– ఏం హక్కు ఉందని ఢిల్లీలో నిరసనలు చేశారు?
– చంద్రబాబు అరెస్టు ఏపీకి మాత్రమే సంబంధించింది కాదు
– టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు-టీడీపీ శ్రేణులు హైదరాబాద్‌లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంపై మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించడాన్ని.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఖండించారు. జాతీయ స్థాయి నాయకుడైన చంద్రబాబునాయుడు అరెస్టుపై నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉందన్నారు. ఉద్యమ సమయంలో ఏ హక్కుతో అమెరికాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే…
హైదరాబాద్ పదేళ్లపాటు తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధాని. ఏపీ అంశంపై హైదరాబాద్‌లో నిరసన జరపవద్దు అంటే ఎలా? నిరసనలు చేయవద్దన్న కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం. ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది?
ఉద్యమ సమయంలో అమెరికాలోనూ నిరసనలు జరిగాయి.ఏం హక్కు ఉందని అమెరికాలో నిరసనలు చేశారు? ప్రతి సమస్యకు ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఏం హక్కు ఉందని ఢిల్లీలో నిరసనలు చేశారు?
చంద్రబాబు అరెస్టు ఏపీకి మాత్రమే సంబంధించింది కాదు. చంద్రబాబు జాతీయ స్థాయి వ్యక్తి. అరెస్టుపై తెలంగాణలో నిరసన తెలపడంలో తప్పేముంది? నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదు నిరసన తెలిపే హక్కును ఎవ్వరూ కాలరాయలేరు. ఏ పార్టీ వాళ్లయినా నిరసన తెలిపే హక్కు ఉంది