Suryaa.co.in

Editorial

లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం?

– శుక్రవారం ఢిల్లీ నుంచి రాజమండ్రికి లోకేష్
– ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసే అవకాశం?
– హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు లోకేష్ దరఖాస్తు
– ఢిల్లీలో లోకేష్ కదలికలపై ఏపీ పోలీసుల నిఘా
– అక్కడ లోకేష్‌ను అరెస్టు చేసే ప్రయత్నం
– అనుమతించని ఢిల్లీ సర్కార్?
– రాజమండ్రి ఎయిర్‌పోర్టులోనే అరెస్టుకు రంగం సిద్ధం?
– ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు పదును పెడుతున్న జగన్ సర్కార్
– బ్రాహ్మణితో యువగళం కొనసాగించేలా నిర్ణయం ?
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీని నిర్యీర్యం చేసేందుకు వైసీపీ సర్కారు మరో అడుగువేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు జైల్లో ఉంచిన జగన్ సర్కారు.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇన్నర్ రింగ్‌రోడ్డు అక్రమాలకు సంబంధించి ఇప్పటికే నారా లోకేష్‌ను ఏ-14గా నమోదుచేసిన జగన్ సర్కారు… ఇప్పుడు ఆ కేసులో ముద్దాయిగా ఉన్న లోకేష్‌ను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి లోకేష్ కదలిలకపై ఏపీ నిఘాదళం ఢిల్లీలో కన్నేసింది. జాతీయ నేతలు, ఎంపీలను కలుస్తూ తన తండ్రికి మద్దతు కూడగడుతున్న లోకేష్‌ను, అక్కడే అరెస్టు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

అయితే ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించలేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ నుంచి రాజమండ్రి విమానాశ్రాయానికి రానున్న లోకేష్‌ను.. అక్కడే అరెస్టు చేసేందుకు, జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అరెస్టు చేస్తే శాంతిభద్రతల సమస్యలతోపాటు, సానుభూతి కూడా లభించే ప్రమాదం ఉన్నందున, లోకేష్‌ను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు లోకేష్‌కు సైతం స్పష్టమైన సమాచారం ఉందని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ముద్దాయిగా ఉన్న లోకేష్‌ను, విచారణ కోసం అరెస్టు చేస్తున్నట్లు చెప్పేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది.

అయితే తన అరెస్టుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, అరెస్టు చేయడానికి వీల్లేదని న్యాయవాదులు చెబుతున్నారు. అయినప్పటికీ నిందితుడిని అరెస్టు చేయవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలాఉండగా లోకేష్ అరెస్టు తర్వాత, ఆయన భార్య బ్రాహ్మణి యువగళం పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి లోకేష్ పాదయాత్రను ప్రారంభించాలని భావించినప్పటికీ, పార్టీ సీనియర్లు వారించి, సుప్రీంకోర్టు తీర్పు వరకూ వేచిఉండాలని నిర్ణయించడంతో ఆయన పాదయాత్ర వాయిదా పడింది.

LEAVE A RESPONSE