– 23 కోట్ల అద్దె బకాయిలతో కనిపించని భరోసా
– వైసీపీ కార్యకర్తల ఇళ్లలోనే ఆర్బీకే కేంద్రాలు
– అయినా తాళాలు వేస్తున్న భవన యజమానులు
– బిల్లులు చెల్లించకపోవడంతో కరెంట్ కట్
– కొన్ని చోట్ల అద్దె చెల్లింపుల కోసం యజమానుల ధర్నాలు
– నడుమ నలుగుతున్న అధికారులు
– ఆర్బీకే సెంటర్లకు సినిమా కష్టాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మన ఇళ్లకు కరెంటు కట్టకపోతే కరెంటు ఫ్యూజులు తీసుకుని కరెంటు కట్ చేస్తారు. అదే ఇళ్లకు అద్దె కట్టకపోతే ఓనరొచ్చి తాళం వేసుకుని వెళ్లిపోతే మనం చాలా అవమానంగా భావిస్తాం. ఇక అప్పుడే సగం చచ్చిపోయినట్లు ఫీలవుతాం. పదిమందిలో పరువుపోయి, నలుగురిలో తలెత్తుకునేందుకే సిగ్గుపడతాం. మరి లక్షలకోట్ల బడ్జెట్‌తో ప్రభుత్వాలను నడిపే పాలకులకూ ఇలాంటి అవమానం ఎదురయితే, పాలకులు ఇంకెంత సిగ్గుతో చితికిపోవాలి? కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ‘నగుబాటుకు సంబంధించిన దిద్దుబాటే’దీ, 13 నెలల నుంచి కనిపించడం లేదు. తన భవనంలో నడుస్తున్న రైతుభరోసా (ఆర్బీకే) కేంద్రానికి 13 నెలల నుంచి ప్రభుత్వం అద్దె కట్టకపోవడంతో, పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురం వట్టిచెరుకూరులో.. రైతుభరోసా కేంద్రానికి ఇంటి యజమాని తాళాలు వేశారు. ఒక్క జంగమహేశ్వరపురమే కాదు, గత 13 నెలల నుంచి ఏపీలో 4 వేల ప్రైవేటు భవనాలదీ ఇదే దుస్థితి.
ఏపీలో జగనన్న ప్రభుత్వం అట్టహాసంగా తీసుకువచ్చిన రైతుభరోసా కేంద్రాలకు కిరాయి కష్టాలొచ్చాయి. అద్దెభవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో, యజమానులకు విసుగొచ్చి భవనాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్న అవమానకర పరిస్థితి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23 కోట్ల రూపాయల అద్దెలు చెల్లించాల్సిన సర్కారు, చేతులెత్తేసింది. ఫలితంగా ఉద్యోగులు బయటే కాలక్షేపం చేస్తున్న దుస్థితి.
ఏపీలో రైతుభరోసా కేంద్రాలకు వైసీపీ రంగులయితే వేశారు గానీ, అద్దెలు చెల్లించకపోవడంతో, యజమానులు భవనాలకు తాళాలు వేస్తుండటం అలవాటయిపోయింది. అయినా సర్కారులో చలనంలేదు. 10,778 రైతు భరోసాకేంద్రాలు, 56 హబ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇవికాకుండా అదనంగా మరో నాలుగువేల ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికన ఏర్పాటుచేశారు. వీటికి నెల అద్దె 4 నుంచి 5 వేల రూపాయలు. అద్దె భవనాలకు అత్యుత్సాహంతో పార్టీ రంగులేసిన సర్కారు, 13 నెలల నుంచి సుమారు 23 కోట్ల రూపాయల అద్దె బకాయిలు మాత్రం ఇవ్వకుండా, ఇంటి యజమానులను సతాయిస్తోంది. వాటిని ఇతరులకు అద్దెకిచ్చినా తమకు డబ్బులొచ్చేవని ఇప్పుడు వారంతా తీరికూర్చుని వాపోతున్నారు.
అయితే ఇటీవల రైతుభరోసా కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు కెళ్లారు. హైకోర్టు కన్నెర్ర చేయడంతో, 1500 కేంద్రాలను ప్రైవేటు భవనాల్లోకి మార్చారు. ఆ రకంగా పాతవి, కొత్తవి కలిపి 5500 కేంద్రాలు ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్న పరిస్థితి. అయితే..కోర్టు ఆదేశాలతో స్కూళ్ల నుంచి ప్రైవేటు భవనాలకయితే మార్చారు గానీ, గతేడాది నుంచి వారికి అద్దె చెల్లించడం లేదు.
ప్రస్తుత బడ్జెట్లో రైతుభరోసా కేంద్రాలకు 18 కోట్ల రూపాయలు కేటాయించడం వరకూ బాగానే ఉన్నా, గతేడాది చెల్లించాల్సిన అద్దెలే 23 కోట్లు పెండింగ్‌లో ఉండటంతో, ఏం చేయాలో తెలియక వ్యవసాయ సహాయకులు అయోమయంలో పడ్డారు. నిజానికి గతేడాది 18 కోట్ల రూపాయలు కేటాయించినా, అందులో 13.27 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. మార్చి 31న నిధులు విడుదలయినప్పటికీ, బడ్జెట్ ఇబ్బందుల కారణంగా చెల్లింపులు నిలిపివేయడంతో, ఇప్పుడు స్వయంగా ప్రభుత్వ భవనాలకే తాళాలు వేయాల్సిన అవమానకర పరిస్థితి నెలకొంది. ప్రైవేటు భవనాల అద్దెల విషయంలో .. భవన యజమానులు అద్దె బకాయిలు ఇవ్వాలని, వ్యవసాయ సహాయకుపైనే ఒత్తిడి చేస్తున్నారు. గ్రామాల్లో అద్దెభవనాలను ఎంపిక చేసింది వారే కాబట్టి, ఇప్పుడు సహాయకుల పరిస్థితి కుడితోపడ్డ ఎలుక మాదిరి అవుతోంది.
కరెంట్ ‘కట్’ కట..
‘‘విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ’’ అంటూ జగనన్న ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న రైతు భరోసా కేంద్రాలకు.. ఇంటి అద్దెలే కాదు, కరెంటు బిల్లులూ కట్టలేని విషాదకర పరిస్థితి నెలకొంది. 10,778 రైతు భరోసాకేంద్రాలు, 56 హబ్‌లకు వ్యవసాయ శాఖనే కరెంటు బిల్లులు కట్టాల్సి ఉంది. కానీ క్రమం తప్పకుండా కరెంటు బిల్లులు కట్టకపోవడంతో, విద్యుత్ నిలిపివేయటం అనివార్యమవుతోంది. ఈ అవమానకర పరిస్థితిపై మీడియాలో కథనాలు వస్తున్నా సర్కారులో చలనం లేదు. వ్యవసాయశాఖలో కింద నుంచి పైవరకూ చెప్పే సమాధానం ఒకటే. ‘‘బడ్జెట్ రావలసిఉంది. వచ్చిన వెంటనే చెల్లించేస్తాం’’. ఇదీ ఆ జవాబు.
ఉద్యోగులకు గ్రామసచివాలయాలే దిక్కు
కాగా, అద్దెలు చెల్లించకపోవడంతో రైతుభరోసా కేంద్రాలకు భవన యజమానులు తాళాలు వేస్తున్న నేపథ్యంలో.. ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్రాలకు తాళాలు వేయడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియని ఉద్యోగులు విధిలేక గ్రామసచివాలయాల్లో కూర్చుంటున్నారు.
వైసీపీ వారయినా తాళాలు కామన్
ఇక్కడ ఇక్కడో విచిత్రమైన విషయమేమిటంటే… గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలను అద్దెకిస్తున్న వారిలో 90 శాతం వైసీపీ స్థానిక కార్యకర్తలే. అయినా సరే.. లెక్క లెక్కేనంటున్నారు. అద్దెలు చెల్లించకపోతే సొంత
ప్రభుత్వమయినా సహించేది లేదని, నిర్మొహమాటంగా భవనాలకు తాళాలు వేస్తున్నారు. మరికొన్ని చోట్లయితే అద్దెభవనాలు చెల్లించాలంటూ, భవన యజమానులయిన వైసీపీ కార్యకర్తలే ధర్నాలు చేస్తున్నారు.