– ఎక్కడా పాలన అనేది లేదు
– మన హానీమూన్ పీరియడ్ ముగిసింది
– చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారెంటీ
– ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. వేధింపులు
– అన్నింటా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం
– ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం
– – త్వరలోనే ప్రత్యేకంగా ఒక యాప్ విడుదల
– వేధింపులకు గురైన వారి కోసం ఆ యాప్
– తప్పు చేసిన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్
తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఎసీ) సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది.
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో శ్రీ వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే.. మనం ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. చూస్తుండగానే దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఇంకా మనకు మిగిలింది మూడేళ్లు మాత్రమే. మనం ఇప్పుడు రాక్షస పాలన చూస్తున్నాం. దాన్ని ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది.
మన పార్టీ సీనియర్ నాయకులను జైళ్లలో పెడుతున్నారు. భవిష్యత్తులో మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే, టీడీపీ సీనియర్ నాయకులంతా జైళ్లలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన లీడర్లను అన్యాయంగా జైళ్లలో పెట్టారు.
మిధున్‌రెడ్డిని చూస్తే బాధనిపిస్తోంది. ఆయన్ను నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. అదే విధంగా మేకపాటి గౌతమ్‌రెడ్డిని కూడా నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. వారి తండ్రులు మా నాన్న బ్యాచ్. వారిద్దరూ నా బ్యాచ్. నా ఫ్రెండ్స్. కేవలం వేధించడం కోసమే మిధున్‌రెడ్డిని అరెస్టు చేసి, జైల్లో పెట్టారు. ఆయన కనీసం ఇక్కడ మంత్రి కూడా కాదు. ఆయన తండ్రి రామచంద్రన్న ఎక్సైజ్ మంత్రి కూడా కాదు. చంద్రగిరిలో తన ప్రత్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాబట్టి, టార్గెట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా వేధించి అరెస్డు చేయాలని చూస్తున్నారు.
నందిగం సురేష్. దళితుడు. ఎంపీగా ఎదిగాడు. 6 నెలల 10 రోజులు. మొత్తం 191 రోజులు జైల్లో పెట్టారు. ఒక కేసు కాగానే మరో కేసు పెట్టి జైల్లో ఉంచారు. కాకాణి గోవర్థన్‌రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. క్వార్ట్›్జ గనుల కేసు. టోల్గేట్ కేసు. వరసగా కేసులు పెట్టి, వేధిస్తున్నారు. ఇప్పటికే జైల్లో పెట్టారు. ఇప్పుడు అనిల్‌కుమార్ యాదవ్ టార్గెట్. ఆయననూ అరెస్టు చేయాలని చూశారు. కానీ, ఆ కుట్రలో భాగంగా ముందుగా అరెస్టు చేసిన వ్యక్తి (శ్రీకాంత్‌రెడ్డి) అదృష్టవశాత్తూ జడ్జీ ముందు నోరు విప్పి పోలీసులు తనను ఎలా హింసించారనేది చెప్పడంతో, అనిల్‌కుమార్ అరెస్టు కాలేదు.
జోగి రమేష్ కొడుకును అరెస్టు చేయడం.. రోజాను కూడా వేధించడం, ఆనందం పొందడం.. ఇంకా విడదల రజని. ఆమెమీదా కేసు పెట్టారు. వేధించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దారుణం. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో విధ్వంసం చేశారు. అదృష్టవశాత్తూ అప్పుడు ఆయన ఇంట్లో లేరు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే చంపే వారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. కారును కూడా పడదోశారు. దాడిపై ఆయన ఫిర్యాదు చేస్తే, పట్టించుకోని పోలీసులు.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగానే తిరిగి ఆయనపైనే చర్య తీసుకున్నారు.
తాడిçపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఆయన్ను సొంత ఇంటికి పోనివ్వడం లేదు. పైగా సీఐ గన్ చూపి బెదిరిస్తున్నారు.
మొదటిసారి కొందరు పోలీసులు అవినీతిలో మునిగిపోయారు.
ఒక్కో జోన్‌కు డీఐజీ. ఆయన ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు. వసూళ్లు చేసి, ఎమ్మెల్యేలకు, అక్కణ్నుంచి సీఎంకు, ఆయన కుమారుడికి నిధులు ఇస్తున్నారు. అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించి, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం అమ్ముతున్నారు.
వారికి పోలీసులు రక్షణగా నిలుస్తున్నారు. ఇసుక దగ్గరుండి అమ్మిస్తున్నారు. ఏ ఒక్క గని కూడా వదలడం లేదు. నేరుగా డీఐజీ డీల్ చేస్తున్నాడు, ఎమ్మెల్యేకు ఇంత. సీఎంకు ఇంత. ఆయన కొడుక్కి ఇంత అని ఇస్తున్నారు. ఇందులో డీఎస్పీ, సీఐలకూ వాటా వెళ్తోంది. ఇంత అవినీతి గతంలో ఎక్కడా లేదు. చూడలేదు.
రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. అవన్నీ వీరి జేబుల్లోకి పోతున్నాయి. అందుకే దేశ ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, ఇక్కడ అది కేవలం 3 శాతమే. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వానికి కాకుండా, వీరి జేబుల్లోకి పోతోంది. అందుకే ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదు. ఇప్పుడు మళ్లీ సింగపూర్ పర్యటన. ఈ డబ్బులన్నీ తీసుకుపోయి, దాచి పెట్టుకోవడానికి మాత్రమే, ఈ పర్యటన కనిíపిస్తోంది.
వచ్చే వారంలో మనం చేసే కార్యక్రమం. ఒక యాప్ విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరైనా, ఏ కార్యకర్త అయినా అధికారులతో వేధింపులకు గురైతే, లేదా ఏదైనా అన్యాయానికి గురైతే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదు చేయొచ్చు. ఎవరితో, ఏ అధికారితో తాను ఇబ్బంది పడింది అన్నది చెప్పొచ్చు. దానికి సంబంధించి ఆధారాలు ఉంటే, వాటినీ అప్లోడ్ చేయొచ్చు. అవన్నీ మన డిజిటల్ లైబ్రరీలోని సర్వర్‌కు చేరుతాయి.
రేపు మన ప్రభుత్వం రాగానే, డిటిజల్ లైబ్రరీలో దాన్ని (సర్వర్) ఓపెన్ చేసి, బాధ్యులైన వారు ఎవ్వరినీ వదలకుండా చట్టం ముందు నిలబెడతాం. సినిమా చూపిస్తాం. వారు చేసినవన్నీ వడ్డీతో సహా చెల్లిస్తాం. ఈరోజు వారు నాటే విత్తనం అదే రేపు పండుతుంది. అందుకే చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం.
మన క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఇంట్లో ఈ కార్యక్రమం సాగుతుంది. ఆ ఇంటికి చంద్రబాబు ఎంత బాకీ ఉన్నాడు. గత ఏడాది ఎంత ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఎంత బాకీ పడుతున్నాడు.. అనేది చెబుతున్నాం.
మీరంతా సీనియర్ లీడర్లు. కాబట్టి మీరు కూడా కాస్త చొరవ చూపాలి. మీరు మార్గదర్శకులుగా నిలవాలి. మీ సీనియారిటీని ఉపయోగించాలి. జిల్లా స్థాయిలో అందరితో, నాయకులతో మమేకం కావాలి. మన హానీమూన్ పీరియడ్ ముగిసింది. కొందరు సీనియర్లు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వారంతా రంగంలోకి దిగాలి. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలి. పార్టీల యువ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తూ, సీనియర్ నాయకులంతా పని చేయాలి. అలా మీ సీనియారిటీని చూపాలి.
మీరంతా సీనియర్లు. మీరు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతారో.. జూనియర్ నాయకులూ చొరవ చూపుతారు. ముందుకు వచ్చి పని చేస్తారు. కాబట్టి, మీరు ఎక్కడా ఎలాంటి అలసత్వం చూపొద్దు. చొరవ చూపాలి. యాక్టివ్ కావాలి. కష్టపడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం వస్తుంది..
కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలి.
. గతంలో మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ వల్ల, కార్యకర్తలను అంతగా పట్టించుకోలేకపోయాం. కానీ, ఈసారి అలా కాదు. వారికి చాలా ప్రాధాన్యం ఇస్తాం.
జగన్ భద్రతపై ఆందోళన:
కాగా, ఇటీవలి పర్యటనల్లో వైయస్ జగన్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పించకపోవడంపై సమావేశంలో పీఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటన సందర్భంగా పోలీసులు చూపిన నిర్లక్ష్యాన్ని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని తేల్చి చెప్పారు. జగన్ భద్రతపై వినిపిస్తున్న కథనాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో జగన్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ పీఏసీ సభ్యులు స్పష్టం చేశారు.
బొట్టుతో జగన్
చాలాకాలం తర్వాత పీఏసీ సమావేశం నిర్వహించిన జగన్.. ఈసారి నుదుట బొట్టుతో తొలిసారి వినూత్నంగా దర్శనమిచ్చారు. సహజంగా ఎప్పుడూ బొట్టుతో కనిపించని జగన్.. ఈసారి కొత్తగా బోట్టుతో సమావేశానికి రావడం ఆశ్చర్యం. దానితో లిక్కర్ కేసులో అరెస్టు ఖాయమైనందున.. తాను హిందువుననన్న సంకేతం బీజేపీకి ఇచ్చేందుకే ఆయన బొట్టు పెట్టుకున్నారంటూ, సోషల్‌మీడియాలో వెంటనే కథనాలు అల్లుకుపోవడం విశేషం. గతంలో జగన్ ఏ దేవాలయానికి వెళ్లినా, బయటకు వచ్చిన తర్వాత బొట్టు చెరిపేసుకునేవారు. జన్మతః క్రైస్తవుడయిన జగన్ సాధారణంగా క్రైస్తవ ఆచారాలనే పాటిస్తుంటారని తెలిసిందే. ఇక ఆయన భార్య భారతీరెడ్డి ఒక్కసారి కూడా భర్త జగన్‌తో కలసి ఆలయానికి వెళ్లకపోవడంపై హిందూ సంస్థల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటిది అధికారం పోయిన క్రమంలో, జగన్ బొట్టుతో ప్రత్యక్షం కావడం సహజంగానే చర్చలకు అవకాశం కల్పించింది.