Home » రాయచోటి రెడ్డమ్మకు ఎస్కార్టు కావాలట

రాయచోటి రెడ్డమ్మకు ఎస్కార్టు కావాలట

– మంత్రి గారి భార్య.. మజాకానా?
– ఆలస్యంగా వచ్చిన పోలీసులకు అక్షింతలు
– మంత్రుల భార్యలకూ ఎస్కార్టు ఇస్తారా?
– మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య ఓవరాక్షన్
– సోషల్‌మీడియాలో విమర్శల వర్షం
– సేవకులంటే ఇలాగే ఉంటారా అని సెటైర్లు
– గతంలో గుంటూరు జిల్లాలో ఇలాగే పెత్తనం చేసిన ఓ మాజీ మంత్రి భార్య
– పార్టీ పరువు పోతోంది బాబూ..
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒకవైపు మనం పాలకులం కాదు.. సేవలకులం అని సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని హితవు చెబుతున్నారు. ఆర్భాటం-హంగామాకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆవిధంగా హడావిడి చేస్తే జనం దృష్టిలో బద్నామ్ అవుతామన్నది బాబు భయం. ఫార్టీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్సు మరి! పైగా అలాంటి ఓవరాక్షన్ చేస్తే జగన్ మీడియా-సోషల్‌మీడియా దానిని అతి చేయడానికి ఎవ‘రెడీ’గా ఉంటుందన్నది ఆయన ముందుచూపు హెచ్చరిక. అవన్నీ పార్టీ క్షేమం కోసమే. జనంలో పార్టీ ఇమేజ్ డామేజ్ కాకుండా ఉండటం కోసమే.

కానీ.. రాయచోటిలో రెడ్డమ్మగారు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇంతకూ రాయచోటి రెడ్డమ్మ ఎవరంటే.. రాయచోటి ఎమ్మెల్యే-మంత్రి రాంప్రసాద్‌రెడ్డి గారి

భార్య. ఇంతకూ రెడ్డమ్మగారి కోరిక ఏమిటంటే.. ఆమెకు పోలీసు ఎస్కార్టు కావాలట. చిన్నప్పటి నుంచి పోలీసు ఎస్కార్టు లేకుండా బయటకు వెళ్లని రాయచోటి రెడ్డమ్మ గారికి అలవాటు ప్రకారం ఇప్పుడూ ఎస్కార్టు కావలసి వచ్చిందట. మంత్రుల భార్యలకూ పోలీసు ఎస్కార్టు ఫెసిలిటీ ఉందేమో మరి మనైకయితే తెలియదు.

మంత్రుల భార్యలకు ఎస్కార్టు ఉండదని పొరపడిన రాయచోటి పోలీసు అధికారులు, రెడ్డమ్మ పిలిస్తే ఆలస్యంగా వచ్చారట. దానితో వారిపై శివాలెత్తిన మంత్రి గారి రెడ్డమ్మ.. ‘ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? మీకు వైసీపీ జీతం ఇస్తుందా? పదండి’ అని కారులో ఠీవిగా కూర్చుని కన్నెర్ర చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బాబుగారు చెప్పే సేవకులు వీళ్లేనా?.. దయచేసి ఆమెకూ ఏ ఎమ్మెల్సీనో, ఎంపీనో ఇవ్వండి.. మంత్రుల భార్యలకూ ఎస్కార్టు ఇస్తారా? మరి కౌన్సిలర్ల భార్యలు ఏం పాపం చేశారు? వారికీ ఇవ్వండి.. మీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? అని సెటైర్లు వేస్తున్నారు.

గత టీడీపీ సర్కారు హయాంలో.. ఉమ్మడి గుంటూరు జిల్లా మంత్రి గారి భార్య కూడా, ఇలాగే నియోజకవర్గంలో పోలీసులపై పెత్తనం చేసిన వైనం విమర్శలకు గురైంది. ప్రతి పనికీ ఖరీదు కట్టిన ఆమె గారి నిర్వాకం వల్లే, ఆయన గారు ఘోరంగా ఓడిపోయి కొన్నేళ్లు హైదరాబాద్‌లో సేదతీరారు. టీడీపీ గాలి మొదలైనప్పుడే మళ్లీ ఎంటరయ్యారు.

ఇప్పుడు.. ‘‘పార్టీ స్ధాపించిన నాటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ.. పార్టీ మారకుండా ’’ అంకితభావంతో పనిచేస్తున్న, మంత్రి గారి భార్య పెత్తనం తాలూకు వీడియో.. రాయచోటిలో ఇంకెంత డామేజీ చేస్తుందోనన్నది తమ్ముళ్ల ఆవేదన.

Leave a Reply