Suryaa.co.in

Features

రావణ గోస!

ప్రతి ఏడాదీ తనను దహనం చేస్తున్న ప్రజల తీరుపై రావణ చక్రవర్తి కన్నీరు పెట్టుకున్నాడు. తానేం తప్పు చేశానని ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. చీమకు కూడా హాని చేయలేదు కదా అని ప్రశ్నిస్తున్నాడు. సీతను ఎత్తుకెళ్లినా మర్యాదగానే చూశాను కదా అని వాపోయాడు. మీ మాదిరిగా.. మీ రాజకీయ నాయకుల మాదిరిగా… తానేమీ ప్రజాధనం కొల్లగొట్టలేదని గుర్తు చేస్తున్నాడు. అవినీతికి పాల్పడి ప్యాలెసులు కట్టుకోలేదని.. విదేశాల్లో ఆస్తులు కూడగట్టుకోలేదని.. పేపర్లు, చానెళ్లు, సిమెంటు కంపెనీలు.. లిక్కరు కంపెనీలు పెట్టలేదని.. ఇసుక దోచుకోవడం లేదని.. పారిశ్రామికవేత్తలకు దేశసంపద అప్పనంగా పంచిపెట్టలేదని.. కుండబద్దలు కొడుతున్నాడు. రాజకీయ నాయకుల మాదిరిగా తానెవరినీ రేపులు చేయలేదని.. ఎవరితో ఫోన్లలో రాసలీలలు ఆడలేదని సూటిపోటిమాటలు సంధిస్తున్నాడు.

మరి.. ప్రజల ఆదాయం పెంచి.. రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచి.. ఎత్తుకొచ్చిన సీతమ్మను తాకని తనను దహనం చేయాలా?.. ప్రజలను దోచుకుంటూ, మహిళల మాన ప్రాణ ధ నం ఎత్తుకెళుతున్న మీ రాజకీయ నాయకులను దహనం చేయాలా?.. ఆలోచించుకోమంటూ, రావణాసురుడు ప్రజలకు ప్రశ్నలు విసుతున్నాడు. ఆ సందర్భంలో ‘రావణ గోస’ ఏమిటో ఓసారి ఆలకిద్దాం.

“నేను లంకాధిపతి రావణున్ని మాట్లాడుతున్నాను.. ..మీరు నా మనవలు, మనవరాళ్లు… నేను మిమ్ములను చూసి చాలా దుఃఖం లో ఉన్నాను. మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి దసరాకు నన్ను కాదు దహనం చేయాల్సింది.. మీ నాయకుల దిష్టి బొమ్మలను! నేను చెప్పేది ఒక్కసారి వినండి . ఆలోచించండి.ఈ రోజు మీరందరు నన్ను దహనం చేస్తున్నారు. చెడుపై మంచి సాదించిన విజయంగా చెప్పుకుంటున్నారు.

మీ రాజకీయ నాయకుల కంటే.. మీ ముఖ్య మంత్రుల కంటే నేను దుర్మార్గంగా వ్యవహరించానా? ఒక్కసారి విఙ్ఞతతో ఆలోచించండి. నిజంగా ఈ రోజుల్లో మనుషులరూపం లో ఉన్న, మీ పాలక మృగాలకంటే నేను చెడ్డవాడినా? ఒకవేళ లక్ష్మణుడు నా చెల్లిపై దాడి చేసి ముక్కు చెవులు కోసి ఉండకపోతే , నేను సీతను ఎత్తుకొచ్చేవాన్నా? మీరొక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీ అక్కా చెల్లితో ఎవరైనా ఇలాగే చేస్తే మీరేం చేస్తారు?

సీతని తీసుకువచ్చాక కూడా, నేను తనతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు, తనని అవమానించలేదు. మీ నాయకులలో రేపిస్టులు, హంతకులు లేరా? ఈ రోజుల్లో లాగ ప్రేమించట్లేదని మొహం మీద యాసిడ్ దాడి నా రాజ్యం లో ఎవ్వరు చేయ లేదు. నా అంత బలవంతుడు లేడు. అయినా కూడా సీతాదేవి పవిత్రతకి చిన్న మచ్చకూడా రానివ్వలేదు. కావాలనుకుంటే బలవంతంగా సీతని నా రాజభవనంలో పెట్టుకునే వాడిని. కాని దాని వల్ల సీత శీలం పై మచ్చ ఏర్పడుతుందని తెలుసు. కాబట్టి తనని రాజభవనాలకి దూరంగా ” అశోక వాటిక” లో, అది కూడా మహిళా సంరక్షకుల పర్యవేక్షణలో ఉంచాను… మరి.. మీ రాజకీయ నాయకుల పాలనలో స్త్రీలకు రక్షణ ఉన్నదా?

నా పుత్రులు, సోదరులు, నా సంబందీకులందరు, రాముడు అతని సైన్యం చేతిలో మృత్యువు పాలయ్యారు. కాని దానికి ప్రతీకారం సీత మీద తీర్చుకోలేదు. చివరి వరకు నా మర్యాద కాపాడుకున్నా. బంగారంతో నిర్మించబడిన నా లంకా నగరం లో, పేదవాడు అనేవాడు ఉండే వాడు కాదు. అందరికి న్యాయం జరిగేది. నా ప్రజలందరు సంపన్నులు. సుఖసంతోషాలతో జీవిస్తూ ఉండే వారు.. మరి మీ ప్రధానుల, మీ ముఖ్య మంత్రుల పాలనలో సుఖశాంతులు ఉన్నాయా? పేదరికం, నిరుద్యోగం,కూటికి, గూటికి లేని ప్రజలు ఉన్నారుగా? చెప్పండి ఎవరు ఉన్నతమైన వారు? మీ ముఖ్య మంత్రులా? నేనా? దసరా రోజు దహనం చేయాల్సింది ఎవరిని? నేను చేసినదానికి పశ్చాత్తాపపడ్డాను.

ప్రతిసంవత్సరం నన్ను దహణం చేస్తున్నారు, “చెడు” కి ప్రతీకగా నన్ను చెప్తున్నారు.. నన్ను కాదు మీరు దహనం చేయాల్సింది…మీ నాయకులను … చెడుకు ప్రతీకగా చెప్పాల్సింది మీ నాయకుల పేర్లను! వారు దోపిడీ దొంగలు.. ధన దాహ పిచాశాలు.. ఆర్థిక నేరస్థులు.. భూములను దోచుకున్నారు. కుల, మతాలుగా విభజించి పాలిస్తున్నారు. విద్యకు, వైద్యానికి పేద వారిని దూరం చేశారు. వాటిని వ్యాపారస్తుల చేతులలో పెట్టి, వారి వద్దనుండి లంచాలు తీసుకుంటున్నారు. కొందరిని రాజ్యాధికారానికి దూరం చేశారు, మీ రాష్ట్రం లో మీ దేశంలో బీసీలకు రాజ్యాధికారం లో వాటా ఎక్కడ?

ఎందుకు ఇవ్వడం లేదు. బీసీలు మనషులు కారా? వివక్ష లేదా? వచ్చే దసరాకి బీసీలు దహనం చేయాల్సింది నన్నా? రాజ్యాధికారం లో వాటా ఇవ్వని నాయకులనా? నన్ను దహనం చేస్తున్న మీరు ఒక్క సారైనా ఆలోచించారా? మీకు నేను చిన్న హాని చేశానా? మీకు హాని చేస్తున్న నాయకుల బొమ్మలను కదా దహనం చేయాల్సింది? ఈ దేశం లో స్త్రీల మీద ఎలాంటి అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయో మీకు కనిపించడం లేదా?

చిన్న చిన్న పిల్లల్ని మానభంగం చేయడం, వాళ్ళని చంపేయడం..ఇష్టం లేదు అని చెప్తే అమ్మాయిల పై యాసిడ్ దాడులు చేయడం.. కులమతాల పేరుతో చంపడం.. పసిపిల్లల్ని నిలువునా తగలబెట్టడం… అసమర్థ పాలన వలన కాదా!

రావణ దహనాన్ని మానేయండి..
నేను తప్పు చేసినవాడిని అయిండొచ్చు.
కానీ దుర్మార్గున్ని కాదు.
నేను రావణున్ని.
ఈ దేశ మూల వాసుల చక్రవర్తిని.
ధర్మబద్దంగా పరిపాలించిన వాడిని …. ప్రజా ధనాన్ని దొంగలించి దాచుకో లేదు నేను…మీ నాయకుల లాగా.
ఇక నుండి ప్రతి దసరాకి మీకు అన్యాయం చేసిన నాయకుల దిష్టి బొమ్మలను దహనం చేయండి..
నా పది తలలు రాక్షస తత్వానికి ప్రతీకలు కాదు..విజ్ఞానానికి ప్రతీకలు.

– సేకరణ

LEAVE A RESPONSE