– ఐదు నెలల వ్యవధిలో సుమారు 30 మంది మృతి
– మరణమృదంగంపై అప్రమత్తం అవసరం
(నవీన్)
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో ఐదు నెలల వ్యవధిలో సుమారు 30 మంది చనిపోవడంతో ఊరంతా భయాందోళన నెలకొంది. జులై, ఆగస్టు నెలల్లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ అంతుచిక్కని మరణాల వెనుక ‘మెలియోయిడోసిస్’ అనే అరుదైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
‘బర్ఖోల్డెరియా సూడోమల్లై’ అనే ఈ సూక్ష్మజీవి మట్టిలో, మురుగునీటిలో జీవిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది వేగంగా వ్యాపిస్తుంది. కలుషితమైన మట్టి, నీటితో సంబంధం ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. చర్మంపై ఉన్న గాయాల ద్వారా, కలుషితమైన గాలి పీల్చడం వల్ల, లేదా నీరు తాగడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలకు దీని ప్రమాదం ఎక్కువ.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధుమేహం, కిడ్నీ, లివర్ జబ్బులు ఉన్నవారు సులభంగా దీని బారిన పడతారు. తురకపాలెంలో మరణించిన వారిలో చాలామందికి ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యాధి లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. జ్వరం, దగ్గు, న్యుమోనియా, చర్మంపై కురుపులు వంటివి కనిపిస్తాయి. ఇవి క్షయ (టీబీ) లాంటి ఇతర జబ్బులను పోలి ఉండటంతో వైద్యులు త్వరగా గుర్తించలేరు. అందుకే దీనిని”గొప్ప అనుకరణకారి” (the great mimicker) అని పిలుస్తారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం ప్రాణాల మీదికి తెస్తుంది.
విషయం తెలిశాక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. వైద్య నిపుణుల బృందాలు గ్రామానికి చేరుకున్నాయి. ఇంటింటి సర్వే చేసి, సుమారు 2,000 మంది రక్త నమూనాలు సేకరించాయి.
తురకపాలెం ఉదంతం ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యను వెలుగులోకి తెచ్చింది. భారతదేశంలో మెలియోయిడోసిస్ కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కానీ, అంచనాల ప్రకారం ఏటా వేల మరణాలు ఈ వ్యాధి వల్లే సంభవిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు .గ్రామీణ ప్రాంతాల్లో సరైన ల్యాబ్ సౌకర్యాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఎదుర్కోవాలంటే నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి. మట్టిలో, నీటిలో పనిచేసే రైతులు, మధుమేహులు జాగ్రత్తగా ఉండాలి. కాళ్లకు బూట్లు, చేతులకు గ్లోవ్స్ ధరించడం, గాయాలు కాగానే శుభ్రం చేసుకోవడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం వంటివి తప్పనిసరి.
సోర్స్: GSL మెడికల్ కాలేజి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్
– (రచయిత సీనియర్ జర్నలిస్టు)