స్టార్ హోటల్లో వైసీపీ ఎంపీకి, ఎమ్మెల్యే సోదరుడికి మధ్య జరిగిన గుద్దులాటల సంగతేమిటి రాంబాబు?
– హోటల్ షెరటాన్ లో ఇద్దరుఎంపీల సమక్షంలో ఒక ఎమ్మెల్యే తమ్ముడు, ఎంపీని పిడిగుద్దులు గుద్దాడు
– ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపేరుతో కొట్టేసిన డబ్బులకోసమే ఈ గుద్దులాటలు
-జాతీయప్రాజెక్టుని గాలికొదిలేసి జగన్ రెడ్డి జాతిద్రోహానికి పాల్పడ్డాడు
– ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో కాంట్రాక్ట్ సంస్థలకు దోచిపెడుతూ, ఆ సొమ్ముని వచ్చేఎన్నికలకోసం నియోజకవర్గాల వారీగా రిజర్వ్ చేసిపెడుతున్నారు
• పోలవరం కుడి కాలువలో మట్టి అమ్ముకున్న వ్యక్తి ఇరిగేషన్ మంత్రా? సిగ్గు, శరముంటే రాంబాబు తక్షణమే మంత్రిపదవికి రాజీనామాచేయాలి
• పోలవరం నిర్మాణం, రాష్ట్ర ఇరిగేషన్ రంగంపై మాట్లాడకుండా, జగన్ రెడ్డిని వెనకేసుకొస్తూ, మీడియాపై విషంకక్కితే సరిపోతుందా రాంబాబు?
• 50 నెలల్లో రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి పెట్టిన ఖర్చుఎంత.. ఎన్ని ప్రాజెక్టుల్లో ఎంతశాతంపనులు పూర్తిచేశారు? ఎన్నిఎకరాలకు నీళ్లిచ్చారనే పూర్తివివరాలతో శ్వేతపత్రం విడుదలచేయగలవా రాంబాబు?
• రాయలసీమ కరువునివారణ కింద, ప్రాజెక్టులనిర్మాణం పేరుతో తీసుకొచ్చిన అప్పుల్లో రూ.733కోట్లు ఆర్.ఈ.సీ చెల్లించిందని రాంబాబు చెబుతున్నాడు
• పనులు చేయకుండా ప్రంట్ లోడింగ్ పేరుతో 706 కోట్లు ఏజెన్సీలకు చెల్లించామని రాంబాబు ఒప్పుకున్నాడు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపనులు టీడీపీప్రభుత్వం వల్లే ఆలస్యమయ్యాయని సంబరాల రాంబాబు బాధ్యతారాహిత్యం తో బుద్ధిలేని ప్రకటనలుచేశాడని, వైసీపీప్రభుత్వం వచ్చి 50నెలలు అవుతుంటే, ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఎంతశాతం పూర్తిచేసి, ఎన్నిఎకరాలకు అదనంగా నీళ్లిచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంసహా, రాష్ట్రంలోని సాగునీటిప్రాజెక్టుల నిర్మాణం ఎంతవరకు పూర్తిచేసిందో ఈప్రభుత్వం సమాధానం చెప్పాలి. సాగునీటిప్రాజెక్టుల నిర్మాణంపేరుతో కమీషన్లు దండుకొని, అవినీతికి పాల్పడ్డారు. ఇరిగేషన్ శాఖలో జరిగినదోపిడీపై విచార ణజరిపితే ముఖ్యమంత్రి, ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐ.ఏ.ఎస్ అధికా రి ధనుంజయ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం. వైసీపీప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి రూ.26 వేలకోట్లు ఖర్చుపెట్టింది అని చెబుతున్నారు. ఆసొమ్ముతో ఏ ప్రాజెక్టులో ఎంతమేరకు పనలుచేసి, ఎన్నిప్రాజెక్టుల్ని పూర్తిచేసి, ఎన్నిఎకరాలకు నీళ్లిచ్చారో జగన్ అండ్ కో సమాధానం చెప్పాలి.
పోలవరం మట్టి అమ్ముకున్న వ్యక్తి ఇరిగేషన్ మంత్రా? సిగ్గు, శరముంటే రాంబాబు తక్షణమే మంత్రిపదవికి రాజీనామా చేయాలి
పోలవరం నిర్మాణానికి వైసీపీప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం ఎంతసొమ్ముఇచ్చింది? దానిలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతడబ్బు ఖర్చుపెట్టారు? టీడీపీప్రభుత్వంలో జరిగిన పనులకు సంబంధించి వైసీపీప్రభుత్వానికి డబ్బులువచ్చాయి తప్ప, ఈ ప్రభుత్వం పోలవరంలో చేసినపనులకు రూపాయిరాలేదు. చేతగానిదద్దమ్మలు మీరా మాట్లాడేది .. పోలవరం మట్టి అమ్ముకున్నవ్యక్తి ఇరిగేషన్ మంత్రా? సిగ్గు శరముంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి.
పోలవరం కూడికాలువలో కొత్తూరుతాడేపల్లి, వెలగలేరు, నున్న ప్రాంతాల్లో మట్టితవ్వేసి అమ్ముకున్నారు. ఇరిగేషన్ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ, వైసీపీనేతలు దీనిలో సూత్రధారులు..పాత్రధారులు. అడ్డగోలుగా జరుగుతున్న మట్టి తవ్వకాలు, అమ్మకాలపై కొందరుహైకోర్టుకి వెళ్తే, కోర్టు స్టే ఇచ్చినా ఈ మట్టిదొంగలు తమదోపిడీ ఆపలేదు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించినా మట్టి తవ్వకాలు ఆపలేదు. కోర్టుధిక్కారంపై మరలాకోర్టుకు వెళ్లినా ఇప్పటికీ యథేచ్ఛగా మట్టిదోపిడీ జరుగుతూనే ఉంది. మట్టిని అమ్ముకున్నవాడు సిగ్గులేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నాడు.
టీడీపీప్రభుత్వంలో జరిగిన పోలవరంప్రాజెక్ట్ నిర్మాణపనులు రికార్డులు సాధించాయి
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపనుల్ని చంద్రబాబు 72శాతం పూర్తిచేశారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం, కళ్లముందు కనిపిస్తున్న పచ్చినిజం. ప్రతిసోమవారాన్ని పోలవారంగా మార్చి, ప్రాజెక్ట్ నిర్మాణంపై సమీక్షజరిపారు. టీడీపీప్రభుత్వంలో జరిగే పనుల్ని మీడియాకు ఆన్ లైన్లో చూపించేవాళ్లం. ఎప్పటికప్పుడు పనులపురోగతికి సంబంధించిన వివరాల్ని ప్రజలముందు ఉంచేవాళ్లం. పోలవరంనిర్మాణంలో భాగంగా టీడీపీప్రభుత్వంలో జరిగిన కాంక్రీట్ పనులకు రెండు గిన్నిస్ బుక్ అవార్డులు వచ్చాయి.
రికార్డు సమయంలో 414రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిచేశాము. ఇలా తాముచేసినపనులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. టీడీపీప్రభుత్వం మరలావచ్చిఉంటే, 2020 జూన్ కి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం పూర్తయ్యేది. టీడీపీప్రభుత్వం పోలవరంనిర్మాణానికి ఖర్చుపెట్టిన ప్రతిరూపాయిని కేంద్రఆర్థికశాఖ తిరిగిచ్చింది. రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు అంది ప్రజల కష్టాలు తీరిపోయేవి.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడకుండా ముఖ్యమంత్రి ఎందుకు ముఖం చాటేస్తున్నాడు?
బుద్ధిలేని రాంబాబుకి పోలవరం నిర్మాణం గురించి తెలియదు.. అక్కడ జరిగిన పను లేంటో అసలు తెలియవు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోలవరంలో ఎంత పనిచేశారు? సకాలంలో ప్రాజెక్టుని పూర్తిచేయకుండా ఈ సంవత్సరం..వచ్చేసంవత్సరం అని కబుర్లతో కాలయాపనచేశారు. 2019 జూన్లో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణం గురించి, ముఖ్యమంత్రికి పూసగుచ్చినట్టు వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్స్ నిర్మాణం, మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంత పూర్తయిందని చెప్పారు.
చెప్పిందంతా విని జగన్మోహన్ రెడ్డి తీరుబడిగా ప్రాజెక్ట్ పను లు రద్దుచేస్తున్నట్టు ప్రకటించాడు. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, పనులుచేస్తున్న సంస్థల్ని వెళ్లగొట్టాడు. కేంద్రప్రభుత్వం, పోలవరంప్రాజెక్ట్ అథారిటీ, మొత్తుకున్నా విన కుండా రివర్స్ టెండరింగ్ అనిచెప్పి, రూ.850కోట్లు తగ్గించానని చెప్పి, 15నెలల పాటు డ్యామ్ సైట్లో పనులుమొదలెట్టకుండా, ప్రాజెక్టుని వరదపాలుచేశాడు. ప్రాజెక్ట్ నిర్మాణం పై ప్రశ్నిస్తే ఇంతకుముందున్న మంత్రి బుల్లెట్లు దింపుతామన్నాడు.. కనిపించకుండా పోయాడు. ఇప్పుడున్న మంత్రి ఏంకట్టారో..ఎవరుకట్టారో తెలియదంటున్నాడు. పోల వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలోఎంతఖర్చుపెట్టాడు?
కేంద్రం నుంచి ఎంతసొమ్ము రాబట్టగలిగాడు? టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్ట్ అంచనావ్యయం (డీపీఆర్-2) కింద రూ.55,548కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్ (టీ.ఏ.సీ) పొందడం జరిగింది. దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ జగన్మో హన్ రెడ్డి 50నెలలైనా కేంద్రంనుంచి ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం..రావడం. ఢిల్లీలో ప్రధానిని, ఇతర మంత్రుల్ని కలిసినప్పుడు, వారితో ఏం మాట్లాడారనే వివరాల్ని ఎందుకు మీడియాకు చెప్పకుండా ముఖ్యమంత్రి దాటేశాడు?
పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేని అసమర్థముఖ్యమంత్రి, విగ్రహాలు పెడతాను.. సెవెన్ స్టార్ హోటల్ కడతానని కోతలు కోస్తున్నాడు
పోలవరంనిర్మాణంలో భాగంగా తమప్రభుత్వం ఇదిగో ఈపనిచేసిందని జగన్ రెడ్డి ఎం దుకు గర్వంగా చెప్పుకోలేకపోతున్నాడు? టీడీపీఅధినేత చంద్రబాబు, ఇతరనేతలు ప్రాజెక్ట్ ప్రాంతానికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని అడ్డుపెట్టి, ఎందుకు నిరోధిస్తు న్నాడు? మీడియాను ప్రాజెక్ట్ పరిశీలనకు ఎందుకు అనుమతించడంలేదు? 50నెలల్లో అక్కడేమీ చేయలేదుకాబట్టే.. ముఖ్యమంత్రి భయపడుతున్నాడు.
ప్రాజెక్ట్ పూర్తిచేయ కుండా విగ్రహాలుపెడతాను… సెవెన్ స్టార్ హోటల్ కడతానని కోతలుకోస్తున్నాడు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు బిగించలేని జగన్, పోలవరంప్రాజెక్టులో హోటళ్లుకడతాడా? గండికోట రిజర్వాయర్లో 6, 7 టీఎంసీలుంటే, ఒక్కఎకరాకు కూడా ఎందుకు నీళ్లివ్వలేదు? 50నెలల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కాలువైనా తవ్వి, ఒక్కఎకరాకు నీళ్లిచ్చారా?
స్టార్ హోటల్లో ఎంపీ, ఎమ్మెల్యే సోదరుడి మధ్య గుద్దులాటలు ఎందుకు జరిగాయి?
రాయలసీమ కరువునివారణ కింద, ప్రాజెక్టులనిర్మాణం పేరుతో తీసుకొచ్చిన అప్పుల్ని దోచేశారు. 900కోట్ల నిధులదారిమళ్లింపుపై టీడీపీ ఎమ్మెల్యే, పీ.ఏ.సీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రిని నిలదీశాడు. 733కోట్లు ఆర్.ఈ.సీ చెల్లించిందని రాంబాబు చెబుతున్నాడు. పనులుచేయకుండా ప్రంట్ లోడింగ్ పేరుతో 733.05 కోట్లు చెల్లించేశారు. దానిలో రూ.706 కోట్లు ఏజెన్సీలకు చెల్లించామని సంబరాల రాంబాబు చెబుతున్నాడు. ఈ విధంగా అడ్డదారిలో మీకునచ్చిన కాంట్రాక్టర్లకు ఎన్నివేలకోట్లు దోచిపెట్టారు?
రాఘవ కన్ స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్.ఆర్.కే మేడా మల్లిఖార్జునరెడ్డి, రఘునాథరెడ్డి, పీ.ఎల్.ఆర్. మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు వీళ్లంతా? ఎన్నివందలకోట్లు మీకు కమీషన్లుఇచ్చేవారికి దోచిపెట్టారు? రూ.1500కోట్ల చెల్లింపులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రూ.800కోట్లు దోచిపెట్టారు. ఆ సొమ్ముని వచ్చేఎన్నికల్లో ఖర్చుపెట్టేలా ప్రణాళికలు వేస్తున్నారు. ప్రతి నియోజకవ ర్గానికి 25కోట్లు రిజర్వ్ చేస్తున్నారు.
ఇటీవల హోటల్ షెరటాన్ లో ఇద్దరుఎంపీల సమక్షంలో ఒక ఎమ్మెల్యే తమ్ముడు, ఎంపీని పిడిగుద్దులు గుద్దాడు. ఏమిటీ పిడిగుద్దు ల వ్యవహారం..దేనికి ఎంపీలు, ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు? డబ్బుల పంపకాల్లో తేడాలొచ్చా? ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపేరుతో కొట్టేసిన డబ్బులకోసమే ఈ గుద్దులాటలు. కేంద్ర ప్రభుత్వం మెడలువంచి వేలకోట్లు తెస్తాం..ప్రాజెక్టుల్ని పూర్తిచే స్తామన్న మాటలు ఏమయ్యాయి జగన్ రెడ్డి?
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో జరిగిన దోపిడీపై మేం విచారిం చడం ఏమిటి బుద్దిలేనిరాంబాబు? 26 ప్రాజెక్టుల నిర్మాణానికి 50నెలల్లో ఎంతఖర్చు పెట్టారు..ఏ ప్రాజెక్ట్ కి ఎంతఖర్చు పెట్టారు.. ఎంతపనులు జరిగాయి.. ఎన్నిఎకరాలకు నీళ్లిచ్చారో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని రాంబాబుని డిమాండ్ చేస్తున్నాం. దమ్ము, ధైర్యముంటే మంత్రి తాము చెప్పిన అంశాలపై పూర్తివివరాల్ని ప్రజలముందు ఉంచాలి. జూలై నెల ముగుస్తోంది.. గోదావరికి వరద రాబోతోంది..నిర్వాసితుల గురించి ఏమైనా ఆలోచించారా సంబరాల రాంబాబు?
ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 10లక్షలు ఇస్తానన్న జగన్ రెడ్డి..50నెలల్లో ఎన్నికుటుంబాలకు ఎన్నిలక్షలు ఇచ్చాడు? పోలవరం నిర్వాసితులు తాడేపల్లి కొంపఎక్కుతామని పొలికేకలు పెడుతున్నారు. వారి ఆర్తనాదాలు ఈ ముఖ్యమంత్రికి వినిపించడంలేదు. పోలవరం నిర్వాసితులు సొమ్ముని దిగమింగిన పాపానికి వీఆర్వోలు, తహసీల్దార్లు జైలుకెళ్లారుగానీ, వైసీపీనేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూవెళ్లలేదు. పోలవరం నిర్మాణానికి డబ్బులు వస్తున్నాయని బడాయికబుర్లు చెబుతున్నారు..ఇప్పటివరకు ఎంతసొమ్ము వచ్చిందో..కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పండి.
పోలవరం నిర్మాణంపై మీడియా ముందుకొచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి కి, మంత్రి రాంబాబుకి ఉన్నాయా
పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రప్రజల హక్కు. కేంద్రప్రభుత్వమే దీనినిర్మాణానికి అవసరమైన డబ్బులు ఇస్తుంది. ఇరిగేషన్ కాంపోనెంట్ కింద ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ వర్క్, అన్నీకలిపే ఉంటాయని కేంద్రమంత్రి గడ్కరీనే స్వయంగా చె ప్పారు. జగన్ లాంటి అసమర్థుడిచేతిలో పడినందునే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఏం బాధ్యత తీసుకుంటుందో రాష్ట్రజలవనరులశాఖ ఎందుకు కేంద్రానికి చెప్పడం లేదు?
పోలవరం నిర్మాణాన్ని అనిశ్చితి, నిస్సహాయ పరిస్థితుల్లోకి తీసుకెళ్లిన ఘనులు ముఖ్యమంత్రి జగన్, సంబరాల రాంబాబు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి మీడి యా ముందుకొచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? పోలవరం ప వర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్భుద్ధితోనే జగన్ రెడ్డి, జాతీయప్రాజెక్ట్ నిర్మాణాన్ని గాలికి వదిలేసి జాతీయద్రోహానికి పాల్పడ్డాడు. 960 మెగావాట్ల జలవిద్యుత్, లక్షలఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ ని కమీషన్ల కక్కుర్తితో జగన్ నాశనంచేశాడు. జగన్ రెడ్డిని వెనకేసు కొస్తూ సంబరాలరాంబాబు మీడియాపై విషంకక్కాడు. పోలవరంలో గైడ్ బండ్ ఎందుకు కుంగిందో, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంగతేమిటో చెప్పకుండా నోటికొచ్చింది మాట్లాడాడు.
లైడార్ సర్వేపై రాంబాబు ఎందుకు నోరుమెదపలేదు? సర్వేరిపోర్టుల్ని తొక్కిపెట్టి పోలవరం నిర్వాసితుల్ని ఏంచేయాలనుకుంటున్నారు? పోలవరం కాపర్ డ్యామ్ భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారు? నిర్వాసితులకు ఏంన్యాయం చేయబోతున్నారు ? రాయలసీమలో ఏప్రాజెక్టులు నిర్మించి, ఎంతఖర్చుపెట్టారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఎంత వెచ్చించారు? గోదావరికృష్ణా, పెన్నా డెల్టాల్లో ఎక్కడైనా ఏ కాలువైనా బాగు చేశారా?
ఈ ప్రశ్నలకు రాంబాబు మీడియాముందుకొచ్చి సమాధానం చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో 10కోట్లపనులుచేసినట్టు చూపించి 100 కోట్లు, 100కోట్లకు 1000కోట్లు డ్రాచేస్తున్నారు.. ఇలా కొట్టేసిన సొమ్ముని వచ్చే ఎన్నికలకు వినియోగించడానికి జగన్ రెడ్డి ప్రణాళికలు వేశాడు. పోలవరంప్రాజెక్ట్ నాశనంచేసిన వ్యక్తిగా, రాయలసీమద్రోహిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు.” అని ఉమా తేల్చిచెప్పారు.