Suryaa.co.in

Telangana

కాళేశ్వరం ప్రాజెక్టు స్కాంలో సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సిద్ధమా?

-కాళేశ్వరానికి ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏంటి?
– కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందా?
– కేంద్రానికి లేఖ రాయాలనుకుంటున్నారా లేదా..?
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
– ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్య లోపాయికారి ఒప్పందం
– కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి

సీబీఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి చిత్తశుద్ధి చాటుకోవాలి. కాళేశ్వరానికి ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందా..?

ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారతీయులందరూ గర్వపడేలా అంతరిక్షరంగంలో నూతన ప్రయోగాలకు జనవరి 1 వేదిక కావడం.. పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం ‘ఇస్రో’ ప్రయోగం విజయవంతమవ్వడంతో కొత్త ఉత్తేజం నింపింది.2024 సంవత్సరం.. గగన్ యాన్ సంవత్సరంగా నిలవనుంది. ఇస్రో శాస్త్రజ్ఞులకు తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, ప్రాజెక్టుల్లో స్కాంలపై దర్యాప్తు చేపడుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు.. ఇంజనీరింగ్ మార్వెల్.. కేసీఆర్ అపరభగీరథుడని బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. చీఫ్ ఇంజినీర్ అవతారమెత్తి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వెచ్చించిన లక్షకోట్లు ఏమయ్యాయి..?

21 అక్టోబరు, 2023న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగినట్లు గుర్తించడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై నాడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాశాం. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. 24 అక్టోబరు, 2023న హైలెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ప్రాజెక్టును విజిట్ చేసి జరిగిన నష్టాన్ని, నిర్మాణంలో జరిగిన పొరపాట్ల గురించి ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి చర్చించారు. 20 అంశాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరితే తప్పించుకున్నారు. కేవలం 11 అంశాలపై మాత్రమే అరకొరగా సమాధానమిచ్చారు. తమ అసమర్థత, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రాజెక్టు వివరాలను బీఆర్ఎస్ సర్కారు గోప్యంగా ఉంచింది.

ప్రాజెక్టు కట్టడంలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఊచలు లెక్కబెడుతోంది..? ప్రాజెక్టు విషయంలో విచారణ కోసం నాడు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ను అడిగినప్పటికీ.. సీబీఐ ఎంక్వైరీకి అంగీకరించలేదు. తెలంగాణలో ప్రాజెక్టులపై సీబీఐ దర్యాప్తులకు అనుమతి నిరాకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అవినీతికి, కాంగ్రెస్ పార్టీకి విడదీయలేని బంధం ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనేక స్కాంలతో కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని దోపిడీ చేసింది.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పట్ల.. కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటే.. రెండూ బొమ్మాబొరుసు పార్టీలే. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.. కాంగ్రెస్ పొత్తులో భాగంగానే రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. కాబట్టి .. దగ్గరి మిత్రుల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోలుబొమ్మలాట ఆడుతున్నాయి.

ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తామన్న రేవంత్ రెడ్డి.. నేడు సీబీఐ ఎంక్వైరీకి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం లేదు ఎందుకు..? సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపై దీనిపై సీబీఐ దర్యాప్తునకు అంగీకరిస్తారా లేదా..? కేంద్రానికి లేఖ రాయాలనుకుంటున్నారా లేదా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ తుమ్మితే పడిపోయే ప్రభుత్వం. అందుకే, కేసీఆర్ పార్టీకి మేలుచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్య లోపాయికారి ఒప్పందంతో అవగాహనకు వచ్చినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దమ్ముంటే సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలి. ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ జరపాలని కేంద్రాన్ని కోరితే 48 గంటల్లో దర్యాప్తును ప్రారంభిస్తుంది.

LEAVE A RESPONSE