– బహిరంగ చర్చకు బుగ్గన రాజేంద్రనాథ్ సిద్థం
– చర్చ ఎప్పుడు, ఎక్కడో యనమల రామకృష్ణుడు చెప్పాలి
– గంటకు రూ.21 కోట్ల అప్పు
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డి
తాడేపల్లి: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, బహిరంగ చర్చకు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిద్ధమని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఆ చర్చ ఎప్పుడు, ఎక్కడో యనమల చెప్పాలని ఆయన కోరారు.
జగన్ తన హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని యనమల ఆరోపిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన దానికి, యనమల ఆరోపణకు ఏ మాత్రమైన పొంతన ఉందా? మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుపై పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో చెప్పింది ఏంటి? ఇప్పుడు యనమల ఆరోపిస్తోంది ఏమిటి? అంటే అసెంబ్లీలో మీరు మాట్లాడేవన్నీ అసత్యాలు అనుకోవాలా? .
రాజకీయాల్లో తనంత సీనియర్ లేడని, సంపద సృష్టించడం తనకు తెలుసని, అలా సంపద సృష్టించి అన్ని పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబుగారు, అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పని చేయకపోగా, 18 నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తెస్తున్న డబ్బంతా ఏం చేస్తుందన్న దానికి సమాధానం చెప్పడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరి వెంకట్‌రెడ్డి ఆక్షేపించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచాయి. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబుగారు ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. బడ్జెట్ లోపల రూ.1,54,850 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా రూ.71,295 కోట్లు, అమరావతి పేరుతో మరో రూ.40 వేల కోట్లు.. అన్నీ కలిపి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పు చేసింది. ఇంకా బెవరేజెస్ కార్పొరేషన్, అమరావతి పేరుతో మరిన్ని అప్పులు కలిపితే ఆ మొత్తం రూ.2.80 లక్షల కోట్లు దాటుతుంది. అంటే ఈ ప్రభుత్వం రోజుకు సగటున రూ.502 కోట్లు, గంటకు రూ.21 కోట్ల అప్పు చేస్తోంది.
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెందిన రూ.1.90 లక్షల కోట్ల విలువైన ఆస్తులు తాకట్టు పెట్టి రూ.9 వేల కోట్లు అప్పు చేశారు. ఆ బాండ్లపై రూ.150 కోట్ల కమీషన్ చెల్లించారు. ఇప్పుడు కూడా బెవరేజెస్ కార్పొరేషన్ అప్పుల బాండ్లకు సంబంధించి 1.5 శాతం కమీషన్‌గా రూ.82 కోట్లు చెల్లిస్తున్నారు.
వైయస్ జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ అప్పట్లో మా ప్రభుత్వం ఏకంగా రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని విష ప్రచారం చేశారు.
మరి ఇప్పుడు అదే మీడియా చంద్రబాబు, లోకేష్, పవన్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు?. అప్పుల రత్న అంటూ అప్పట్లో వైయస్ జగన్‌పై ట్వీట్లు పెట్టిన పవన్‌కళ్యాణ్, ఇవాళ అప్పుల రత్న చంద్రబాబు, అప్పుల రాజు లోకేష్ అని ఎందుకు ట్వీట్ చేయడం లేదు?.