Suryaa.co.in

Editorial

రాయపాటి.. కోరికల ఘనాపాఠి!

– సకుటుంబ సపరివార ‘సీట్ల’ సమేతంగా ..
– రాయపాటి కుటుంబం మొత్తానికి సీట్లు కావాలట
– నర్సరావుపేట సీటు తనకిస్తే బహు బాగట
– బాబు చెబితే పేట నుంచి చేస్తారట
– కుమారుడికి, తమ్ముడి కూతురుకూ సీట్లు కావాలట
– వారికి సీట్లిస్తే తనకు ఇవ్వకున్నా ఫర్వాలేదన్న త్యాగజీవి
– , పెదకూరపాడు, సత్తెనపల్లి సీట్లు కుటుంబానికి కేటాయించాలన్న కోరిక
– రాయపాటి సాంబశివరావు కోరికల చిట్టా తీర్చ తరమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాయపాటి సాంబశివరావు… తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. గుంటూరు-నర్సరావుపేట ఎంపిగా పనిచేసిన రాయపాటి పెద్ద బిజినెస్‌మెన్. ఇంకా చెప్పాలంటే పొలిటికల్ బిజినెస్‌మెన్. ఎవరికి ఏం కావాలి? ఎవరి అవసరాలేమిటి? ఎదుటివారిని ఏవిధంగా ఎలా.. ఏ మార్గంలో ప్రసన్నం చేసుకోవాలో, రాయపాటికి తెలినట్లు మరెవరికీ తెలియదన్నది పొలిటికల్ సర్కిల్‌లో ఒక టాక్. బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయల లోన్లు, ఆయన కంపెనీకి కాంట్రాక్టులన్నీ ఆ నైపుణ్యంతోనే సంపాదించారన్న పేరు కూడా ఉంది.

కాంగ్రెస్ హయాంలో ఆయనకు, ఒక్కసారి కూడా కేంద్రమంత్రి పదవిరాకపోయినా… తన జీవితకాల కోరికయిన టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వకపోయినా.. ఆయన పనులు ఎక్కడా ఆగలేదు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’లో అందెవేసిన చెయ్యి అయిన రాయపాటి, కాంగ్రెస్‌ను వీడి అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరినా.. పాపం టీటీడీ చైర్మన్ కోరిక కూడా నెరవేర్చుకోలేకపోయారు. అయితే పోలవరం వంటి పెద్ద కాంట్రాక్టు మాత్రం పట్టగలిగారు. అది వేరే విషయం.

గత ఎన్నికల్లో కాలం ఖర్మం కలసిరాక, తన సామాజికవర్గానికి చెందిన లావు కృష్ణదేవరాయలుపైనే ఓడిపోయారు. అక్కడి నుంచి టీడీపీలో పెద్ద చురుకుగా కనిపించడం లేదు. దానికితోడు అనారోగ్య సమస్యలు, ఆయనను ఇంటిపట్టునే ఉండేలా చేశాయి. బయటకు రావడం తగ్గించేసిన రాయపాటి, ఇప్పుడు నడవాలంటే సహాయకులు అవసరం. వీల్‌చైరే ఆధారం. మాటల్లో మునుపటి స్పష్టత లేదు. అయినా సరే… పదవులపై మాత్రం ఆయన కోరిక తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలికి ఫ్యామిలీ సీట్లు ఇవ్వాలన్న చిన్న చిన్న ఆశతో ఉన్నారు.

ఏ మాటకామాట! పాపం రాయపాటి మనసులో ఏదీ దాచిపెట్టుకోరు. మీడియాను పిలిచో, లేక మీడియా అడిగినప్పుడో మనసులో మాట కక్కేస్తుంటారు. ఎన్నికల్లో పోటీ విషయాన్ని కూడా, ఆయన అలాగే బయటపెట్టుకున్నారు.

ఇంతకూ రాయపాటి చిన్న కోరికలేమిటంటే… తనకు నర్సరావుపేటపై మనసుంది కాబట్టి, చంద్రబాబు తనను పిలిచి, అక్కడి నుంచి పోటీ చేయమని అడిగితే చేస్తారట. అలాగే సత్తెనపల్లి, పెదకూరపాడు సీట్లను తన కుమారుడు, తమ్ముడి కుమార్తె కోసం అడుగుతున్నారు. వారికి టికెట్లు ఇస్తే.. తనకు సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదట. రాయపాటి ఎంత త్యాగం చేశారో కదా?! ఇన్ని చెప్పిన రాయపాటి.. బాబు చేయమంటే నర్సరావుపేట నుంచి పోటీ చేస్తానన్నారు.

తన రాజకీయ ప్రత్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ, ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుస్తారని కితాబు ఇచ్చారు. ప్రస్తుతం కన్నా సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తు, అక్కడ బలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హటాత్తుగా రాయపాటికి, కన్నాపై అంత ప్రేమ కలగడం ఆశ్చర్యమే.

అయితే ఆ ప్రేమకు కారణమేమిటంటే… అదే సత్తెనపల్లి నుంచి రాయపాటి తన కుమారుడిని గానీ, తమ్ముడి కుమార్తెను గానీ పోటీ చేయించాలనుకుంటున్నారట. కాబట్టి కన్నా ఎక్కడినుంచైనా గెలుస్తారని, చెప్పడం వెనుక అర్ధమేమిటంటే.. కన్నాను గుంటూరు నుంచి పోటీ చేయిస్తే బాగుంటున్నది, రాయపాటి కవి హృదయమట. సాంబశివరావా? మజాకానా?

రాయపాటి కోరికలు తీర్చాలంటే, మరి టీడీపీ నాయకత్వం కూడా చాలా త్యాగం చేయవలసి ఉంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే దమ్మాలపాటి శ్రీధర్ ఇప్పటికే చురుకుగా పనిచేస్తున్నారు. సత్తెనపల్లి సీటును కన్నాకు ఖరారు చేశారంటున్నారు. ఇక గుంటూరుపై బోలెడుమంది కన్నేశారు. మిగిలింది నరసరావుపేట. అక్కడ డాక్టర్ అరవిందబాబు చురుకుగానే ఉన్నారు. పోనీ అక్కడ పోటీ చేద్దామంటే, రాయపాటి చెప్పిన సూత్రం ప్రకారం తన ఫ్యామిలీ లోకల్ కాదు.

పోనీ నరసరావుపేట ఎంపీ సీటు చూద్దామా అంటే.. టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ కుమారుడు మహేష్ ఇప్పటికే అక్కడ దస్తీ వేశారు. ఈ పరిస్థితిలో రాయపాటి కుటుంబానికి సీట్లు ఇవ్వాలంటే, టీడీపీ నాయకత్వం ఎంతమంది నేతల త్యాగం కోరుతుందో చూడాలి.

అయినా రాజకీయాల్లో కొత్త తరం వస్తున్న ఈ కాలంలో, ఇంకా రాయపాటి లాంటి పాత ఫ్యామిలీ జనంలో ఇంకా గుర్తుంటుందా అన్నదీ ఒక సందేహమేనని తమ్ముళ్ల ఉవాచ.

LEAVE A RESPONSE