– పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం
– ప్రభుత్వం దిగివచ్చేదాకా ఊరుకునేది లేదు
– రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందాన్ని రద్దు చేసుకునేదాకా పోరాడతాం
– ప్రాజెక్టు నిలిపివేయడంపై నెల్లూరులో తీవ్ర వ్యతిరేకత
– అందుకే సోమశిల విజిట్‌కి టీడీపీ పిలుపునిచ్చినా రైతులు వెళ్లలేదు
– నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు: రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంజీవని లాంటి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ప్రారంభించాల్సిందేనని, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందేనని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్టును ఆపడంపై నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అందుకే సోమశిల కండలేరు విజిట్‌కి టీడీపీ పిలుపునిచ్చినా వారి వెంట వెళ్లడానికి రైతులు నిరాకరించారని చెప్పారు. చంద్రబాబు తక్షణం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించకపోతే సాగునీటి రంగ నిపుణులు, రైతులతో కలిసి వైయస్సార్సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఏ ప్రయత్నాన్ని వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని చెప్పారు. సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని, రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారు.
దీనివల్ల రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీవ్ర నష్టం. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి వ్యవసాయం చేస్తున్న రైతులకు చివరి మూడు తడులకు నీరు లేక పంటలు నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమ లిప్ట్ ద్వారా నీరు తెచ్చుకోగలిగితే రైతులకు ఎలాంటి నష్టం జరగదని మాజీ సీఎం వైయస్ జగన్ భావించి, ప్రాజెక్టును వాయువేగంతో ముందుకు తీసుకెళ్లారు.
కానీ రైతు ఆవేదనను పట్టించుకోకుండా సంజీవని లాంటి ప్రాజెక్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశారు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి 130 టీఎంసీలు కేటాయిస్తే 20 ఏళ్లలో మూడు నాలుగు సార్లు తప్ప నీటిని పూర్తిగా వినియోగించుకోలేకపోయాం. కేటాయించిన జలాలను కూడా వాడుకోలేని దుస్ధితిలో ఉన్నామని కలత చెంది రాయలసీమ రైతుల కన్నీటిని తుడవడానికే మాజీ సీఎం వైయస్ జగన్ రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు.