష్ర్టంలో అధికారం మారింది కాబట్టి.. వైసీపీ ఎంపీ గారి కంపెనీకి ఏమైనా కష్టాలొచ్చాయనుకుంటే, కచ్చితంగా ‘కెమికల్లో కాలేసినట్లే’! ఇంకా రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉందన్నంత బేఫర్వాగా పనులు సాగిపోతుండమే వింత. మరి పీసీబీ సార్లు ఏం చేస్తున్నారంటే… చూస్తున్నారు. పరిశీలిస్తున్నారు. లేఖలు రాస్తున్నారు. తనిఖీలు చేస్తున్నారు.. చేస్తూనే ఉంటారు. అదొక నిరంతర తంతు అన్నది స్థానికుల ఉవాచ.
ఆ కంపెనీ మీద ఇటీవల మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో, దానిని పరిశీలించేందుకు పీసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి తనిఖీలకు వెళుతున్న విషయం కంపెనీ యాజమాన్యానికి తెలిసిందట. దానితో ఫార్మా, నాన్ ఫార్మా హజార్డస్ వేస్టును కంపెనీ పరిసర ప్రాంతాలలో, పీసీబీ నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా, కొద్దిరోజుల నుంచి అన్లోడ్-ప్రాసెస్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా పరవాడలో కొన్ని కంపెనీల ఉల్లంఘనలపై ‘సూర్య ’లో వరస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
ఈ అంశంలో సదరు కంపెనీ.. ల్యాండ్‌ఫిల్‌లో పీసీబీ నిబంధనలు పాటించడం లేదని, ఇన్సెనరేషన్ పేరుమీద తీసుకున్న వేస్టును ఇన్సెనరేషన్ చేయకుండా.. భూమిలో పాతిపెడుతున్న వైనంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అంటే తగులబెట్టకుండా, భూమిలో పాతిపెట్టడం వల్ల.. వర్షం వచ్చినప్పుడు ఆ నీరు భూమిలో ఇంకి, అది పరిసర ప్రాంతాల్లోని నీటిని కలుషితం చేస్తుందని స్థానిక ప్రజలు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నిజానికి హజార్డస్ వేస్టును ల్యాండ్ ఫిల్లింగ్, ఇన్సెనరేషన్ పద్ధతిలో శుద్ధి చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ ఫిల్లింగ్‌కు సర్కారు పరవాడలో భూమి కేటాయించింది. ఇప్పుడది పెద్ద కొండలా పేరుకుపోయిందని కార్మిక సంఘాలు, స్థానికులు చెబుతున్నారు. ఆ వేస్టును న్యూట్రల్‌గా మార్చి, దానిపై లేయర్లు వేసి ల్యాండ్‌ఫిల్లింగ్ చేస్తారు.ఇది పూర్తిగా టి.ఎస్.డి.ఎఫ్. విధానంలో చేస్తారని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇన్సెనరేషన్ పద్ధతిలో 1000 నుంచి 1400 డిగ్రీల ఉష్ణోగ్రతలో తగలబెట్టాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రక్రియలో డబ్బులు చాలా ఖర్చు అవుతుంది. దానికి భిన్నంగా ఇతర కంపెనీల నుంచి శుద్ధి కోసం తెచ్చిన యాష్‌లో కలిపి చేస్తుండటంతో.. వర్షం వచ్చిన సందర్భంలో ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి, నీరు కలుషితం అవుతుందని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (సిడబ్ల్యుఎంపి)లో జరుగుతున్న ఈ వ్యవహారంపై, పీసీబీ అధికారులు ఇప్పటిదాకా కన్నేయకపోవడమే విచిత్రం. ఇన్సెనరేషన్ పద్ధతిలో డిస్పోజ్ చేయాల్సిన వేస్టును కూడా.. నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్‌ఫిల్లింగ్ పద్ధతిలో డిస్పోజ్ చేయడం వల్ల భూమి , నీరు కలుషితమవుతున్న ప్రమాదం ఏర్పడి ందంటున్నారు.
అసలు నిజానికి సదరు కంపెనీకి కేటాయించిన భూమికి ఎన్ని టన్నుల కెపాసిటీ ఉంది? ఎన్ని టన్నులు శుద్ధి చేస్తున్నారు? అక్కడ కొండ అంత ఎత్తున ఎందుకు పేరుకుపోయింది? ఇప్పుడు హటాత్తుగా ఎందుకు వాటిని భూమిలో పాతిపెడుతున్నారు? అనే కీలక అంశాలను స్వయంగా పర్యవేక్షించి, తనిఖీ చేయాల్సిన పీసీబీ అధికారులు.. కంపెనీ పలుకుబడికి భయపడి, తనిఖీలను మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు స్థానిక ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.
పవన్‌కు ‘పొల్యూషన్’పై పట్టు పోయిందా?
కాలుష్య నియంత్రణ మండలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖదే. అయితే పంచాయితీరాజ్, ఫారెస్టు శాఖలు కూడా ఆయన వద్దనే ఉండటం.. ఇటీవలి కాలంలో సినిమాలపై దృష్టి సారించడంతో పవన్ కల్యాణ్‌కు పొల్యూషన్ బోర్డుపై పట్టులేకుండా పోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పీసీబీలో ఏం జరుగుతోందో కూడా పవన్‌కు తెలిసే పరిస్థితి లేదని, అంతా ఆ శాఖలోని ఓ సీనియర్ ఏఎఎస్ చక్రం తిప్పుతున్నారని, పవన్‌ను వారే తప్పుదోవపట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరవాడ సహా విశాఖలోని ఫార్మా కంపెనీ ప్రాంతాల్లో నిరంతరం పర్యావరణ ఉల్లంఘనలు జరిగి, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఇప్పటివరకూ పవన్ ఒక్క పరిశ్రమను తనిఖీ చే సిన ఘటన లేదంటున్నారు. ఇప్పుడు పరవాడలో యదేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న.. వైసీపీ ఎంపీ ఫార్మా కంపెనీకి దన్నుగా ఉన్న కీలక అధికారులెవరో విచారించి, వారిపై వేటు వేసే సాహసం పవన్ చేయగలరా? అన్న ప్రశ్నలు కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.