– రాజధాని చుట్టుపక్కల వర్షపు నీరు
– తొలిసారి రహదారులపై చేరిక
– జీఏడి టవర్ల పునాదుల్లోకి నీరు
– నీరు బయటకు వెళ్లే కాలువల ఆక్రమణ
కృష్ణాయపాలెం వద్ద కొండవీటివాగులో పెరిగిన గుర్రపుడెక్క
– సీఆర్డిఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దిక్కులేదు
– దాని ఫలితమే ఈ నష్టమంటున్న రైతులు
అమరావతి రాజధాని ప్రాంతంలోపాటు చుట్టుపక్కలున్న మంగళగిరి, తాడికొండ, పెదపరిమి, నీరుకొండ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. మంగళవారం అర్థరాత్రి కురిసిన వర్షంతో రాజధాని కోసం కొత్తగా ఆమోదించిన పెద్దమద్దూరు, ప్రతిపాదిత మోతడక, నిడుముక్కల ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహించాయి.
ఎద్దువాగు పొంగడంతో అమరావతి విజయవాడ, కొట్టేళ్లవాగు, కొండవీటివాగు పొంగడంతో గుంటూరు తాడికొండ అమరావతి మధ్య రాకపోకలు నిలిచాయి. జాతీయ రహదారిపై కాజ టోల్గేట్ వద్ద నీరు నిలిచి రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది.
మంగళగిరి టిక్కో కాలనీ నీటమునిగింది. విజయవాడ దగ్గర బుడమేరులోకి నీరురావడంతో, కట్టపక్కన ఉంటున్న ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. అయితే రెగ్యులేటర్ వద్ద నీరు లేదని కలెక్టర్ ప్రకటించారు.
ఉండవల్లిలో వరిపొలాలు నీటమునిగాయి. కుంచనపల్లి వద్ద పొలాల్లోపెద్దఎత్తున నీరు నిలిచి ఆకుకూరలు, పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇబ్రహీంపట్నంలో పలుకాలనీల్లో అడుగుమేర నీరొచ్చింది.
సుదీర్ఘకాలం తరువాత సీతానగరంలో మేఘా లిఫ్టు ద్వారా నీటిని తోడి కృష్ణానదిలో పోస్తున్నారు. అమరావతి రాజధాని నగరంలో జిఎడి టవర్ల ర్యాఫ్టుల్లో రెండు వర్షపునీటితో నిండాయి. మరోవైపు రాజధానిలోకి వచ్చి చేరే నీరు బయటకు వెళ్లే కాలువల్లో అడ్డంకులు ఏర్పడ్డాయి. జాతీయ రహదారితోపాటు, ఈ 8,9,10,11 రోడ్లపై వంతెనల నిర్మాణాల సమయంలో కాలువలు పూడిపోయాయి. వాటిని సరిచేయలేదు.
వెంకటపాలెం సమీపంలో జాతీయ రహదారి నిర్మాణ సమయంలో పాలవాగు వంతెన వద్ద కాలువ పూడుకుపోయింది. దీన్ని క్లియర్ చేయలేదు. జాతీయ రహదారి నిర్మించడంతో కొండవీటివాగు నుండి వచ్చే నీరు కూడా వచ్చి ఇదే మార్గం నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మార్గం లేకపోవడంతో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కృష్ణాయపాలెం వద్ద కొండవీటివాగులో గుర్రపుడెక్క పెరిగింది. దీన్ని తొలగించాలని రైతులు గతంలో సిఆర్డిఏ కమిషనర్ దృష్టికి తీసుకెళితే ఆగస్టు, సెప్టెంబరు నాటికి క్లియర్ చేస్తామని చెప్పినా పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు నీటికి అడ్డుపడుతోంది. జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ వద్ద రెండు అడుగులకుపైన నీరు నిలిచింది. బయటకు పోయేమార్గం లేకపోవడంతో గంటల తరబడి నిలిచిపోయింది.
మంగళగిరి నగరంలో ఎక్కడికక్కడ వర్షపునీటితో నిండిపోయాయి. తాడికొండ మండలం, తుళ్లూరు మండల పరిధిలోని రాజధానికి సరిహద్దు గ్రామాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది. అమరావతి బ్లూప్లాన్లో భాగంగా తవ్విన కాలువలలోకి వచ్చే నీరు బయటకు వెళ్లే మార్గం సరిగా ఏర్పాటు చేయలేదు.
అయితే గతంలో ఎంత వర్షం వచ్చినా నీరు వెళ్లిపోయేది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వెంచర్లు వేయడం కాలువలు ఆక్రమించడంతో ఎక్కడికి అక్కడ పొలాల్లో నీరు నిలిచింది. నాగార్జున యూనివర్సిటీ చుట్టుపక్కల కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. యూనివర్సిటీ హాస్టళ్ళు ముంపునకు గురయ్యాయి.
రాజధాని చుట్టూ రియల్ ఎస్టేట్ కంపెనీలు వేస్తున్న వెంచర్లు రాజధాని ప్రజల జీవితాలు, వారి పంటలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే దిక్కు లేకపోవడం విచారకరం. ప్రధానంగా కొండవీటివాగులో గుర్రపుడెక్కపై రైతులు చాలా నెలల క్రితమే సీఆర్డిఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దానిని తొలగించకపోతే.. అది వర్షాకాలంలో ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించినా ఫలితం లేదు.
ఆగ స్టు, సెప్టెంబర్ నాటికి తొలగిస్తానన్న కమిషనర్ హామీ కొండెక్కిన ఫలితంగా, తాజాగా కురిసిన భారీ వర్షాలకు రైతులు తమపంటపొలాలు నష్టపోక తప్పలేదు. నిజాయితీ-ముక్కుసూటిగా పనిచేసే అధికారులను బదిలీచేసి, వ్యవసాయం-రైతుల సమస్యలపై అవగాహన లేని అధికారులను.. ‘ఎవరి ఒత్తిళ్ల’కో నియమించుకుంటే, ఫలితాలు ఇంతకుమించి ఎందుకు భిన్నంగా ఉంటాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208